రక్షిత అడవుల్లో ఖనిజాల తవ్వకం!

రాష్ట్రంలోని రక్షిత అటవీ ప్రాంతాలు, పులుల రక్షిత ప్రాంతాల్లో (టైగర్‌ రిజర్వు)ని ఖనిజ సంపదపై తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ) దృష్టి సారించింది. తవ్వకాలకు లీజు

Published : 30 Sep 2022 05:33 IST

ఏడు ప్రాంతాల్లోని 481 ఎకరాల్లో క్వార్ట్జ్‌ మైనింగ్‌కు టీఎస్‌ఎండీసీ దరఖాస్తు 

ఇందులో 91 ఎకరాలు టైగర్‌ రిజర్వులో

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని రక్షిత అటవీ ప్రాంతాలు, పులుల రక్షిత ప్రాంతాల్లో (టైగర్‌ రిజర్వు)ని ఖనిజ సంపదపై తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ) దృష్టి సారించింది. తవ్వకాలకు లీజు కోసం 7 దరఖాస్తులు సమర్పించింది. అటవీశాఖ నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) ఇస్తే స్పటిక శిల (క్వార్ట్జ్‌), ఫెల్స్‌పార్‌ ఖనిజాల్ని తవ్వి తీయడానికి సిద్ధమవుతోంది.

మూడు జిల్లాల పరిధిలో
నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో క్వార్ట్జ్‌, ఫెల్స్‌పార్‌ ఖనిజ సంపదతో కూడిన గుట్టలు భారీ స్థాయిలో ఉన్నాయి. టీఎస్‌ఎండీసీ.. డీజీపీఎస్‌ (డిఫరెన్షియల్‌ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌) సర్వే సైతం నిర్వహించి ఈ విషయాన్ని నిర్ధారించుకుంది. ఆమన్‌గల్‌ మండలంలోని 314-317 అటవీ కంపార్ట్‌మెంట్లలో క్వార్ట్జ్‌ నమూనాలను సైతం సేకరించింది. మొత్తం 7 అటవీ ప్రాంతాల్లోని 481.97 ఎకరాల్లో మైనింగ్‌ లీజు కోసం గనులశాఖకు దరఖాస్తు చేసింది. మైనింగ్‌ ప్రాంతం హద్దులు, మైనింగ్‌ ప్లాన్‌, ఇతర వివరాలను సైతం అందించినట్లు సమాచారం. ఈ 7 ప్రదేశాలు అటవీ భూములు కావడంతో ఆ శాఖ నుంచి ఎన్‌ఓసీ రావాల్సి ఉంది.

ఈ ప్రాంతాల్లో దరఖాస్తులు..
* నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట డివిజన్‌లోని చెరుకూరు బీట్‌ (పెద్దపులుల రక్షిత ప్రాంతం)లో 91.62 ఎకరాల్లో..

* ఆమనగల్లు రేంజ్‌లోని మురళీనగర్‌ (46.13 ఎకరాలు), పోరండ్ల (40.99 ఎకరాలు)

* రంగారెడ్డి జిల్లా పరిధి కడ్తాల్‌ సెక్షన్‌ రక్షిత అటవీ ప్రాంతాల్లోని సాలార్‌పూర్‌ (44.25 ఎకరాలు), చిప్‌నూతల (16.75 ఎకరాలు)

* మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలంలోని తిరుమలపల్లి (62.69 ఎకరాలు), మునిమోక్షం (179.54 ఎకరాలు)

ప్రైవేటు మైనింగ్‌ వ్యాపారులు సైతం..
ఆమనగల్లు రక్షిత అడవుల్లోని స్పటిక శిల ఖనిజసంపదపై ప్రైవేటు మైనింగ్‌ వ్యాపారులు సైతం కన్నేశారు. ఇందుకోసం ప్రభుత్వ శాఖలతో కలిసి సంయుక్త సర్వే చేసినట్లు అటవీశాఖ వర్గాల సమాచారం. ఇక్కడ కొంత రెవెన్యూ భూముల్లో, మరికొంత రిజర్వు ఫారెస్ట్‌లో ఈ ఖనిజ సంపద ఉన్నట్లు గుర్తించారు. కొద్దినెలల క్రితమే వీరు లీజు కోసం దరఖాస్తు చేసినట్లు తెలిసింది. మార్బుల్‌ కంటే స్పటిక శిలలు, ఫెల్స్‌పార్‌ గ్రానైట్‌ ఖరీదైన ఖనిజాలని మైనింగ్‌ వ్యాపారులు చెబుతున్నారు. క్వార్ట్జ్‌, ఫెల్స్‌పార్‌ రాళ్లను పిండిగా మార్చి, విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. గాజు, సిరామిక్‌ పరిశ్రమల్లో పెద్దఎత్తున వినియోగిస్తున్నారు.

పచ్చదనానికి, వన్యప్రాణులకు నష్టం
రక్షిత అటవీ ప్రాంతాల్లో మైనింగ్‌తో పచ్చదనానికి తీవ్ర నష్టం వాటిల్లడంతో పాటు.. వన్యప్రాణులు ఆవాసం కోల్పోతాయి. చెరుకూరు బీట్‌ పెద్దపులుల బఫర్‌ జోన్‌ కాగా.. ఇక్కడ మైనింగ్‌తో పులులపై ప్రభావం పడే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాలు టైగర్‌ రిజర్వు పరిధి కాకపోకపోయినా అక్కడా వన్యప్రాణుల సంచారం ఉంది. చిప్‌నూతల, పోరండ్ల, మురళీనగర్‌లో జింకలు, అడవిపందుల సంచారం ఉంది. పోరండ్లకు అమ్రాబాద్‌ నుంచి చిరుతలు వచ్చిపోతుంటాయి.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని