ఇందూ ఈస్ట్రన్‌పై దివాలా పిటిషన్‌

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో ఇందూ-హౌసింగ్‌ బోర్డుపై సీబీఐ నమోదుచేసిన కేసులో పదో నిందితుల జాబితాలో ఉన్న ఇందూ ఈస్ట్రన్‌ ప్రావిన్స్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభించాలని హైదరాబాద్‌కు చెందిన కాన్సెప్ట్‌ నిర్మాణ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ బెంచ్‌లో పిటిషన్‌ దాఖలుచేసింది.

Published : 01 Oct 2022 05:53 IST

నోటీసులు జారీ చేసిన ఎన్‌సీఎల్‌టీ

ఈనాడు, హైదరాబాద్‌: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో ఇందూ-హౌసింగ్‌ బోర్డుపై సీబీఐ నమోదుచేసిన కేసులో పదో నిందితుల జాబితాలో ఉన్న ఇందూ ఈస్ట్రన్‌ ప్రావిన్స్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభించాలని హైదరాబాద్‌కు చెందిన కాన్సెప్ట్‌ నిర్మాణ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ బెంచ్‌లో పిటిషన్‌ దాఖలుచేసింది. ఈ పిటిషన్‌పై ఎన్‌సీఎల్‌టీ జ్యుడిషియల్‌ సభ్యులు డాక్టర్‌ ఎన్‌వీ బద్రీనాథ్‌, సాంకేతిక సభ్యులు ఎ.వీరబ్రహ్మారావులతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ తమకు రూ.61 కోట్ల బకాయిలను చెల్లించడంలో ఇందూ ఈస్ట్రన్‌ కంపెనీ విఫలమైందన్నారు. మరోవైపు హౌసింగ్‌బోర్డుతో ఒప్పందం ప్రకారం బండ్లగూడ, హైటెక్‌సిటీ, కూకట్‌పల్లిలో గృహనిర్మాణ సముదాయాలను ఇందూ గ్రూపు అనుబంధ సంస్థ ఇందూ ఈస్ట్రన్‌ ప్రావిన్స్‌ ప్రాజెక్ట్స్‌ ప్రత్యేక ప్రాజెక్టుగా ఏర్పాటై పనులు మొదలుపెట్టింది. ఇప్పటికే ఫ్లాట్లు, విల్లాలు అమ్మినా సీబీఐ కేసుతో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. రిజిస్ట్రేషన్‌ చేయించాలని ఇందూతో పాటు హౌసింగ్‌బోర్డుకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండగా ఇక్కడ దివాలా పరిష్కార ప్రక్రియ చేపట్టాలని కాన్సెప్ట్‌ నిర్మాణ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పిటిషన్‌ వేయడంపై ఫ్లాట్లు కొన్నవారి తరఫు న్యాయవాది రాజశేఖర్‌ సల్వాజి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌ను అనుమతిస్తే ఇందూ ఈస్ట్రన్‌ కంపెనీకి చెందిన లావాదేవీలపై నిషేధం వర్తిసుందని, దాంతో కొన్నవారికి నష్టం వాటిల్లుతుందన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం ఇందూ ఈస్ట్రన్‌ ప్రావిన్స్‌ ప్రాజెక్ట్‌ లిమిటెడ్‌కు నోటీసులు జారీచేసింది. దీనిపై 3 వారాల్లో కౌంటరు దాఖలుచేయాలని ఆదేశించింది. ఫ్లాట్లు కొన్నవారు ఇందులో దరఖాస్తు చేస్తే పరిశీలిస్తామని పేర్కొంది.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts