మావోయిస్టులకు ‘చెక్‌’పోస్టులు!

రాష్ట్రంలోకి మావోయిస్టుల చొరబాటును నియంత్రించేందుకు పోలీసుశాఖ పటిష్ఠ వ్యూహం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఛత్తీస్‌గడ్‌ సరిహద్దుల్లోని కీలక ప్రాంతాల్లో ప్రత్యేకంగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తోంది. వీటి పనితీరును పరిశీలించిన తర్వాత మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోనూ ఇలాంటివి ఏర్పాట్లు చేయాలని పోలీసులు భావిస్తున్నారు.

Published : 01 Oct 2022 05:53 IST

ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఏర్పాటు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోకి మావోయిస్టుల చొరబాటును నియంత్రించేందుకు పోలీసుశాఖ పటిష్ఠ వ్యూహం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఛత్తీస్‌గడ్‌ సరిహద్దుల్లోని కీలక ప్రాంతాల్లో ప్రత్యేకంగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తోంది. వీటి పనితీరును పరిశీలించిన తర్వాత మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోనూ ఇలాంటివి ఏర్పాట్లు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. పొరుగున ఉన్న ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టులు తరచూ హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాజీపుర్‌, సుక్మా జిల్లాల్లో ఇన్ఫార్మర్ల నెపంతో వరుసగా హత్యలకు పాల్పడుతున్నారు. అభివృద్ది కార్యక్రమాల కోసం వినియోగిస్తున్న యంత్ర సామాగ్రిని ధ్వంసం చేస్తున్నారు. ఏమాత్రం అదను చిక్కినా రాష్ట్రంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గడ్‌లో మకాం వేసిన మావోయిస్టులు రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకునేందుకు తెలంగాణ పోలీసులు సరిహద్దు ప్రాంతాల్లో నిరంతరం కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. అక్కడి పోలీసులతో అవగాహన కుదుర్చుకొని కీలకమైన ప్రాంతాల్లో ఆ రాష్ట్రంలోకి వెళ్లి కూడా గాలింపులు చేపడుతున్నారు. అయితే మావోయిస్టులు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నట్లు.. పోలీసుల కదలికలు తక్కువగా ఉండే ప్రాంతాల గుండా ఒకరిద్దరు చొప్పున చొరబడేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు నిఘావర్గాలు గుర్తించాయి. దీన్ని ఎదుర్కొనేందుకు పోలీసులు ప్రతివ్యూహం రూపొందిస్తున్నారు. ఈమేరకు ఛత్తీస్‌గడ్‌ సరిహద్దుల్లోని చర్ల మండలం పూసుగుప్ప, బద్దిపేట, చెన్నాపురంలలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. త్వరలోనే పున్నవెల్లి, బోధనెల్లిలలో మరో రెండింటిని నెలకొల్పేందుకు సిద్ధమవుతున్నారు.

నిరంతర గస్తీ

ఈ చెక్‌పోస్టుల్లో గ్రేహౌండ్స్‌ బలగాలను సిద్ధంగా ఉంచుతారు. వీరంతా నిరంతరం గస్తీ నిర్వహిస్తుంటారు. అవసరమైతే సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందితో కలిసి గస్తీ చేపడతారు. ఎక్కడైనా మావోయిస్టుల కదలికలు కనిపిస్తే వెంటనే సమీపంలోని చెక్‌పోస్టుల్లో ఉన్న అదనపు బలగాలను రంగంలోకి దింపుతారు. మరోవైపు ఛత్తీస్‌గడ్‌ పోలీసులతోనూ సమన్వయం చేసుకుంటూ వ్యూహాత్మకంగా రెండువైపులా నిరంతరం గస్తీ ఉండేలా తెలంగాణ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క మావోయిస్టును కూడా రాష్ట్రంలోకి చొరబడనీయకుండా చేయడమే తమ లక్ష్యమని అధికారులు చెబుతున్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts