స్వచ్ఛతకు అందలం

కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా పట్టణాలు, నగరాలకు ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ -2022 అవార్డులలో తెలంగాణ 16 పురస్కారాలను కైవసం చేసుకుంది.

Published : 02 Oct 2022 02:30 IST

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రానికి అవార్డుల పంట

ప్రజల భాగస్వామ్యం కేటగిరీలో మూడోస్థానంలో సిద్దిపేట

10 లక్షల పైన జనాభా విభాగంలో గ్రేటర్‌ హైదరాబాద్‌కు 10వ ర్యాంకు

దిల్లీలో పురస్కారాలు అందుకున్న ప్రతినిధులు

ఈనాడు, దిల్లీ, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా పట్టణాలు, నగరాలకు ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ -2022 అవార్డులలో తెలంగాణ 16 పురస్కారాలను కైవసం చేసుకుంది. జోనల్‌ కేటగిరీ అవార్డుల్లో దక్షిణాది జోన్‌లో సత్తా చాటింది. రాష్ట్రానికి చెందిన మున్సిపాలిటీలు అత్యధిక అవార్డులు పొందాయి. రాష్ట్రపతి ద్రౌపదీముర్ము, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్‌ కిషోర్‌ శనివారం ఈ అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌, బడంగ్‌పేట మేయర్‌ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, తుర్కయాంజల్‌ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ మల్‌రెడ్డి అనూరాధ రాంరెడ్డి తదితరులు పురస్కారాలను అందుకున్నారు. ఇప్పటికే కొన్ని అవార్డులను ప్రకటించగా వాటికి మరికొన్ని అదనంగా చేరాయి.

లక్షలోపు జనాభా కలిగిన మున్సిపాలిటీల వారీగా తీసుకుంటే మొత్తం 15 అవార్డులు లభించాయి. పౌరుల ప్రతిస్పందనలో (సిటిజన్స్‌ ఫీడ్‌బ్యాక్‌) దేశంలోనే సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ప్రథమ స్థానం పొందింది. దీంతో మొత్తం 16 అవార్డులు దక్కాయి. జాతీయ స్థాయిలో అత్యధికంగా ప్రజల భాగస్వామ్యం కలిగిన (సిటిజన్‌ పార్టిసిపేషన్‌) మున్సిపాలిటీల కేటగిరీలో సిద్దిపేట మూడోస్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా మహారాష్ట్ర తరువాత తెలంగాణ 16 అవార్డులతో రెండోస్థానంలో నిలిచిందని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌ తెలిపారు. మంత్రి కేటీఆర్‌ మార్గనిర్దేశం, ప్రోత్సాహంతో ఇదిసాధ్యమైందన్నారు.

జాతీయస్థాయి ర్యాంకులు పరిగణనలోకి తీసుకుంటే 10లక్షలకు పైగా జనాభా కలిగిన నగరాల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ 10వ ర్యాంకులో నిలిచింది. 10 లక్షల లోపు జనాభా కలిగిన మున్సిపాలిటీలు, నగరాల జాబితాలో సిద్దిపేట మున్సిపాలిటీ 20వ స్థానం పొందింది. వరంగల్‌ 62, కరీంనగర్‌ 67, నిజామాబాద్‌ 92, జగిత్యాల 96 ర్యాంకులు సాధించాయి. లక్ష.. ఆపై జనాభా కలిగిన 100 మున్సిపాలిటీలు, నగరపాలికలకు ర్యాంకుల్ని కేంద్రం ప్రకటించింది. తొలి మూడు స్థానాల్లో ఇండోర్‌ (మధ్యప్రదేశ్‌), సూరత్‌ (గుజరాత్‌), నవీ ముంబయి (మహారాష్ట్ర) నిలవగా హైదరాబాద్‌ 26వ స్థానంలో నిలిచింది. ఆ తరువాత సిద్దిపేట (30), వరంగల్‌ (84), కరీంనగర్‌ (89) ఉన్నాయి. లక్షకు తక్కువగా జనాభా ఉన్న మున్సిపాలిటీలను పరిశీలిస్తే తెలంగాణ నుంచి బడంగ్‌పేట ఒక్కటే 86వ ర్యాంకులో నిలిచింది.  దేశంలోని 62 కంటోన్మెంట్లలో సికింద్రాబాద్‌ నాలుగో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 100కు పైగా మున్సిపాలిటీలు ఉన్న రాష్ట్రాల కేటగిరీలో తెలంగాణ నాలుగో ర్యాంకు పొందింది.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts