‘టమాటా పండటం’లో ఆ జన్యువే కీలకం!

టమాటా.. పండుగా మారేందుకు కారణమయ్యే ప్రత్యేక జన్యువును హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం, దిల్లీ విశ్వవిద్యాలయం పరిశోధకులు కనుగొన్నారు. ‘ఎస్‌ఐఈఆర్‌ఎఫ్‌.డీ7’ అనే

Published : 30 Sep 2022 05:33 IST

హెచ్‌సీయూ, దిల్లీ విశ్వవిద్యాలయ సంయుక్త పరిశోధనలో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: టమాటా.. పండుగా మారేందుకు కారణమయ్యే ప్రత్యేక జన్యువును హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం, దిల్లీ విశ్వవిద్యాలయం పరిశోధకులు కనుగొన్నారు. ‘ఎస్‌ఐఈఆర్‌ఎఫ్‌.డీ7’ అనే జన్యువు కారణంగా ఇథిలిన్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ ప్రేరేపితమై.. టమాటా ఎరుపు రంగులోకి మారుతున్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్లాంట్‌ సైన్సెస్‌ సహాయ ఆచార్యుడు రాహుల్‌ కుమార్‌, దిల్లీ విశ్వవిద్యాలయ ప్లాంట్‌ మాలిక్యులర్‌ బయాలజీ ఆచార్యుడు అరుణ్‌కుమార్‌ శర్మ ఆధ్వర్యంలో సహ ఆచార్యులు సంయుక్తంగా చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెలుగు చూశాయి.  టమాటాలో ఉండే ఇథిలిన్‌ హార్మోన్‌ కారణంగా సహజసిద్ధంగా పండుగా మారుతుంది. ఈ హార్మోన్‌ను ఎన్నో రకాల జన్యువులు ప్రేరేపిస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించినా.. ప్రధానంగా ఏ జన్యువు పనితీరు కీలకమో ఇప్పటివరకు వెలుగులోకి రాలేదు. తాజాగా హెచ్‌సీయూ, దిల్లీ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఆ గుట్టు విప్పారు. ఇథిలిన్‌ హార్మోన్‌ పని తీరును ఎస్‌ఐఈఆర్‌ఎఫ్‌.డీ7 జన్యువు ప్రభావితం చేస్తోందని తేల్చారు. ఈ జన్యువును ప్రేరేపించినప్పుడు ఇథిలిన్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ ఊపందుకొని టమాటా పండుగా మారింది.  జన్యువు పనితీరును మందగించేలా చేసినప్పుడు.. పండుగా మారలేదు. టమాటా నిల్వ పద్ధతుల మెరుగుకు ఈ జన్యువు పనితీరు కీలకం కానుందని పరిశోధకులు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని