మిషన్‌ భగీరథ పథకాన్ని మదింపు చేయలేదు

తెలంగాణలో మిషన్‌ భగీరథ పథకంపై ఎలాంటి మదింపు చేయలేదని కేంద్ర జలశక్తిశాఖ తెలిపింది. సీఎం కేసీఆర్‌ మానస పుత్రికైన మిషన్‌ భగీరథ దేశానికి ఆదర్శమని, జాతీయ జల్‌జీవన్‌ మిషన్‌ అవార్డు రావడమే దీనికి నిదర్శనమన్న మంత్రుల వ్యాఖ్యలు సత్యదూరమని పేర్కొంది.

Updated : 02 Oct 2022 05:50 IST

‘క్రమం తప్పకుండా సరఫరా’ కేటగిరీలోనే తెలంగాణకు అవార్డు

‘జల్‌ జీవన్‌ మిషన్‌’ పురస్కారంపై కేంద్ర జలశక్తి శాఖ వివరణ

ఈనాడు- హైదరాబాద్‌, దిల్లీ: తెలంగాణలో మిషన్‌ భగీరథ పథకంపై ఎలాంటి మదింపు చేయలేదని కేంద్ర జలశక్తిశాఖ తెలిపింది. సీఎం కేసీఆర్‌ మానస పుత్రికైన మిషన్‌ భగీరథ దేశానికి ఆదర్శమని, జాతీయ జల్‌జీవన్‌ మిషన్‌ అవార్డు రావడమే దీనికి నిదర్శనమన్న మంత్రుల వ్యాఖ్యలు సత్యదూరమని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో క్రమం తప్పకుండా తాగునీటిని సరఫరా చేస్తున్న కేటగిరీలోనే రాష్ట్రానికి ఈ నెల 2న దిల్లీలో అవార్డు ఇస్తున్నామని స్పష్టం చేసింది. తాగునీటి సరఫరా కార్యాచరణ మదింపులో పేర్కొన్న ప్రమాణాల్లో ‘క్రమం తప్పకుండా సరఫరా’ ఒకటి మాత్రమే అని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తిశాఖ తరపున ‘మిషన్‌ భగీరథ పథకంపై వాస్తవ ప్రకటన’ పేరుతో కేంద్ర సమాచార బ్యూరో శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘తెలంగాణలో మిషన్‌ భగీరథ పథకాన్ని కేంద్రం మదింపు చేయలేదు. జల్‌జీవన్‌ మిషన్‌ కింద ప్రతి ఒక్కరికీ రోజుకు 55 లీటర్ల తాగునీటిని, ప్రమాణాల మేరకు అందిస్తున్నారా? లేదా? విషయమై మదింపు చేశాం. రాష్ట్రవ్యాప్తంగా 409 గ్రామాల్లోని 12,570 కుటుంబాలను శాంపిల్‌గా పరిగణనలోకి తీసుకున్నాం. ఇందులో 8 శాతం కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి రోజుకు 55 లీటర్ల కన్నా తక్కువగా తాగునీరు అందుతోంది. మొత్తం శాంపిళ్లలో 5 శాతం కుటుంబాలకు జల జీవన్‌ మిషన్‌ ప్రమాణాల మేరకు నాణ్యతతో కూడిన తాగునీరు అందడం లేదని వెల్లడైంది. రాష్ట్ర ప్రభుత్వం నూరుశాతం తాగునీటి కనెక్షన్లు ఇచ్చామని చెబుతున్నా.. గ్రామపంచాయతీల ద్వారా ధ్రువీకరణ పొందలేదు’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


మిషన్‌ భగీరథకు పురస్కారం ఇవ్వలేదనడం దారుణం: మంత్రి ఎర్రబెల్లి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో గ్రామీణ గృహాల నీటి సరఫరాకు పురస్కారం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మిషన్‌ భగీరథకు పురస్కారం ఇవ్వలేదని బుకాయించడం దారుణమని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. ‘గ్రామీణ గృహాలకు నీటి సరఫరా రెగ్యులేటరీ విభాగంలో అద్భుత ప్రతిభ కనబరచిన తెలంగాణకు అక్టోబరు 2న పురస్కారం ఇస్తున్నామని, అధికారులను పంపించాలంటూ తెలంగాణ సీఎస్‌కు సెప్టెంబరు 26న జల్‌జీవన్‌ మిషన్‌ అదనపు కార్యదర్శి డైరెక్టర్‌ వికాస్‌ శీల్‌ లేఖ రాశారు. గ్రామీణ గృహాలకు మిషన్‌ భగీరథ ద్వారానే నీటిని సరఫరా చేస్తున్నాం. జల్‌శక్తి మంత్రిత్వశాఖ పంపిన లేఖలోనూ ఆ పథకాన్ని సమీక్షించామని చెప్పింది. ఇప్పుడు అలా నీటిని సరఫరా చేస్తున్నట్లు గ్రామపంచాయతీలు తీర్మానించలేదని కొత్త మెలిక పెడుతున్నారు. అలాంటప్పుడు 100 శాతం నల్లాల ద్వారా తాగునీరు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని వెబ్‌సైట్‌లో ఎందుకు పెట్టారు?’’ అని ఎర్రబెల్లి ప్రశ్నించారు.


Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts