యాసంగిపై ఎన్నో ఆశలు!

ఆశావహ వాతావరణంలో కొత్త యాసంగి (రబీ) సీజన్‌ శనివారం (అక్టోబరు 1) నుంచి ప్రారంభమవుతోంది. వచ్చే ఏడాది మార్చి వరకూ ఈ సీజన్‌లో రైతులు పంటలు సాగు చేయనున్నారు. సెప్టెంబరు 30తో ముగిసిన వానాకాలం సీజన్‌లో రాష్ట్రంలో రికార్డుస్థాయిలో కోటీ 36 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేశారు. 

Published : 01 Oct 2022 05:53 IST

నేటి నుంచి సీజన్‌ ప్రారంభం
ముగిసిన వానాకాలం పంటల సాగు
ఎరువుల కేటాయింపును తగ్గించిన కేంద్రం

ఈనాడు, హైదరాబాద్‌: ఆశావహ వాతావరణంలో కొత్త యాసంగి (రబీ) సీజన్‌ శనివారం (అక్టోబరు 1) నుంచి ప్రారంభమవుతోంది. వచ్చే ఏడాది మార్చి వరకూ ఈ సీజన్‌లో రైతులు పంటలు సాగు చేయనున్నారు. సెప్టెంబరు 30తో ముగిసిన వానాకాలం సీజన్‌లో రాష్ట్రంలో రికార్డుస్థాయిలో కోటీ 36 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేశారు.  వాటిలో పప్పుధాన్యాల పంటలు ఇప్పటికే కోతకు వస్తున్నాయి. మిగిలిన పంటలకు సైతం రైతులు అక్టోబరు నుంచి కోతలు ప్రారంభించి.. వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించనున్నారు. కేంద్రం కొత్త పంటలకు 2022-23 సంవత్సరానికి ప్రకటించిన నూతన మద్దతు ధరలను రైతులకు చెల్లించాల్సిన కొత్త ‘మార్కెటింగ్‌ ఏడాది’ కూడా అక్టోబరు 1 నుంచే ప్రారంభమై 2023 సెప్టెంబరు చివరి వరకూ కొనసాగుతుంది. ఈమేరకు శనివారం నుంచి మార్కెట్లలో పంటలు విక్రయించే రైతులు.. తమకు కొత్త మద్దతు ధరలనే చెల్లించాలని వ్యాపారులను డిమాండ్‌ చేయాలని మార్కెటింగ్‌ శాఖ వర్గాలు తెలిపాయి.

అరకోటి ఎకరాలకు పైమాటే..!

రాష్ట్రంలో యాసంగి సీజన్‌ సాధారణ సాగు విస్తీర్ణం 46.49 లక్షల ఎకరాలు కాగా గతేడాది (2021) 55 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. 2020లో ఏకంగా 67.47 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈ ఏడాది వానాకాలంలో జులై నుంచి ఇంతవరకు రాష్ట్రంలో జోరుగా వర్షాలు కురుస్తున్నందున జల వనరులు కళకళలాడుతున్నాయి. సాగునీరు పుష్కలంగా అందుబాటులో ఉన్న సంవత్సరాల్లో యాసంగిలో పంటలు రికార్డుస్థాయిలో రైతులు సాగుచేయడం ఆనవాయితీ. ఈ అంచనాల ప్రకారం ఈ సీజన్‌లో కూడా అరకోటి ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పంటలు వేసే అవకాశం ఉందన్న అంచనాలతో వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది.

తగ్గిన యూరియా కేటాయింపు..

దేశంలో రసాయన ఎరువుల వాడకాన్ని గణనీయంగా తగ్గించాలని కేంద్ర వ్యవసాయశాఖ ఇటీవల అన్ని రాష్ట్రాలకు సూచించింది. భూసార పరీక్షలు చేయించి.. తదనుగుణంగానే ఎరువులు వాడేలా రైతులను చైతన్యపరచాలని తెలిపింది. సేంద్రీయ ఎరువుల వాడకం పెరిగేలా ప్రోత్సహిస్తే రసాయన ఎరువుల వాడకం తగ్గుతుందని సూచించింది. ఈ నేపథ్యంలో సాగు ప్రారంభమవుతున్న యాసంగి పంటలకు వానాకాలంతో పోలిస్తే 9.34 లక్షల టన్నుల ఎరువులను తక్కువగా కేంద్ర ఎరువుల శాఖ తెలంగాణకు కేటాయించింది. గత ఏడాది యాసంగిలో యూరియా 8.50 లక్షల టన్నులు ఇచ్చింది. ఈ సీజన్‌లో అంత వినియోగం ఉండదని, పైగా వానాకాలంలో మిగిలిన నిల్వలుంటే వాడుకోవాలంటూ 7.89 లక్షల టన్నులే కేటాయించింది. వరి సాగు విస్తీర్ణం 2020 యాసంగిలో 52 లక్షల ఎకరాలు దాటింది. ఈ సీజన్‌లో సైతం సాగునీరు పుష్కలంగా అందుబాటులో ఉన్నందున విస్తీర్ణం గణనీయంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది జూన్‌ నుంచి ఇంతవరకు వానాకాలంలో సైతం రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 64.50 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేసినందున ఈ పంటకు అక్టోబరులో యూరియా వినియోగం గణనీయంగా ఉండొచ్చన్న అంచనాలున్నాయి. కాగా ఎరువుల కొరత ఏమీ ఏర్పడదని, యాసంగిలో పంటలు సాగయ్యే తీరును బట్టి అవసరమైతే కేంద్రం అదనంగా సరఫరా చేస్తుందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. అధిక వర్షాలతో వానాకాలం పంటలు ఆలస్యంగా సాగు చేసినందున ఈ యాసంగిలో కొత్తగా విత్తనాలు, నాట్లు వేయడం ఆలస్యమయ్యే సూచనలున్నట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. అయితే వచ్చే మార్చి చివరికల్లా యాసంగి వరికోతలు పూర్తయ్యేలా రైతుల్లో అవగాహన కల్పించాలని, తద్వారా ఏప్రిల్‌లో వడగండ్లు, అధిక వర్షాలతో పంట నష్టాలు లేకుండా బయటపడవచ్చని అధికారులకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. విత్తనాలు, ఎరువులకు కొరత లేకుండా రైతులకు సరఫరా చేయాలని ఆయన ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని