వీళ్లు నాణ్యత చెప్పరు వాళ్లు పంటలు కొనరు

కొత్త మార్కెటింగ్‌ ఏడాది శనివారం(అక్టోబరు 1) నుంచి ప్రారంభమైనా వ్యవసాయ మార్కెట్ల తీరుతెన్నులు మారలేదు.

Updated : 02 Oct 2022 05:39 IST

ప్రారంభమైన కొత్త మార్కెటింగ్‌ ఏడాది

మార్కెట్లలో ఇప్పటికీ పరిష్కారం కాని ఈనామ్‌ సమస్యలు

ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు తొలగని ప్రతిబంధకాలు

ఈనాడు - హైదరాబాద్‌

కొత్త మార్కెటింగ్‌ ఏడాది శనివారం(అక్టోబరు 1) నుంచి ప్రారంభమైనా వ్యవసాయ మార్కెట్ల తీరుతెన్నులు మారలేదు. ‘ఎలక్ట్రానిక్‌ జాతీయ వ్యవసాయ మార్కెట్‌’(ఈనామ్‌) వేదికలో 56 వ్యవసాయ మార్కెట్లను రాష్ట్రంలో అనుసంధానం చేశారు. వీటిలో తగిన మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం తీవ్ర సమస్యగా మారింది. ఉదాహరణకు రాష్ట్రంలోనే అతిపెద్దవైన వరంగల్‌, ఖమ్మం మార్కెట్లను ఈనామ్‌ కింద ఆన్‌లైన్‌లో అనుసంధానం చేశారు. కానీ ఈ మార్కెట్లకు పెద్ద ఎత్తున రైతులు తెచ్చే పత్తి, మిరప పంటలను ఆన్‌లైన్‌లో దేశంలో గానీ, రాష్ట్రంలో గానీ ఎక్కడి నుంచయినా కొనడానికి సదుపాయాలు లేవు. రాష్ట్రంలో 5,300 మంది వ్యాపారులకు ఆన్‌లైన్‌ ద్వారా పంటలను కొనేందుకు లైసెన్సులు ఇచ్చారు. ఈ లైసెన్సులు కాగితాలకే పరిమితమయ్యాయి తప్ప రైతుల నుంచి పంటలను మాత్రం ఆన్‌లైన్‌ ద్వారా ఎవరూ కొనడం లేదు.

నాణ్యత, చెల్లింపులే సమస్య
మార్కెట్‌కు వచ్చిన పంటను ఒక్కో రైతువారీగా లాట్‌ సంఖ్య కేటాయించి వాటి నమూనాలను తీసుకుని అక్కడే ఉన్న ప్రయోగశాలలో నాణ్యత పరీక్షలు చేయాలని ఈనామ్‌ నిబంధనలు చెబుతున్నాయి. ఇలా చేయాలంటే మార్కెట్లలో అధునాతన యంత్రాలతో ప్రయోగశాలలు, సిబ్బంది, ఆన్‌లైన్‌లో వెంటనే వివరాల నమోదుకు ఏర్పాట్లు ఉండాలి. ఇవి చాలాచోట్ల లేవు. ఉదాహరణకు నిజామాబాద్‌ మార్కెట్‌ పసుపు పంటకు జాతీయ స్థాయిలో అతిపెద్దదనే పేరుంది. అయినా ప్రతి లాట్‌ నుంచి నమూనా తీసుకుని నాణ్యతను పరీక్షించి ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు తగినంతమంది సిబ్బంది లేరు. అవసరమైన యంత్ర పరికరాలూ లేవు.

ధ్రువీకరణ పత్రాలు ఇస్తేనే..
కొన్ని లాట్‌ల నాణ్యతను పరీక్షించినా వివరాలు స్థానికంగా వెల్లడిస్తారే తప్ప ధ్రువీకరణ పత్రం జారీ చేయరు. ధ్రువీకరణ పత్రం అధికారికంగా ఇస్తే మద్దతు ధర చెల్లించి తాము ఆన్‌లైన్‌ ద్వారా దేశంలో ఎక్కడి నుంచయినా కొంటామని పలువురు వ్యాపారులు తాజాగా మార్కెటింగ్‌శాఖకు చెప్పారు.

‘‘అలా ధ్రువీకరణ పత్రం ఇవ్వలేం. పంటను కొన్నరోజే రైతు బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ చేస్తామని వ్యాపారులు పూచీకత్తు ఇస్తే ఆన్‌లైన్‌లో ఎక్కడి నుంచయినా పంటను కొనేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పాం’’ అని మార్కెటింగ్‌ శాఖ రాష్ట్ర సంచాలకురాలు లక్ష్మీబాయి ‘ఈనాడు’కు తెలిపారు. నాణ్యత ధ్రువీకరణ పత్రం అధికారికంగా ఇవ్వకపోయినా స్థానిక కమీషన్‌ ఏజెంట్ల ద్వారా ప్రత్యక్షంగా పరీక్షించుకుని వ్యాపారులు దేశంలో ఎక్కడి నుంచయినా తెలుసుకుంటారని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని