జల్‌జీవన్‌ మిషన్‌లో తెలంగాణకు 5వ ర్యాంకు

జాతీయ జల్‌ జీవన్‌ మిషన్‌ పథకం అమలులో  తెలంగాణకు 5వ ర్యాంకు దక్కింది. మొత్తం పనితీరులో గత ఏడాదికంటే  4 పాయింట్లు మెరుగుపరుచుకున్నా ర్యాంకులో కిందటేడాది మాదిరిగా 5వ స్థానంలోనే ఉంది. తొలి నాలుగు స్థానాలను పుదుచ్చేరి, తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్‌, గోవాలు కైవసం చేసుకున్నాయి.

Published : 03 Oct 2022 04:34 IST

 క్రమం తప్పకుండా నీటి సరఫరా విభాగంలో మొదటి స్థానం

దీనివల్ల సమయం, శ్రమ తగ్గిందన్న  93% కుటుంబాలు

ఈనాడు, దిల్లీ: జాతీయ జల్‌ జీవన్‌ మిషన్‌ పథకం అమలులో  తెలంగాణకు 5వ ర్యాంకు దక్కింది. మొత్తం పనితీరులో గత ఏడాదికంటే  4 పాయింట్లు మెరుగుపరుచుకున్నా ర్యాంకులో కిందటేడాది మాదిరిగా 5వ స్థానంలోనే ఉంది. తొలి నాలుగు స్థానాలను పుదుచ్చేరి, తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్‌, గోవాలు కైవసం చేసుకున్నాయి. క్రమంతప్పకుండా నీటి సరఫరా విభాగంలో తెలంగాణకు 1వ ర్యాంకు దక్కింది. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆదివారం ఇక్కడ నిర్వహించిన స్వచ్ఛభారత్‌ దివస్‌ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము, జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌ల ఆధ్వర్యంలో ఈ ర్యాంకులు ప్రకటించారు. తెలంగాణలోని 95% గ్రామాలకు ఓవర్‌హెడ్‌ ట్యాంకుల్లోనో, సంపుల్లోనో నీటిని నిల్వచేసి ఇంటింటికీ సరఫరా చేస్తున్నారు. తెలంగాణతోపాటు మరో 12 రాష్ట్రాల్లో సంవత్సరం పొడవునా రోజూ నీటి సరఫరా జరుగుతోంది. దీనివల్ల తమకు సమయం, శ్రమ తగ్గిందని తెలంగాణలోని 93% కుటుంబాలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. ఫలితంగా ప్రాథమికోన్నత పాఠశాలలకు వెళ్లే బాలికల సంఖ్య 9%మేర పెరిగింది. రాష్ట్రంలో వార్షిక ఉపాధి రోజులు సగటున 56 పెరిగాయి. ఇంట్లో కొళాయి ఉండటంవల్ల ఆదాయానికి ప్రత్యక్షంగా మేలు చేసినట్లు 93% మంది చెప్పారు.  రాష్ట్రంలోని 32 జిల్లాల్లోని 409 గ్రామాల్లో 12,393 ఇళ్ల నుంచి నమూనాలు సేకరించారు. గ్రామీణప్రాంతాల్లో 92% కుటుంబాలకు రోజూ సగటున తలసరి 55 లీటర్ల నీళ్లు అందుతున్నాయి. 4% కుటుంబాలకు 40 లీటర్లపైన, మరో 4%కుటుంబాలకు 40 లీటర్లలోపు అందుతున్నట్లు ఇందులో తేలింది. రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరి 22 నుంచి ఏప్రిల్‌ 10వరకు మొత్తం 48 రోజులపాటు నమూనాలు సేకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని