హనుమకొండ, యాదాద్రి జిల్లాల్లో లంపీస్కిన్‌

ఉత్తర భారత రాష్ట్రాల్లో రైతులను ఆందోళనపరుస్తున్న ‘ముద్దచర్మ’(లంపీస్కిన్‌) వ్యాధి తెలంగాణలోకి విస్తరించింది. యాదాద్రి జిల్లా గుండాల మండలం అనంతారంలో రెండు, హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం వంగపల్లిలో మరో ఆవుకు

Published : 30 Sep 2022 06:10 IST

3 ఆవులకు సోకినట్లు నిర్ధారణ

మరో 122 గోవుల నమూనాల పరీక్షల ఫలితాలకు ఎదురుచూపు

ఈనాడు, హైదరాబాద్‌: ఉత్తర భారత రాష్ట్రాల్లో రైతులను ఆందోళనపరుస్తున్న ‘ముద్దచర్మ’(లంపీస్కిన్‌) వ్యాధి తెలంగాణలోకి విస్తరించింది. యాదాద్రి జిల్లా గుండాల మండలం అనంతారంలో రెండు, హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం వంగపల్లిలో మరో ఆవుకు ఈ వ్యాధి సోకినట్లు పశుసంవర్ధకశాఖ చేసిన పరీక్షల్లో నిర్ధారణ అయింది. మరో 12 జిల్లాలకు చెందిన 122 ఆవులకు వ్యాధి లక్షణాలు కనిపించడంతో వాటి రక్తనమూనాలను సేకరించి మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని కేంద్ర ప్రభుత్వ హైసెక్యూరిటీ పశువ్యాధుల నిర్ధారణ ప్రయోగశాలకు పంపారు. ఈ పశువులున్న గ్రామాలకు చుట్టుపక్కల 224 గ్రామాల్లో మొత్తం 2645 పశువులకు వ్యాధి సోకిందేమోనని నమూనాలను సేకరిస్తున్నారు. ఇవి ఉన్న ప్రాంతాలకు 5 కిలోమీటర్ల పరిధిలోని మిగతా అన్నిరకాల 1,21,232 మూగజీవాలకు వ్యాధి సోకకుండా టీకాలు వేయించారు. ప్రభుత్వ పథకం కింద అందిన సాయంతో హనుమకొండ జిల్లాలోని ఒక రైతు ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసిన ఆవుకు ఈ వ్యాధి నిర్ధారణ అయినట్లు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ సంచాలకుడు డాక్టర్‌ రాంచందర్‌ ‘ఈనాడు’కు చెప్పారు. యాదాద్రి జిల్లా అనంతారం గ్రామంలో ఒక రైతుకు 15 వరకూ ఆవులున్నాయి. తొలుత రెండు గోవులకు వ్యాధి సోకగానే వాటిని వేరుచేసి ఉంచాలని స్థానిక పశువైద్యులు సూచించి వైద్యం చేశారు. కానీ ఆ రైతు వ్యాధి బారిన పడ్డ గోవులను వేరుచేయకపోవడంతో మరో రెండింటికి లంపీస్కిన్‌ లక్షణాలు కనిపించాయి. అనంతారం గ్రామంలో వరిపొలాల పక్కనే ఆవులను కట్టేయడంతో పైరులోని దోమలు వీటిపై వాలి వ్యాధిని వ్యాపింపజేస్తున్నట్లు గుర్తించామని రాంచందర్‌ చెప్పారు. ఈక్రమంలో ఇతర రాష్ట్రాల నుంచి పాడి పశువులను ఏ పథకం కింద గానీ, వ్యక్తిగతంగా గానీ తీసుకురాకుండా నిషేధం విధించినట్లు చెప్పారు. రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలు నిర్వహించి.. ఇతర రాష్ట్రాల పశువులు తెలంగాణలోకి తీసుకురాకుండా అడ్డుకోవాలని పోలీసు, రవాణాశాఖలను కోరామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని