ఐడీసీ లిఫ్టుల మరమ్మతుల అంచనా రూ.50 కోట్లు!

గోదావరి వరదలు.. భారీ వర్షాలు.. ఇతరత్రా కారణాలతో రాష్ట్రంలో నీటిపారుదల అభివృద్ధి సంస్థకు చెందిన 60 చిన్నతరహా ఎత్తిపోతల పథకాలు చెడిపోయినట్లు గుర్తించారు. వీటి మరమ్మతులకు దాదాపు రూ.50 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేశారు.

Published : 01 Oct 2022 05:53 IST

60 ఐడీసీ ఎత్తిపోతల పథకాలు చెడిపోయినట్లు గుర్తింపు
ప్రతిపాదనలు పంపేందుకు నీటిపారుదలశాఖ కసరత్తు

ఈనాడు, హైదరాబాద్‌: గోదావరి వరదలు.. భారీ వర్షాలు.. ఇతరత్రా కారణాలతో రాష్ట్రంలో నీటిపారుదల అభివృద్ధి సంస్థకు చెందిన 60 చిన్నతరహా ఎత్తిపోతల పథకాలు చెడిపోయినట్లు గుర్తించారు. వీటి మరమ్మతులకు దాదాపు రూ.50 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ ఏడాది జులైలో కురిసిన భారీ వర్షాలకు నదీ తీరాల్లోని లిఫ్టుల వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. పైపులు, విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు కొట్టుకుపోయాయి. వరదలకు కొన్నిచోట్ల భూమిలోంచి బయటపడి విరిగిపోయాయి. మోటార్లలోకి నీళ్లు చేరాయి. విద్యుత్‌ ప్యానల్‌ బోర్డులు ధ్వంసమయ్యాయి. గోదావరి తీరం, ఉప నదుల పరీవాహకంలో ఎక్కువ నష్టం చోటుచేసుకుంది. దీంతోపాటు ఇతరత్రా కారణాలతో పలు లిఫ్టులు మొరాయిస్తున్నాయి. క్షేత్రస్థాయి సమస్యలపై ఎస్‌ఈల ఆధ్వర్యంలో జిల్లాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి అధ్యయనం చేయించారు. నీటిపారుదలశాఖ ఆదేశాల మేరకు మరమ్మతులకు సంబంధించిన ప్రతిపాదనలను జిల్లాల నుంచి అందగా తుది అంచనాలు రూపొందిస్తున్నారు.

నిధులు వస్తేనే మరమ్మతులు

రాష్ట్రంలో కృష్ణా, గోదావరి తీరాల్లో 260 ఎత్తిపోతల పథకాల కింద ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. ప్రస్తుతం 60 పథకాలు చెడిపోయాయి. గోదావరి వరదలకు దాదాపు 16 లిఫ్టులు రూపురేఖలు కోల్పోయాయి. అన్నింటినీ పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు ఇప్పటివరకు రూ.50 కోట్లు అవసరమని గుర్తించారు. ప్రతిపాదనలు సిద్ధమయ్యాక ప్రభుత్వానికి పంపేందుకు నీటిపారుదలశాఖ కసరత్తు చేస్తోంది. కుమురం భీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి జిల్లాలతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని లిఫ్టులు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రధాన నదులతో పాటు వాగులు, ఉప నదులపైన కూడా కొన్ని ఉన్నాయి. యాసంగి పంటలకు నీరందాలంటే వీటి మరమ్మతులు తప్పనిసరని రైతులు పేర్కొంటున్నారు. ఈ పథకాల కింద 63,500 ఎకరాల ఆయకట్టు ఉంది.

ఈ ఏడాది జులై నుంచి ఇప్పటివరకు కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 845 చెరువులు, కాలువలకు నష్టం వాటిల్లినట్లు నీటిపారుదలశాఖ ఓ అండ్‌ ఎం విభాగం అంచనా వేసింది. ఎక్కువగా చెరువులకు నష్టం సంభవించింది. ప్రాజెక్టుల కింద 235 చోట్ల కాలువల కట్టలు కోతకు గురికాగా, బుంగలు పడటం లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈఎన్‌సీ నుంచి దిగువ స్థాయి ఇంజినీర్లకు అత్యవసర వ్యయం కింద కేటాయించిన నిధుల నుంచి ప్రాథమిక మరమ్మతులు పూర్తి చేసినా.. కొన్నిచోట్ల శాశ్వత మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. వీలైనంత వరకు ఎప్పటికప్పుడు బాగుచేసి నీటి వనరులను పునరుద్ధరించినట్లు ఓ అండ్‌ ఎం విభాగం అధికారులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని