5 రహదారులు.. రూ.2,919 కోట్లు..!

తెలంగాణలో మరో 170 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల విస్తరణకు రంగం సిద్ధం అవుతోంది.

Updated : 02 Oct 2022 12:34 IST

జాతీయ రహదారుల శాఖ తుది పరిశీలనలో ప్రతిపాదనలు

ఎస్‌ఎఫ్‌సీ సమావేశంలో నిధుల విడుదలకు ఆమోదం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో మరో 170 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల విస్తరణకు రంగం సిద్ధం అవుతోంది. నాలుగు రహదారులు, ఒక వంతెన నిర్మాణానికి ఈ నెలలో కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ పరిధిలోని స్టాండింగ్‌ ఫైనాన్స్‌ కమిటీ(ఎస్‌ఎఫ్‌సీ) ఆమోదముద్ర వేయనుంది. ఆయా పనులకు రూ.2,919కోట్ల వ్యయం అవుతుందని అంచనా. వాటిలో భాగంగా సుమారు 3 కి.మీ. మేర ప్రతిష్ఠాత్మకంగా నిర్మించే వంతెనకు రూ.1,100 కోట్లు ఖర్చవుతుందన్నది ప్రాథమిక అంచనా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య తీగల వంతెన రూపంలో ఈ వారధి రానుంది. తెలంగాణలోని కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల వరకు నిర్మించనున్న రహదారిలో భాగంగా సోమశిల వద్ద కృష్ణానదిపై నాలుగు వరుసలుగా ఈ వంతెనకు రూపమివ్వనున్నారు. పచ్చటి కొండల మధ్య నుంచి హొయలు పోయే కృష్ణానది పరవళ్లను పర్యాటకులు అతి సమీపం నుంచి తిలకించేలా ఈ వంతెన నిర్మించనున్నారు. వారధికి అటూఇటూ రహదారి విస్తరణకు ఇప్పటికే కేంద్రం రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ టెండర్లు ఆహ్వానించింది. దాఖలైన 14 టెండర్ల సాంకేతిక అర్హతలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ నెలాఖరుకు అర్హత పొందిన సాంకేతిక టెండర్ల నుంచి ఆర్థిక బిడ్లు తెరిచి గుత్తేదారును ఎంపిక చేయనున్నారు. వంతెన నిర్మాణాన్ని వచ్చే సంవత్సరంలో మంజూరు చేయాలని తొలుత కేంద్రం భావించినా.. ఈ ఏడాదే పచ్చజెండా ఊపేందుకు నిర్ణయించింది.

వంతెన సహా అయిదు రహదారుల విస్తరణకు అవసరమైన రూ.2,919 కోట్లు ఈ నెలాఖరులోగా మంజూరు కానున్నాయి. కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎస్‌ఎఫ్‌సీ సమావేశం గత వారమే జరగాల్సి ఉండగా వాయిదా పడింది. ఈ నెలాఖరులోగా అది మళ్లీ జరిగే అవకాశముంది. ఆ సందర్భంగా నిధుల విడుదలకు ఆమోద ముద్ర పడనుంది. పనులకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలు తెలంగాణ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సిద్ధం చేయటంతో అది సాధ్యమవుతోందని ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’తో చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని