మలాయి భూముల మనోవేదన!

మంజీర నదీ తీరంలో ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూమిపై పూర్తి స్థాయి హక్కులు లభించక వేల మంది రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆ ప్రాంతంలోని పట్టా భూములను మలాయి(అంటే ఉర్దూలో వదిలివేసిన అని అర్థం)గా పిలుస్తారు.

Published : 30 Sep 2022 06:10 IST

 మంజీర తీరంలో నిషేధిత జాబితాలో వేల ఎకరాలు

వారసత్వ బదిలీకీ అవకాశం కరవు

ఈనాడు, హైదరాబాద్‌: మంజీర నదీ తీరంలో ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూమిపై పూర్తి స్థాయి హక్కులు లభించక వేల మంది రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆ ప్రాంతంలోని పట్టా భూములను మలాయి(అంటే ఉర్దూలో వదిలివేసిన అని అర్థం)గా పిలుస్తారు. వాటిని ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చడంతో సమస్య మొదలైంది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని బాన్సువాడ, బోధన్‌ రెవెన్యూ డివిజన్ల పరిధిలో వేల ఎకరాల సాగు భూముల హక్కుల కల్పన విషయంలో రెవెన్యూశాఖ అయిదేళ్లుగా స్పష్టత ఇవ్వడం లేదు. 1934లో నిర్వహించిన భూముల సర్వే సమయంలో మంజీర ప్రాంతంలోని భూములకు ప్రత్యేకంగా సర్వే నంబర్లు కేటాయించలేదు. దస్త్రాల్లో ‘మలాయి’ పేరిట నమోదు చేశారు. నదికి ఇరువైపులా సాగుకు అనువైన భూములను స్థానిక గ్రామాల రైతులు సాగు చేస్తూ వస్తున్నారు. ఈ భూములకు సంబంధించి పట్టాదారు పాసుపుస్తకాల్లో ‘ఎం’ శ్రేణిలో 1, 2, 3 అనే సంఖ్యల్లో మాత్రమే నంబర్లు కేటాయించారు. 2017 వరకు ఇవన్నీ పట్టా భూములుగానే ఉన్నాయి. అనంతరం చేపట్టిన భూదస్త్రాల ప్రక్షాళన కార్యక్రమంలో వీటిని ప్రభుత్వ భూములుగా గుర్తిస్తూ నిషేధిత జాబితాలో చేర్చారు. పట్టాదారు మరణిస్తే ఎసైన్డ్‌ భూముల తరహాలోనైనా వారసుల పేర్లపైకి యాజమాన్య హక్కులు బదిలీ చేయడం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

ప్రభుత్వం స్పందిస్తేనే...

ఏళ్ల తరబడి రెవెన్యూ దస్త్రాల్లో (1బి) చాలా మండలాల్లో మలాయి భూములను పట్టా భూములుగానే నమోదు చేస్తూ వచ్చారు. రైతులకు బ్యాంకులు కూడా రుణాలు మంజూరు చేశాయి. అయిదేళ్ల నుంచి భూముల రకంపై (నేచర్‌ ఆఫ్‌ ల్యాండ్‌) స్పష్టత కొరవడింది. నదీ పరీవాహకంలోని భూములు ప్రభుత్వానికే చెందుతాయని కొందరు రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. ఇనాం, పోరంబోకు, లావూణీ తదితర పేర్ల తీరులోనే వీటిని ఉదహరిస్తున్నారు. కానీ ఏళ్ల తరబడి పట్టాలుగా ఉన్నవాటిని.. ఎలా ప్రభుత్వ భూములంటారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఆందోళనలు జరిగాయి. జిల్లా ఉన్నతాధికారులు ఈ వివాదంపై భూపరిపాలన ప్రధాన కమిషనర్‌(సీసీఎల్‌ఏ) కార్యాలయానికి లేఖలు రాస్తున్నా స్పష్టత రావడంలేదు. ప్రభుత్వ స్థాయిలోనే ఈ భూములపై ఏదైనా నిర్ణయం తీసుకుంటే సమస్య సద్దుమణుగుతుందన్న అభిప్రాయం ఉంది. దీనిపై బాన్సువాడ ఆర్డీవో రాజాగౌడ్‌ను ‘ఈనాడు’ సంప్రదించగా.. చాలామంది రైతులు మలాయి సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. వీటిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని విజ్ఞప్తులు వస్తున్నాయని, దీనిపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపామని పేర్కొన్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని