ఆయిల్‌పాంపై ఆసక్తి పెంచే చర్యలేవీ?

‘ఆయిల్‌పాంను ఏటా 2 లక్షల ఎకరాల్లో అదనంగా వేయించాలి.. పామాయిల్‌ ఉత్పత్తి పెంచాలి’ అని పదేపదే చెబుతున్న రాష్ట్ర ఉద్యానశాఖ రైతులకు సాయం చేసే విషయంలో మాత్రం పూర్తిగా వెనుకబడింది. రాయితీ నిధుల పంపిణీ నిలిచిపోవడంతో

Published : 30 Sep 2022 06:10 IST

 పంటవేసే రైతులకు సాయం శూన్యం

రూ.వెయ్యి కోట్ల బడ్జెట్‌లో రూపాయీ రాకపాయె..

ఈనాడు, హైదరాబాద్‌: ‘ఆయిల్‌పాంను ఏటా 2 లక్షల ఎకరాల్లో అదనంగా వేయించాలి.. పామాయిల్‌ ఉత్పత్తి పెంచాలి’ అని పదేపదే చెబుతున్న రాష్ట్ర ఉద్యానశాఖ రైతులకు సాయం చేసే విషయంలో మాత్రం పూర్తిగా వెనుకబడింది. రాయితీ నిధుల పంపిణీ నిలిచిపోవడంతో పంట సాగుపై ఆసక్తి సన్నగిల్లుతోంది. ఈ ఏడాది దీని సాగు విస్తీర్ణం పెంపునకు ఏకంగా రూ.వెయ్యి కోట్లను బడ్జెట్‌లో ఉద్యానశాఖకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కానీ, ఇప్పటివరకూ రైతులకు ఒక్క రూపాయీ ఇవ్వలేదు. ఈ మొక్కల మధ్య అంతరపంట వేసుకోవడానికి ఎకరానికి రూ.4,200 చొప్పున రైతు బ్యాంకు ఖాతాలో వేస్తామని ఉద్యానశాఖ విరివిగా ప్రచారం చేస్తోంది. ఈ ఏడాది 5 లక్షల ఎకరాల్లో పంట వేయించాలని తొలుత లక్ష్యంగా పెట్టుకున్నారు. తర్వాత దాన్ని 2 లక్షల ఎకరాలకు.. చివరికి 78 వేల ఎకరాలకు కుదించారు. అయినా.. ఇప్పటికి 26 వేల ఎకరాల్లోనే రైతులు మొక్కలు నాటారు. కనీసం వీరికైనా ఎకరానికి రూ.4,200 చొప్పున బ్యాంకు ఖాతాల్లో వేయలేదు. పంట సాగు చేసిన వారికే సొమ్ము రాకపోవడంతో ఇక కొత్తగా వేసేవారికి ఎప్పుడిస్తామని చెప్పాలో అర్థంకావడం లేదని ఓ మండల ఉద్యాన అధికారి ‘ఈనాడు’తో వాపోయారు.

ధరల పతనం..

ఆరునెలల క్రితం ఆయిల్‌పాం గెలల టన్ను ధర రికార్డు స్థాయిలో రూ.23 వేలు దాటింది. ఈ నేపథ్యంలో అధికారులు పెద్దఎత్తున ప్రచారం చేసి రైతుల్లో ఆసక్తి రేకెత్తించారు. ఈ పంటకు కేంద్రం మద్దతు ధర ప్రకటించే విధానం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో పామాయిల్‌ ధరల ఆధారంగా ప్రతినెలా మొదటివారంలో ఈ పంటకు ఎంత మొత్తం రైతుకు చెల్లించాలనేది ఉద్యానశాఖ నిర్ణయిస్తుంది. ఈ లెక్కన వచ్చే నెల(అక్టోబరు) నుంచి టన్ను  గెలలకు రూ.13 వేలు చెల్లించాలని ఉత్తర్వులివ్వడానికి కసరత్తు చేస్తున్నారు. ఉద్యాన శాఖ నుంచి సాయం లేకపోవడం, ధరల పతనం నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని