భారీ వర్షం.. అతలాకుతలం

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లావ్యాప్తంగా రెండో రోజు శుక్రవారం కూడా భారీ వర్షాలు కురిశాయి. మహబూబ్‌నగర్‌లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కొన్ని కుటుంబాలను పురపాలక అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించి భోజన ఏర్పాట్లు చేశారు.

Published : 01 Oct 2022 05:53 IST

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో లోతట్టు ప్రాంతాల మునక
వాగులో ఒకరి గల్లంతు
వేర్వేరు జిల్లాల్లో పిడుగుపాటుకు ముగ్గురి మృతి
న్యూస్‌టుడే యంత్రాంగం

మ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లావ్యాప్తంగా రెండో రోజు శుక్రవారం కూడా భారీ వర్షాలు కురిశాయి. మహబూబ్‌నగర్‌లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కొన్ని కుటుంబాలను పురపాలక అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించి భోజన ఏర్పాట్లు చేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా తెలకపల్లి మండలం తాళ్లపల్లిలో పొలానికి వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో వాగు దాటుతూ రాఘవేంద్ర అనే యువకుడు గల్లంతయ్యాడు.

వర్షాల నేపథ్యంలో పిడుగుపాటుకు మూడు జిల్లాల్లో ముగ్గురు పశువుల కాపరులు మృతిచెందారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం గోదావరిగూడెం గ్రామానికి చెందిన కడారి జానయ్య (45), సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కృష్ణాపురానికి చెందిన ఆలే సైదా (38), జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం రాయాపురం గ్రామానికి చెందిన పాగుంటప్ప అలియాస్‌ గొరిగలన్న (55) మేకలను, పశువులను మేపడానికి పొలాలకు వెళ్లారు. వర్షం కురుస్తోందని వారు చెట్ల కిందకు చేరడంతో వాటిపై పిడుగులు పడి ముగ్గురూ మృతి చెందారు. పిడుగుపాటుకు నాగర్‌కర్నూల్‌ జిల్లా భూత్పూర్‌ మండలం కొత్తూరులో రెండు పశువులు, తాడూరు మండలం తుమ్మలసుగూరు శివారులో ఆవు, లేగదూడ, కోయిలకొండ మండలం ఖాజీపూర్‌లో 50 మేకలు చనిపోయాయి. ఖాజీపూర్‌లో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.


నేడు, రేపూ భారీవర్షాలు

బంగాళాఖాతంలో ఏపీ తీరం వద్ద గాలులతో ఉపరితల ఆవర్తనం 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. ఈ ఆవర్తనం నుంచి కర్ణాటక తీరం వరకు గాలులతో ఉపరితల ద్రోణి వ్యాపించింది. వీటి ప్రభావంతో తెలంగాణలో శని, ఆదివారాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. గురువారం ఉదయం 8 నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకూ పలుచోట్ల భారీవర్షాలు కురిశాయి. అత్యధికంగా మహబూబ్‌నగర్‌లో 13 సెంటీ మీటర్లు, కొడకండ్ల (జనగామ జిల్లా)లో 11 సెం.మీ. వర్షం కురిసింది. సింగరాజ్‌పల్లి (నల్గొండ)లో 8.3, దోమ (రంగారెడ్డి)లో 8, పోచంపల్లి(యాదాద్రి)లో 7 సెం.మీ. వర్షపాతం నమోదైంది.


భారీవర్షాలతో కొత్త రికార్డు

ఈనాడు, హైదరాబాద్‌: వానాకాలం సీజన్‌ భారీవర్షాలతో ముగిసింది. గత జూన్‌ ఒకటి నుంచి శుక్రవారం (సెప్టెంబరు 30) నాటికి రాష్ట్ర సాధారణ వర్షపాతం 734.8 మిల్లీమీటర్ల (మి.మీ.)కన్నా 46 శాతం అదనంగా కురిసింది. మొత్తం 1073.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. గత ఏడాది ఇదే నాలుగు నెలల్లో 1044.7 మి.మీ. కురిసి 39 శాతం అదనంగా నమోదవగా ఈ ఏడాది అంతకన్నా ఏడు శాతం ఎక్కువ నమోదైందని వాతావరణశాఖ శుక్రవారం తెలిపింది. జూన్‌లో 9, జులైలో 145, సెప్టెంబరులో 35 శాతం అధిక వర్షపాతం నమోదవగా ఆగస్టులో మాత్రమే మైనస్‌ 20కి పడిపోయింది. జిల్లాలవారీగా అత్యధికంగా జగిత్యాల, నిజామాబాద్‌లలో సాధారణంకన్నా 91 శాతం అధిక వర్షపాతం నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని