ముందస్తుగానే దసరా కిక్కు

రాష్ట్రంలో దసరా పండగకు వారం రోజుల ముందే మద్యం విక్రయాలు ఊపందుకున్నాయి. సాధారణ రోజుల్లో నిత్యం రూ.60-90 కోట్ల విలువైన విక్రయాలు సాగుతాయి. ప్రస్తుతం డిపోల నుంచి దుకాణాలకు రోజుకు రూ.100 కోట్లకుపైగా మద్యం తరలుతోంది.

Published : 30 Sep 2022 06:10 IST

 ఇప్పటివరకు రూ.25 వేల కోట్లు దాటిన మద్యం విక్రయాలు

డిసెంబరు వరకు రూ.35 వేల కోట్లు దాటుతాయని అంచనా

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో దసరా పండగకు వారం రోజుల ముందే మద్యం విక్రయాలు ఊపందుకున్నాయి. సాధారణ రోజుల్లో నిత్యం రూ.60-90 కోట్ల విలువైన విక్రయాలు సాగుతాయి. ప్రస్తుతం డిపోల నుంచి దుకాణాలకు రోజుకు రూ.100 కోట్లకుపైగా మద్యం తరలుతోంది. ఈ నెల 26న రూ.174.55 కోట్లు, 27న రూ.123.93 కోట్లు, 28న రూ.117.02 కోట్ల విలువైన విక్రయాలు జరిగాయి. కరోనా కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో మద్యం విక్రయాలపై ప్రభావం పడగా.. ఈసారి అది కనిపించడం లేదు. గతేడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు జరిగిన అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది అదే కాలానికి రూ.3,300 కోట్లకు పైగా ఎక్కువ విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది జనవరి నుంచి బుధవారం నాటికి రూ.25,223.58 కోట్ల మద్యం అమ్ముడుపోయింది. దసరాకు ఇంకా కొన్ని రోజులు మిగిలి ఉండటంతో రూ.26 వేల కోట్లు దాటే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది ఇంకా మూడు నెలలు మిగిలి ఉండటం.. డిసెంబరు 31 వేడుకల్లో మద్యం ఎక్కువగా అమ్ముడుపోయే అవకాశం లాంటి కారణాలతో విక్రయాల విలువ రూ.35 వేల కోట్లు దాటుతుందని ఎక్సైజ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అక్రమ మద్యం కట్టడిపై దృష్టి

మద్యం అమ్మకాల జోరు నేపథ్యంలో అక్రమ దిగుమతి నివారణపై రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ దృష్టి సారించింది. ఇతర రాష్ట్రాల మద్యంపై ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, టాస్క్‌ఫోర్స్‌ బృందాలు నిఘా విస్తృతం చేశాయి. ఇటీవల గోవా నుంచి తీసుకొచ్చిన 90 కార్టన్ల మద్యాన్ని మేడ్చల్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలో.. కర్ణాటక నుంచి తెచ్చిన 40 కార్టన్ల మద్యాన్ని గద్వాల జిల్లాలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి దిగుమతి అయిన మద్యం ఖరీదైనది కాగా.. కర్ణాటక నుంచి తీసుకొచ్చింది చీప్‌లిక్కర్‌ కావడం గమనార్హం. గోవా మద్యంపై ఒక్కో సీసాకు భారీగా లాభం ఉండటంతో వీటి దిగుమతిపై ముఠాలు ప్రధానంగా కన్నేసినట్లు దర్యాప్తులో తేలింది. కర్ణాటకలో చీప్‌లిక్కర్‌ ధర రూ.70 ఉండగా.. ఇక్కడ రూ.120కి విక్రయిస్తున్నారు. ఈ కారణంతో దాన్నీ ఎక్కువగా తీసుకొస్తున్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో మద్యం అక్రమ దిగుమతి కట్టడికి అధికారులు 20 సరిహద్దు తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు 4 రాష్ట్ర టాస్క్‌ఫోర్స్‌ బృందాలు, 64 ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలను రంగంలోకి దించారు. దసరా సీజన్‌లో గుడుంబా తయారీ పెరిగే అవకాశముండటంతో 139 ఎక్సైజ్‌ స్టేషన్ల సిబ్బంది అప్రమత్తమయ్యారు. భూపాలపల్లి, సూర్యాపేట, మహబూబాబాద్‌, కొత్తగూడెం, ఆదిలాబాద్‌ లాంటి జిల్లాల్లో గుడుంబా స్థావరాలపై నిఘా పెంచారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని