దొంగల చేతికే తాళాలు..!

బ్యాంకుల్ని లూటీ చేయడం పాత పద్ధతి. ఏటీఎంలకు డబ్బు సరఫరా చేసే వాహనాలతో పరారవడం కొత్త పద్ధతి. ఆయుధాలు అవసరం లేదు. మందీమార్బలంతో పనిలేదు. దోచుకోవాలన్న దుర్బుద్ధి పుడితే చాలు. ఎంచక్కా నగదు వాహనంతో ఉడాయిస్తున్నారు.

Published : 01 Oct 2022 06:19 IST

ఏటీఎం నగదు వాహనాలతో ఉడాయిస్తున్న చోరులు
రెండు రాష్ట్రాల్లోనూ పెరుగుతున్న ఘటనలు

బ్యాంకుల్ని లూటీ చేయడం పాత పద్ధతి. ఏటీఎంలకు డబ్బు సరఫరా చేసే వాహనాలతో పరారవడం కొత్త పద్ధతి. ఆయుధాలు అవసరం లేదు. మందీమార్బలంతో పనిలేదు. దోచుకోవాలన్న దుర్బుద్ధి పుడితే చాలు. ఎంచక్కా నగదు వాహనంతో ఉడాయిస్తున్నారు. ఈ తరహా కేసులు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. ఆనక పోలీసులు ఆపసోపాలు పడి పట్టుకుంటున్నా నగదు రికవరీలో సమస్యలుంటున్నాయి. గతంలో హైదరాబాద్‌లోని దుండిగల్‌, చిలకలగూడా పోలీస్‌స్టేషన్ల
పరిధిలో ఇలాంటి ఉదంతాలు జరిగాయి.

దొంగల వద్దకే దోపిడీ

ఒకప్పుడు బ్యాంకులకు కన్నాలు వేసేవారు. లేదంటే పట్టపగలే ఆయుధాలతో సిబ్బందిని బెదిరించి అందినకాడికి దోచుకొని పరారయ్యేవారు. ఖాతాదారులకు మెరుగైన సేవలందించాన్న ఉద్దేశంతో బ్యాంకులు ఏటీఎం వ్యవస్థను అందుబాటులోకి తెచ్చాయి. ఖాతాదారుల మాటేమోకాని దొంగలకు మాత్రం ఇది వరంలా మారింది. బ్యాంకులతో పోల్చుకుంటే ఏటీఎంలకు భద్రత తక్కువ. పైగా ఊరి చివరన, మారుమూల ప్రాంతాల్లోనూ ఇవి ఉంటాయి. ఇలాంటి వాటిని లక్ష్యంగా చేసుకొని దొంగలు దోపిడీకి ప్రయత్నిస్తున్నారు. ఏటీఎంలను బద్దలు కొట్టి నగదు దోచుకున్న సంఘటనలు వెలుగు చూశాయి. బిహార్‌ లాంటి రాష్ట్రాల్లో అయితే లారీకి ఏటీఎంను కట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్లిన ఘటనలూ ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే అసలు ఏటీఎంకు డబ్బు పెట్టేందుకు వెళ్లే వాహనాలతో ఉడాయించడం మరో ఎత్తు. తాజాగా కడపలో జరిగిన ఉదంతమే ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలకు కారణాలు, వైఫల్యాలపై ఆరా తీస్తే అనేక ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి.

లోపాల్ని గమనించి.. ముందస్తు వ్యూహంతో..  

ఏటీఎం యంత్రాల్లో నగదు నింపే బాధ్యతలను దాదాపు అన్ని బ్యాంకులు ప్రైవేటు భద్రత సంస్థలకు అప్పగిస్తున్నాయి. బ్యాంకు చెస్ట్‌ల నుంచి ప్రత్యేక వాహనాల్లో నగదు తీసుకెళ్లి నిర్దేశిత ఏటీఎంలలో నగదు నింపటం ఆ సంస్థల ప్రధాన బాధ్యత. ఈ డబ్బు దారి మళ్లకుండా అవి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంటాయి. ఇందులో భాగంగా డబ్బు తరలించే వాహనాలకు జీపీఎస్‌ పరికరాలు అనుసంధానించి కార్యాలయల నుంచి గమనిస్తుంటాయి. అత్యవసర పరిస్థితుల్లో ఆ వాహనం కదలకుండా నిలిపివేయించగలిగే వ్యవస్థ, దాడి జరిగితే వెంటనే సమాచారం తెలిసేలా పానిక్‌బటన్‌ వంటివి కూడా ఈ వాహనాల్లో ఉంటాయి. సొత్తు కొల్లగొట్టాలనుకునే వాహనాల డ్రైవర్లు ఆచరణలోని లోపాల్ని గమనించి వాటినే అవకాశంగా మలుచుకుని ఉడాయిస్తున్నారు. నగదు ఉన్న వాహనంతో ఎక్కువ దూరం వెళితే జీపీఎస్‌ ట్రాకింగ్‌ ద్వారా ఉనికి తెలిసిపోతుందన్న భావనలో దొంగలు.. డబ్బుతో ఉడాయించిన కొద్దిసేపటికే ముందుగానే సిద్ధం చేసిపెట్టుకున్న వాహనంలోకి మారి పారిపోతున్నారు. ఈ తరహా ఘటనల్లో పోలీసులు నిందితుల్ని పట్టుకుంటున్నా నగదు పూర్తిగా రికవరీ అవ్వట్లేదు. నిందితులను పట్టుకోవటం జాప్యమవుతున్న కొద్దీ నగదు రికవరీ తగ్గుతోంది.

కేంద్ర హోంశాఖ జారీ చేసిన మార్గదర్శకాలు..

వాహనం డ్రైవర్‌తో పాటు ఇద్దరు కస్టోడియన్లే కాకుండా కనీసం ఇద్దరు శిక్షణ పొందిన సాయుధగార్డులు తప్పనిసరిగా ఉండాలి.  

గార్డులను నియమించుకునే సమయంలో వారి నేపథ్యం, ప్రవర్తనపై పరిశీలన చేయించడం తప్పనిసరి. ఎంపిక సమయంలోనే వీరికి శిక్షణ ఇవ్వడంతో పాటు రెండేళ్లకోసారి రిఫ్రెష్‌మెంట్‌ శిక్షణ ఇవ్వాలి.

ఒక్కో ట్రిప్పులో రూ.5 కోట్లు మాత్రమే తరలించాలి.

నగదును తీసుకెళ్లే వాహనాలకు జీపీఎస్‌ సదుపాయం తప్పనిసరి. వాటి కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కంట్రోల్‌రూంను ఏర్పాటు చేసుకోవాలి.

ఏజెన్సీలు నగదును భద్రపరిచే ఎస్టాబ్లిష్‌మెంట్‌(ప్రాంగణం) పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో ఉండాలి. చిన్న పట్టణాల్లోని ప్రాంగణాల్లో రూ.10 కోట్లలోపు నగదునే నిల్వ ఉంచుకోవాలి. ఈ ప్రాంగణానికి 24్ల7 సీసీ కెమెరా నిఘాతోపాటు సెక్యూరిటీగార్డుల పర్యవేక్షణ ఉండాలి.

నగర ప్రాంతాల్లోని ఏటీఎంలలో రాత్రి 9లోపు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే సాయంత్రం 6 గంటల్లోపే నగదును నింపాలి.

నగదును తరలించే వాహనం కనీసం 2,200 సీసీ సామర్థ్యం కలిగి ఏడేళ్లలోపుది అయిఉండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని