ఎస్సై, కానిస్టేబుళ్ల ప్రాథమిక రాతపరీక్షలో కటాఫ్‌ మార్కుల తగ్గింపు

ఎస్సై, కానిస్టేబుళ్లస్థాయి ప్రాథమిక రాతపరీక్షలో అర్హత సాధించేందుకు నిర్ణయించిన కటాఫ్‌ మార్కుల్ని తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరీక్షలో మొత్తం 200 మార్కులకుగాను ఓసీ అభ్యర్థులు 30 శాతం, బీసీ అభ్యర్థులు 25 శాతం, ఎస్సీ, ఎస్టీ లేదా మాజీ సైనికోద్యోగులు 20 శాతం మార్కులు పొందితే అర్హత సాధిస్తారని స్పష్టం చేసింది.

Updated : 03 Oct 2022 07:39 IST

 కేటగిరీలతో సంబంధం లేకుండా 10 శాతం తగ్గింపు

ఈనాడు, హైదరాబాద్‌: ఎస్సై, కానిస్టేబుళ్లస్థాయి ప్రాథమిక రాతపరీక్షలో అర్హత సాధించేందుకు నిర్ణయించిన కటాఫ్‌ మార్కుల్ని తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరీక్షలో మొత్తం 200 మార్కులకుగాను ఓసీ అభ్యర్థులు 30 శాతం, బీసీ అభ్యర్థులు 25 శాతం, ఎస్సీ, ఎస్టీ లేదా మాజీ సైనికోద్యోగులు 20 శాతం మార్కులు పొందితే అర్హత సాధిస్తారని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని  తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. గతంలో జరిగిన పరీక్షల్లో కటాఫ్‌ మార్కులు ఓసీలకు 40శాతం.. బీసీలకు 35శాతం.. ఎస్సీ, ఎస్టీ లేదా మాజీ సైనికోద్యోగులకు 30శాతంగా ఉండేవి. గత ఆగస్టులో జరిగిన పరీక్షలకు మాత్రం అందరికీ 30 శాతమే కటాఫ్‌గా నిర్ణయించారు. దీంతో ఎస్సీ, ఎస్టీ లేదా మాజీ సైనికోద్యోగ అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఓసీలకు, బీసీలకు మాత్రమే కటాఫ్‌ మార్కుల్ని తగ్గించి తమకు మాత్రం యథాతథంగా ఉంచారనే ఆందోళన నెలకొంది. ఈ విషయం శాసనసభలో ప్రస్తావనకు రావడంతో ఎస్సీ, ఎస్టీ లేదా మాజీ సైనికోద్యోగ అభ్యర్థులకూ మార్కుల్ని తగ్గిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఈమేరకు తాజాగా హోంశాఖ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి గత నెలలోనే ఫలితాలు ప్రకటించేందుకు మండలి సన్నాహాలు చేసింది. కానీ కటాఫ్‌ మార్కుల తగ్గింపుపై ప్రభుత్వ నిర్ణయం కోసం వేచిచూడాల్సి వచ్చింది. ఇప్పుడు అది వెలువడటంతో ప్రాథమిక రాతపరీక్ష ఫలితాల వెల్లడికి మార్గం సుగమమైంది.

మాజీ సైనికోద్యోగ అభ్యర్థులు సమాచారమివ్వాలి: ప్రాథమిక రాతపరీక్ష రాసిన మాజీ సైనికోద్యోగ అభ్యర్థులు ఆ కోటాతో పాటు వయో పరిమితి సడలింపు లబ్ధి పొందేందుకు అవసరమైన సమాచారాన్ని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌లో తమ వ్యక్తిగత ఖాతాలో నమోదు చేయాలని మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు సూచించారు. అక్టోబరు 4న ఉదయం 8 గంటల నుంచి 8వ తేదీ రాత్రి 12 గంటలవరకు వివరాలు సమర్పించాలన్నారు. పెన్షన్‌ పేమెంట్‌ ఆర్డర్‌, డిశ్చార్జి బుక్‌, సంబంధిత యూనిట్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ నుంచి నిరభ్యంతర పత్రంలో ఏదో ఒక ప్రతిని స్కాన్‌ చేయాలని సూచించారు. గడువులోగా ఆ వివరాలను సమర్పించిన వారికి మాత్రమే వయో పరిమితి సడలింపు లబ్ధి చేకూరుతుందని స్పష్టం చేశారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts