సకల సౌకర్యాలతో స్తంభోద్భవుడి క్షేత్రం

యాదాద్రి ఆలయంతోపాటు అనుబంధంగా జరిగే నిర్మాణాలు సకల సౌకర్యాలతో ఆధ్యాత్మిక శోభ విలసిల్లేలా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. క్షేత్రాభివృద్ధికి రూ.43 కోట్లను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి రహదారి మార్గంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు క్షేత్రానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌..

Published : 01 Oct 2022 06:58 IST

నాలుగు రకాలుగా ఆలయ నగరిలో కాటేజీల నిర్మాణం
అధికారులకు సీఎం ఆదేశాలు
విమానగోపుర స్వర్ణ తాపడానికి కిలో 16 తులాలకు చెక్కు సమర్పణ

ఈనాడు, నల్గొండ: యాదాద్రి ఆలయంతోపాటు అనుబంధంగా జరిగే నిర్మాణాలు సకల సౌకర్యాలతో ఆధ్యాత్మిక శోభ విలసిల్లేలా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. క్షేత్రాభివృద్ధికి రూ.43 కోట్లను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి రహదారి మార్గంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు క్షేత్రానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌.. తొలుత గిరి ప్రదక్షిణ చేశారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ(వైటీడీఏ), సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ప్రెసిడెన్షియల్‌ సూట్‌లో సమీక్ష నిర్వహించారు. అనంతరం కొండపైకి చేరుకొని సతీసమేతంగా ప్రధానాలయంలోని మూలవరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ కుటుంబసభ్యులతోపాటు వెంట వచ్చిన వారికీ పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు.

స్వర్ణతాపడానికి విరాళాలు..

ఆలయ దివ్య విమాన గోపురాన్ని స్వర్ణమయం చేసే ప్రక్రియలో భాగంగా గతంలో ప్రకటించిన కిలో 16 తులాల బంగారానికి సరిపడా విరాళం రూ.52.48 లక్షల చెక్కును సీఎం తన మనవడు హిమాన్షు చేతులమీదుగా ఆలయ ఈవో గీతారెడ్డికి అందజేశారు. స్వర్ణ తాపడం కోసం ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి రూ.20 లక్షలు, ఆయన భార్య రజిత పేరుతో రూ.30 లక్షలు, తెరాస రాష్ట్ర నాయకులు వేమిరెడ్డి నరసింహారెడ్డి రూ.51 లక్షలు, ఏనుగు దయానందరెడ్డి రూ.50 లక్షల చెక్కులను వేర్వేరుగా ఆలయ అధికారులకు సీఎం సమక్షంలోఅందజేశారు.

2,157 ఎకరాలు వైటీడీఏ నిర్వహణలోనే..

వైటీడీఏకు కావాల్సిన 2,157 ఎకరాలను రెవెన్యూ శాఖ పూర్తి స్థాయిలో అప్పగిస్తుందని.. దాని నిర్వహణను వైటీడీఏనే చూడాలని సీఎం కేసీఆర్‌ సమీక్షలో పేర్కొన్నారు. ఆ భూమిని ఆలయ అవసరాలతో పాటు పోలీసు, అగ్నిమాపక, ఆరోగ్య, రవాణా, పార్కింగ్‌ వంటి అవసరాలకే వినియోగించాలన్నారు. ఆలయ అర్చకులకు ఇళ్ల స్థలాలను సైతం ఇందులోనే కేటాయించాలని.. యాదాద్రిలో ఉన్న విలేకరులకు వైటీడీఏ బయటి ప్రాంతంలో ఇళ్ల స్థలాలను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆలయ నగరిలో 250 ఎకరాల్లో 250 కాటేజీలను నాలుగు భాగాలుగా విభజించి ఒక్కో భాగంలో ఒక్కో ఆకృతిలో నిర్మించాలన్నారు. వీటికి యాద మహర్షి, ప్రహ్లాద తదితర ఆలయ చరిత్రకు సంబంధించిన పేర్లను పెట్టాలని చెప్పారు.

100 ఎకరాల్లో నృసింహ అభయారణ్యం

ఆలయ నగరితోపాటు ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న కాటేజీల నిర్మాణం, ఆలయ వైభవాన్ని ప్రతిబింబించేలా ఉండాలని సీఎం అన్నారు. దాతలు కాటేజీల నిర్మాణం కోసం ఇచ్చే విరాళాలకు ఆదాయపు పన్ను మినహాయింపులకు సంబంధించిన అనుమతులు వెంటనే తీసుకోవాలని ఆదేశించారు. ఒక ప్రణాళిక ప్రకారం యాదాద్రి పరిసరాలు అభివృద్ధి కావాలని, హెలిపాడ్‌ నిర్మాణం వెంటనే చేపట్టాలన్నారు. జాగ్రత్తగా పరిశీలించిన మీదటే క్షేత్రంలో ప్రైవేటు నిర్మాణాలకు అనుమతులివ్వాలన్నారు. వైటీడీఏ పరిధిలో ఉన్న 100 ఎకరాల అడవిని నృసింహ అభయారణ్యం పేరిట అద్భుతంగా అభివృద్ధి చేసి.. స్వామివారి నిత్య పూజలు, కల్యాణం, అర్చనలకు సంబంధించిన పూలు, పత్రాలు అందులోనే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు విమాన గోపుర స్వర్ణ తాపడానికి రూ.23.99 కోట్లు, 7.8 కిలోల బంగారం విరాళంగా వచ్చినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.

యాదాద్రి పర్యటనలో సీఎం కేసీఆర్‌ వెంట మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు దామోదర్‌రావు, లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, శేఖర్‌రెడ్డి, లింగయ్య, సుధీర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, సీఎంవో కార్యదర్శి భూపాల్‌రెడ్డి, ఆలయ ఈవో గీతారెడ్డి, వైటీడీఏ వైస్‌ ఛైర్మన్‌ కిషన్‌రావు, దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ తదితరులున్నారు.


50 ఎకరాల్లో అమ్మవారి కల్యాణ మండపం

క్షేత్రంలో 50 ఎకరాల్లో అమ్మవారి పేరు మీద అద్భుతమైన కల్యాణ మండప నిర్మాణం చేపట్టాలని సీఎం తెలిపారు. ఆలయంతో పాటు రింగ్‌రోడ్డు మధ్యలో ఎక్కడా చుక్కనీరు నిలవకుండా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. దీక్షాపరుల మండపం, వ్రతమండపం, ఆర్టీసీ బస్టాండుల నిర్మాణంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆలయ ఆదాయం, ఖర్చుల ఆడిటింగ్‌ వ్యవస్థ అత్యంత పారదర్శకంగా ఉండేలా చూడాలని.. నిధులు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మినీ శిల్పారామం తరహాలో ఒక సమావేశ మందిరం, స్టేజీ, స్క్రీన్‌ ఏర్పాటు చేయాలని చెప్పారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts