ధరావతు తగ్గింపుపై కీలక చర్చ

ప్రాజెక్టులు, ఇతర నిర్మాణ రంగాలకు సంబంధించి ప్రభుత్వం అమలు చేస్తున్న ఎఫ్‌ఎస్‌డీలను (ఫర్‌దర్‌ సెక్యూరిటీ డిపాజిట్‌) తగ్గించే అంశంపై బోర్డు ఆఫ్‌ చీఫ్‌ ఇంజినీర్స్‌ (బీఓసీ) సమావేశంలో ఆమోదం తెలిపారు.

Published : 02 Oct 2022 04:30 IST

బోర్డు ఆఫ్‌ చీఫ్‌ ఇంజినీర్స్‌ సమావేశంలో తీర్మానాలు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రాజెక్టులు, ఇతర నిర్మాణ రంగాలకు సంబంధించి ప్రభుత్వం అమలు చేస్తున్న ఎఫ్‌ఎస్‌డీలను (ఫర్‌దర్‌ సెక్యూరిటీ డిపాజిట్‌) తగ్గించే అంశంపై బోర్డు ఆఫ్‌ చీఫ్‌ ఇంజినీర్స్‌ (బీఓసీ) సమావేశంలో ఆమోదం తెలిపారు. నీటిపారుదలశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.మురళీధర్‌ ఛైర్మన్‌గా ఉన్న బీఓసీలో పంచాయతీరాజ్‌, ప్రజారోగ్యం, రహదారులు భవనాలు, ఇతర ఇంజినీరింగ్‌ శాఖల ఈఎన్‌సీలు, సీఈలు సభ్యులుగా ఉన్నారు. శనివారం హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగిన బీఓసీ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. వివిధ రంగాలకు చెందిన నిర్మాణాలకు సంబంధించి బిల్లులు చెల్లించే సమయంలో ప్రభుత్వం ప్రస్తుతం 7.5 శాతం నిధులను ధరావతుగా కోతపెట్టి మిగిలిన మొత్తం విడుదల చేస్తోంది. ఆ పని పూర్తయ్యాక దాన్ని తుది బిల్లులో కలిపి ఇస్తోంది. ఈ నేపథ్యంలో భూసేకరణ, ఇతరత్రా జాప్యాలతో చేసిన పనులకు బిల్లులు సకాలంలో అందడం లేదని, ఈ సమయంలో ధరావతు కింద నిలిపివేసిన నిధులను ఇవ్వాలని, ఇలా కోతపెట్టడం ఆమోదయోగ్యం కాదని బిల్డర్స్‌ అసోసియేషన్‌ చేసిన విజ్ఞప్తులు సమావేశంలో చర్చకు వచ్చాయి. కరోనా విపత్తు సమయంలో ఆ మొత్తాన్ని 0.5 శాతానికి ప్రభుత్వం కుదించిందని, ఈ ఏడాది డిసెంబరు వరకు అదే మాదిరి అమలు చేయాలన్న అసోసియేషన్‌ వినతి మేరకు చర్చించి తీర్మానాల్లో నమోదు చేశారు. దీంతోపాటు శాఖల పరిధిలోని వాహనాల నిర్వహణ వ్యయం భారీగా పెరిగినందున కేటాయింపులను రూ.20 వేల నుంచి రూ.1.20 లక్షలకు పెంచడం, పర్యవేక్షక ఇంజినీరు వాహనాలకు 350 లీటర్ల ఇంధనం, సీఈ స్థాయి వరకు 400 లీటర్ల ఇంధనం వినియోగించుకునేలా బీఓసీ ఆమోదం తెలిపింది. ఈ తీర్మానాలను ప్రభుత్వానికి పంపించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు