విషం చిమ్ముతున్నారు

దేశ భవిష్యత్తును యువత కాపాడుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ‘‘ఈ దేశం చాలా గొప్పది. కానీ, కొందరు దుర్మార్గులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం విష బీజాలు నాటే ప్రయత్నం చేస్తున్నారు.

Updated : 02 Oct 2022 07:03 IST

అలాంటి పరిణామాలను యువత జాగ్రత్తగా గమనించాలి.. దేశ భవిష్యత్తును కాపాడుకోవాలి

కేంద్రం సహకరించకున్నా 12 కళాశాలలు ఏర్పాటు చేశాం

హనుమకొండలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

ప్రతిమ వైద్య కళాశాల ప్రారంభించిన సీఎం

వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి డిజైన్‌పై ఆగ్రహం

ఈనాడు, వరంగల్‌: దేశ భవిష్యత్తును యువత కాపాడుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ‘‘ఈ దేశం చాలా గొప్పది. కానీ, కొందరు దుర్మార్గులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం విష బీజాలు నాటే ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్పే మాటలను యువత తేలిగ్గా తీసుకోవద్దు. దేశ భవిష్యత్తు యువతరం చేతుల్లోనే ఉంది. చదువుకోవడంతో పాటు సామాజిక పరిణామాలను గమనించాలి. యువతే దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దుకోవాలి. తమ చుట్టూ జరిగే పరిణామాలను నిశితంగా గమనిస్తూ ముందుకు సాగాలి’’ అని ఉద్బోధించారు. శనివారం హనుమకొండ జిల్లా దామెర క్రాస్‌రోడ్డు సమీపంలో నిర్మించిన ప్రతిమ రిలీఫ్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ వైద్య కళాశాల, ఆసుపత్రిని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సభలో సీఎం మాట్లాడారు.

మన చుట్టూ ఏం జరుగుతోందో గ్రహించాలి
‘‘భారత్‌లో ఉన్న సంపదలు ప్రపంచంలో ఏ దేశంలోనూ లేవు. మనకున్నంత భూమి అమెరికాలోనూ లేదు. అక్కడ 29, చైనాలో 16 శాతమే సాగుభూమి ఉంది. భారత్‌లో 50 శాతం ఉంది. అద్భుత పంటలు పండే వాతావరణం మనకుంది. దేశంలో 83కోట్ల ఎకరాల భూమి ఉండగా, అందులో 41 కోట్ల ఎకరాలు సాగుకు అనువైంది. ఇన్ని వనరులున్నా మనం విదేశీయులు చేసే బర్గర్లు, పిజ్జాలు తింటున్నాం. 13 నెలలపాటు దిల్లీ సరిహద్దుల్లో రైతులు ధర్నాలు చేసే పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయ నాయకులు ఏవేవో మాట్లాడుతుంటారు. రచయితలు ఏవేవో రాస్తుంటారు. ప్రజలు చుట్టూ ఏం జరుగుతోందో గ్రహించి అప్‌డేట్ కావాలి. అనేక మంది పరిశోధనల ఫలితంగా నేటి నాగరిక సమాజం పురోగమిస్తోంది. పెన్సిలిన్‌ కనిపెట్టిన పాపానికి ఆ డాక్టర్‌ చివరకు చనిపోయారు. కానీ, అది ప్రాణాన్ని రక్షించే మందులా పనిచేస్తోంది.

వైద్య రంగంలో అద్భుత ప్రగతి సాధిస్తున్నాం
కేంద్రం రాష్ట్రానికి ఒక్క వైద్య కళాశాల ఇవ్వకున్నా.. కొత్తగా 12 ఏర్పాటు చేశాం. ఉమ్మడి రాష్ట్రంలో వైద్యరంగం తీవ్రంగా నిర్లక్ష్యానికి గురికాగా, ఇప్పుడు అద్భుత ప్రగతి సాధిస్తోంది. 2014లో రాష్ట్రం వచ్చినప్పుడు 5 కళాశాలలు ఉండేవి. ఇప్పుడు కొత్తగా 12 తెచ్చుకున్నాం. త్వరలో 33 జిల్లాల్లోనూ వైద్య కళాశాలలు ఉండేలా కృషి చేస్తున్నాం. 2,800 ఎంబీబీఎస్‌ సీట్లను 6,500కు పెంచుకున్నాం. త్వరలో 10వేల సీట్లవుతాయి. పీజీ సీట్లను 1,150 నుంచి 2,500కు పెంచుకున్నాం. ఇక విద్యార్థులు రష్యా, చైనాలకు వైద్యవిద్య చదివేందుకు వెళ్లనక్కర్లేదు.

వరంగల్‌ ఆసుపత్రిలో బ్రహ్మాండమైన సౌకర్యాలు
వరంగల్‌లో 2వేల పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్నాం. 24 అంతస్తుల ఆ ఆసుపత్రి వరంగల్‌లో ఎత్తయిన భవనంగా నిలుస్తుంది. బ్రహ్మాండమైన వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. అది పూర్తయ్యాక హైదరాబాద్‌ నుంచే వరంగల్‌కు వైద్యం కోసం ప్రజలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ భవనాన్ని వేగంగా పూర్తయ్యేలా వైద్యారోగ్యశాఖ, ఆర్‌అండ్‌బీ మంత్రులు పనులను పరిశీలించాలి.  

అనేక రంగాల్లో మొదటి స్థానం..
తెలంగాణ అనేక రంగాల్లో మొదటి స్థానంలో ఉంది. రాజకీయాల కోసం కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చి తిట్టిపోతున్నారు. దిల్లీలో అవార్డులు ఇస్తున్నారు. ఆర్థిక రాజధాని ముంబయి కన్నా తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ. పరిశుభ్రతలో, పచ్చదనంలో, విద్యుత్‌లో.. ఏ రంగం తీసుకున్నా మనం దేశానికే నాయకత్వం వహిస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి అన్నారు. ఆయన తన ప్రసంగం ముగించే సమయంలో జై తెలంగాణ, జై భారత్‌ అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.

ఈ డర్టీ ప్లాన్‌ ఎందుకు?
వరంగల్‌లో నిర్మిస్తున్న 24 అంతస్తుల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి డిజైన్‌పై సీఎం అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆసుపత్రిని సందర్శించిన కేసీఆర్‌కు ఆర్‌అండ్‌బీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఈఎన్‌సీ గణపతిరెడ్డి ఆసుపత్రి నిర్మాణంలో పురోగతి, డిజైన్ల గురించి ముఖ్యమంత్రికి వివరించారు. అయితే తాను చెప్పిన డిజైన్‌ ఒకలా ఉంటే మరోలా మార్చారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పది వరకు ప్లాన్‌లు చూశామని..ఈ డర్టీ ప్లాన్‌ ఎందుకని, దరిద్రంగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. ఆసుపత్రి భవనం మొత్తం 24 అంతస్తులు ఉండాలని తాను చెప్పగా, మధ్యలో బ్లాకు మాత్రమే 24 అంతస్తులు ఉందని, పక్కవి తక్కువ అంతస్తులతో ఎందుకు నిర్మిస్తున్నారని ప్రశ్నించారు. ‘‘వైద్య కళాశాల, పీజీ తరగతులు కూడా భవనంలో వచ్చేలా విశాలంగా నిర్మించాలని చెప్పాను. ఇంత పెద్ద ఆసుపత్రి మళ్లీ మళ్లీ కడతామా? చేతకాకపోతే తప్పుకోవాలి’’ అని మండిపడ్డారు. ఇష్టమొచ్చినట్టు మార్చేందుకు వారెవరని నిర్మాణ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పండగ తర్వాత ఆసుపత్రి నిర్మాణంపై సమీక్షించి డిజైన్‌ను మారుద్దామని కేసీఆర్‌ అన్నారు.

కెప్టెన్‌కు పరామర్శ
వరంగల్‌లో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని పరిశీలించాక కేసీఆర్‌ రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు ఇంటికి వెళ్లారు. ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు తిరుగుప్రయాణం అయ్యారు.

వీఆర్‌ఏలపై ఆగ్రహం
ఎన్జీవోస్‌కాలనీ, జనగామ రూరల్‌, న్యూస్‌టుడే: కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు ఇంటికి వచ్చిన సీఎం కేసీఆర్‌ను వీఆర్‌ఏ సంఘం బాధ్యులు కలిసి ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ వినతిపత్రాన్ని తీసుకొని తమపై విసిరేశారని వీఆర్‌ఏల సంఘం హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల సతీశ్‌ తెలిపారు. అంతకుముందు సీఎం కాన్వాయ్‌ని పెంబర్తి వద్ద నిలిపిన సమయంలో ఓ మహిళా పోలీసు అధికారి వాహనం నుంచి కిందికి దిగారు. తిరిగి బయల్దేరుతుండగా వాహనం ఎక్కుతున్న క్రమంలో అదుపుతప్పి కిందపడిపోయారు. ఎలాంటి గాయాలు కాలేదు.


త్వరలో తెలంగాణ హెల్త్‌ ప్రొఫైల్‌

తెలంగాణ హెల్త్‌ ప్రొఫైల్‌ను త్వరలో తయారు చేయనున్నాం. ములుగు, సిరిసిల్ల నియోజకవర్గాలను పైలట్‌ ప్రాజెక్టుగా తీసుకొని వంద శాతం హెల్త్‌ ప్రొఫైల్‌ తయారుచేశాం. ఆ నియోజకవర్గాల్లోని ప్రతి ఒక్కరి బ్లడ్‌ గ్రూపు, ఆరోగ్య వివరాలను కంప్యూటరీకరిస్తున్నాం. ఎవరికైనా ఏదైనా జబ్బు వచ్చినా, ఆపద సంభవించినా ఒక్క బటన్‌ నొక్కితే వివరాలన్నీ తెలిసే ఆస్కారం ఉంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోనూ ఈ ఆరోగ్య సూచీలు సిద్ధమైతే ఎవరికి వైద్యసేవలు అవసరమైనా వైద్య నిపుణులు క్షణాల్లో అందించగలుగుతారు.

- ముఖ్యమంత్రి కేసీఆర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని