ప్రపంచ పరిశ్రమల హబ్‌గా తెలంగాణ

దిగ్గజ సంస్థల పెట్టుబడులతో తెలంగాణ ప్రపంచ పారిశ్రామిక కేంద్రంగానే గాక బలమైన ఆర్థికశక్తిగా ఎదుగుతోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఫ్రాన్స్‌కి చెందిన

Published : 30 Sep 2022 06:43 IST

ష్నైడర్‌ విద్యుత్‌ పరికరాల పరిశ్రమ శంకుస్థాపనలో మంత్రి కేటీఆర్‌

రూ. 1000 కోట్ల పెట్టుబడి.. మూడు వేల మందికి ఉపాధి

హైదరాబాద్‌లో త్వరలో ఫ్రాన్స్‌ కాన్సులేట్‌: రాయబారి ఇమ్మానుయేల్‌

ఈనాడు, హైదరాబాద్‌: దిగ్గజ సంస్థల పెట్టుబడులతో తెలంగాణ ప్రపంచ పారిశ్రామిక కేంద్రంగానే గాక బలమైన ఆర్థికశక్తిగా ఎదుగుతోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఫ్రాన్స్‌కి చెందిన ప్రపంచ దిగ్గజ విద్యుత్‌ పరికరాల తయారీ సంస్థ ష్నైడర్‌ శంషాబాద్‌ జీఎంఆర్‌ పారిశ్రామిక పార్కులో రూ. వెయ్యి కోట్లతో ఏర్పాటు చేస్తున్న భారీ పరిశ్రమకు గురువారం హైదరాబాద్‌లో ఫ్రాన్స్‌ రాయబారి ఇమ్మానుయేల్‌ లెనైన్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘ప్రసిద్ధ పారిశ్రామిక సంస్థ ష్నైడర్‌ దేశంలోనే అతిపెద్ద పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేయడం తెలంగాణకు గర్వకారణం. దీని ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పించేలా శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం సహకరిస్తుంది’ అని తెలిపారు.

కేటీఆర్‌ అత్యంత సానుకూల పరిశ్రమల మంత్రి: రాయబారి లెనైన్‌
త్వరలో హైదరాబాద్‌లో ఫ్రాన్స్‌ కాన్సులేట్‌ కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు ఆ దేశ రాయబారి ఇమ్మానుయేల్‌ లెనైన్‌ తన ప్రసంగంలో తెలిపారు. కేటీఆర్‌ దేశంలో అత్యంత సానుకూల పరిశ్రమల మంత్రి అని ప్రశంసించారు. హైదరాబాద్‌లో పరిశ్రమ ఏర్పాటు ద్వారా ష్నైడర్‌ కొత్త మైలురాయిని చేరుకుందన్నారు.

ష్నైడర్‌ భారత విభాగం సీఈవో, ఎండీ అనిల్‌ చౌదరి, సీనియర్‌ ఉపాధ్యక్షుడు జావెద్‌ అహ్మద్‌లు మాట్లాడుతూ, దేశంలోనే అతిపెద్ద పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే ఏడాది సెప్టెంబరు నాటికి పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభిస్తాం. మొదటి దశలో రూ. 300 కోట్ల పెట్టుబడులతో వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తాం. రెండు లక్షల చదరపు అడుగుల స్థలంలో పరిశ్రమను నిర్వహిస్తాం. ఆ తర్వాత రెండు దశల్లో మరో రూ. 700 కోట్ల పెట్టుబడులతో మరో రెండు వేల మందికి ఉపాధి అందిస్తాం. అత్యున్నత 4.0 సాంకేతిక పరిజ్ఞానంతో ఈ పరిశ్రమ నడుస్తుంది. తెలంగాణ కేంద్రంగా భారత్‌లో తయారీకి పునాది వేస్తున్నాం’ అని తెలిపారు. సమావేశంలో పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ్రాన్స్‌ వాణిజ్య బృందం ప్రతినిధులతో మంత్రి భేటీ
తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామమని, అన్ని రంగాల్లోనూ అపార అవకాశాలున్నాయని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ తెలిపారు. గురువారం ఆయన ఫ్రాన్స్‌ వాణిజ్యమిషన్‌ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఇక్కడ ఉన్న సానుకూల పరిస్థితులను పవర్‌ పాయింట్‌ ద్వారా వివరించారు. ఫ్రాన్స్‌ రాయబారి ఇమ్మానుయేల్‌ లెనైన్‌, వాణిజ్య బృందం ప్రతినిధులు పాల్‌ హెర్మెలిన్‌, గెరాల్డ్‌ వోల్ఫ్‌, తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం రాయబారి ఇమ్మానుయేల్‌, బెంగళూరు కాన్సుల్‌ జనరల్‌ థెర్రీ బెర్త్‌లాట్‌లతో కేటీఆర్‌ భేటీ అయ్యారు. పారిశ్రామిక, వాణిజ్య సంబంధాలు, పెట్టుబడులు, ఇతర అంశాలపై చర్చించారు. హైదరాబాద్‌లో ఫ్రాన్స్‌ కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయం (హౌస్‌ ఆఫ్‌ ఫ్రాన్స్‌) 2023 జూన్‌ నాటికి అందుబాటులోకి వస్తుందని లెనైన్‌ వెల్లడించగా, కేటీఆర్‌ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

నీతి ఆయోగ్‌ సిఫార్సులను అమలు చేయాలి
మిషన్‌ భగీరథకు జాతీయ అవార్డు రావడంపై మంత్రి కేటీఆర్‌ గురువారం ట్విటర్‌లో హర్షం వ్యక్తం చేశారు. ఇకనైనా ఎన్డీయే ప్రభుత్వం ఈ పథకానికి రూ. 19 వేల కోట్లు ఇవ్వాలన్న నీతి ఆయోగ్‌ సిఫార్సులను గౌరవిస్తే బాగుంటుందని సూచించారు.

జంతు సంరక్షణ యోధులకు కేటీఆర్‌ సాయం
తెలంగాణలోని జంతుసంరక్షణ యోధుల సంఘం (యానిమల్‌ వారియర్స్‌ సొసైటీ) ప్రతినిధులకు మంత్రి కేటీఆర్‌ తన సొంత నిధులతో బొలెరో వాహనాన్ని, మరో రూ. 5 లక్షల సాయాన్ని అందించారు. గత జులైలో వరద ప్రాంతాల్లో మూగజీవాలను కాపాడేందుకు ముందుకొచ్చిన ఈ సంస్థ ప్రతినిధులు వాహనం లేకపోవడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను మంత్రికి ట్విటర్‌లో తెలపగా, ఆయన స్పందించారు. గురువారం ప్రగతిభవన్‌లో వారికి వాహనాన్ని, పక్షుల సంరక్షణ కేంద్రం అభివృద్ధికి రూ. 5 లక్షల ఆర్థికసాయాన్ని అందజేశారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని