పేదల కంట.. కొత్తింటి ఆనందం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రెండు పడకగదుల ఇళ్లు పేదలకు జీవితంపై భరోసాను కల్పిస్తున్నాయి. అద్దె కట్టలేక.. ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్న వారికి రూపాయి ఖర్చు లేకుండానే గృహాలు దక్కుతుండటంతో ఊరట లభిస్తోంది.

Published : 01 Oct 2022 04:35 IST

సిద్దిపేట జిల్లాలో వేగంగా రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపు
పారదర్శకంగా అర్హుల ఎంపిక
మంత్రి హరీశ్‌రావు చొరవతో వడివడిగా పనులు

ఈనాడు, సంగారెడ్డి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రెండు పడకగదుల ఇళ్లు పేదలకు జీవితంపై భరోసాను కల్పిస్తున్నాయి. అద్దె కట్టలేక.. ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్న వారికి రూపాయి ఖర్చు లేకుండానే గృహాలు దక్కుతుండటంతో ఊరట లభిస్తోంది. సిద్దిపేట జిల్లాలో ఈ పక్రియ వేగంగా సాగుతోంది. తొలుత సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేటల్లో ఆదర్శంగా తీర్చిదిద్ది.. ఆపై అన్నిచోట్లా ఇదే తరహాలో ఇళ్లను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సిద్దిపేట జిల్లాలో 15,826 గృహాలను నిర్మించాలనేది లక్ష్యం కాగా ఇప్పటివరకు 7,591 నిర్మాణాలు పూర్తయ్యాయి. వీటిలో 4,311 ఇళ్లను పంపిణీ చేశారు. ఇప్పటికే పూర్తయిన మరో 3,280 గృహాలకు సంబంధించి అర్హులను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోంది. సిద్దిపేట పురపాలిక పరిధిలోని నర్సాపూర్‌ వద్ద అన్ని హంగులతో గేటెడ్‌ కమ్యూనిటీకి ఏమాత్రం తీసిపోని విధంగా 2,460 ఇళ్లను జీప్లస్‌-2గా నిర్మించారు. డిసెంబరు 2020లో సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా పత్రాలను అందించారు. అనంతరం విడతల వారీగా సామూహిక గృహప్రవేశాలు చేపట్టారు. పేదల సొంతింటి కలను త్వరగా పూర్తి చేయడంలో మంత్రి హరీశ్‌రావు చొరవ కీలకంగా ఉంది. ఎప్పటికప్పుడు పనుల పురోగతి నుంచి అర్హుల ఎంపిక వరకు సమీక్షిస్తున్నారు. ఆయనే ప్రతి ఒక్కరికీ స్వయంగా పత్రాలు అందించి.. నూతన దుస్తులతో సత్కరించి గృహప్రవేశాలు చేయిస్తున్నారు. మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లోనూ వేగంగా పంపిణీ చేసే విషయమై ప్రత్యేక దృష్టి సారించారు. సంగారెడ్డి జిల్లాలో 2,563 ఇళ్లు నిర్మించగా.. 1,261 మందికి అందించారు. మెదక్‌ జిల్లాలో 2,344 నిర్మాణాలు పూర్తయ్యాయి.

అర్హులకే దక్కేలా..

పేదలకు.. నిజమైన అర్హులకే ఇళ్లు దక్కేలా దరఖాస్తులను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. బిగ్‌డేటా సాయంతో విశ్లేషిస్తున్నారు. తుది అర్హుల జాబితానూ ప్రదర్శిస్తున్నారు. దానిపై ఎవరికైనా అభ్యంతరాలుంటే వాటిని పరిగణనలోకి తీసుకొని మరోసారి విచారణ చేపడుతున్నారు. ఇలా పూర్తిగా అర్హులకే ఇళ్లు దక్కేలా చూస్తున్నారు. మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లోనూ ఇదే విధానాన్ని పాటిస్తున్నారు.


ఆత్మగౌరవంతో బతికేలా చూస్తున్నాం

-హరీశ్‌రావు, ఆర్థిక మంత్రి

నిరుపేదలకు అందించేలా సిద్ధంచేస్తున్న ఇళ్ల విషయంలో రాజీ పడటం లేదు. కొంత ఆలస్యమైనా నాణ్యతతో నిర్మిస్తున్నాం. అన్ని హంగులతో పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తున్నాం. దళితులు, మైనార్టీలు, సంచారజాతుల వారికి ప్రాధాన్యమిచ్చి ఆత్మగౌరవంతో బతికేలా చూస్తున్నాం. మిగతా నిర్మాణాలను వచ్చే మూడునెలల్లో పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి సారించాం. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణాలను పూర్తి చేసేందుకు సీఎం కేసీఆర్‌ రూ.వెయ్యి కోట్లు అందించారు. లబ్ధిదారుల ఎంపికను అత్యంత పారదర్శకంగా చేపడుతున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని