సంక్షిప్త వార్తలు (13)

సిద్దిపేటలో సోమవారం సద్దుల బతుకమ్మ సంబురం అంబరాన్నంటింది. కోమటిచెరువు (మినీ ట్యాంకుబండ్‌) ప్రాంగణం జనసంద్రంగా మారింది. రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు కుటుంబ సమేతంగా వేడుకలో పాల్గొన్నారు.

Updated : 04 Oct 2022 05:45 IST

సంబురాల వేళ.. బోటులో మంత్రి షికారు

సిద్దిపేటలో సోమవారం సద్దుల బతుకమ్మ సంబురం అంబరాన్నంటింది. కోమటిచెరువు (మినీ ట్యాంకుబండ్‌) ప్రాంగణం జనసంద్రంగా మారింది. రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు కుటుంబ సమేతంగా వేడుకలో పాల్గొన్నారు. ఆయన సరదాగా బోటును నడిపించగా సతీమణి శ్రీనిత, కుమార్తె వైష్ణవి సహా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, పోలీసు కమిషనర్‌ శ్వేత, ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్‌, బల్దియా అధ్యక్షురాలు మంజుల అందులో కూర్చున్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు.. సతీమణి శ్రీనితకు తామర పుష్పం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రజలందరికీ అభివాదం చేశారు.

- న్యూస్‌టుడే, సిద్దిపేట


బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారు సూర్య, చంద్ర వాహనాలను అధిరోహించి తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య శ్రీమలయప్పస్వామి వారు నృత్యకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

- న్యూస్‌టుడే, తిరుమల


సర్వదర్శనానికి 12 గంటలు 

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సర్వదర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. సోమవారం సాయంత్రానికి ధర్మదర్శనానికి క్యూలైన్‌లలో వచ్చిన వారితో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. వీరికి 12 గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుందని తితిదే తెలిపింది.


టీఎస్‌ఫుడ్స్‌ ఉద్యోగులకు 20% భత్యాల పెంపు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ తెలంగాణ ఫుడ్స్‌లోని శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులకు భత్యాలు(అలవెన్సులు) 20 శాతం పెరిగాయి. సంస్థ ఛైర్మన్‌ మేడె రాజీవ్‌సాగర్‌ అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశం ఈ మేరకు నిర్ణయించింది. సంస్థ శాశ్వత ఉద్యోగులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలను కారుణ్య కారణాలపై నియమించేందుకు పాలకమండలి ఆమోదం తెలిపింది. వైద్యపరంగా అశక్తులైన ఉద్యోగుల స్థానంలో వారి పిల్లలను తీసుకోవడానికి అంగీకరించింది. టీఎస్‌ఫుడ్స్‌ ఉత్పత్తి చేసే ఆహారపదార్థాల పంపిణీ ధరను కిలో రూ.50 నుంచి రూ.54కి పెంచుతూ తీర్మానించింది. సోమవారం టీఎస్‌ఫుడ్స్‌ కార్యాలయం వద్ద హెచ్‌ఎంఎస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజీవ్‌సాగర్‌ సంస్థ నిర్ణయాలు ప్రకటించారు.


పోలీసు అకాడమీకి ఐఎస్‌ఓ గుర్తింపు

ఈనాడు, హైదరాబాద్‌: రాజా బహద్దూర్‌ వెంకట్రామిరెడ్డి తెలంగాణ పోలీసు అకాడమీకి ప్రతిష్ఠాత్మక ఐఎస్‌ఓ గుర్తింపు లభించినట్లు అకాడమీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కొద్దిరోజులుగా ఐఎస్‌ఓ ప్రతినిధులు అకాడమీలోని సౌకర్యాలు, శిక్షణ ప్రమాణాలు, పరిపాలనా పద్ధతులు, పర్యావరణం వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి లండన్‌లోని తమ సంస్థ ప్రధాన కార్యాలయానికి నివేదిక పంపారు. సోమవారం అకాడమీలో జరిగిన కార్యక్రమంలో ఈ గుర్తింపు పత్రాన్ని ఐఎస్‌ఓ ప్రతినిధులు సంచాలకుడు వి.వి.శ్రీనివాసరావుకు అందజేశారు.


‘బీసీ గురుకులాల్లో కాలపట్టిక మార్చాలి’

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని బీసీ గురుకులాల్లో పాఠశాలల పనివేళల్ని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు మార్చాలని తెలంగాణ ప్రభుత్వ గురుకుల విద్యాలయాల ఉద్యోగుల సంక్షేమ సంఘం (ఎట్‌గ్రీవ) డిమాండ్‌ చేసింది. సోమవారమిక్కడ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌ ఆధ్వర్యంలో ఎట్‌గ్రీవ అధ్యక్షుడు కూకుట్ల యాదయ్య, అధ్యక్షురాలు లలితకుమారి, నాయకులు రమేష్‌, రాజమల్లయ్య తదితరులు బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్యబట్టుకు వినతి పత్రం సమర్పించారు. ఉదయం 7.30 గంటలకే తరగతులు మొదలు కావడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బంది అవుతోందన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల పాఠశాలల తరహాలో బీసీ గురుకుల పాఠశాలల్లో కాలపట్టిక(టైంటేబుల్‌)ను మార్చాలని కోరారు. గురుకులాల్లో జీవో నం.317 ద్వారా ఇబ్బందులకు గురవుతున్న ఉపాధ్యాయులకు వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. స్పౌజ్‌కేసులతో పాటు అనారోగ్యంతో ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్సీ గురుకుల సొసైటీ అదనపు కార్యదర్శి హన్మంతనాయక్‌కు వినతిపత్రం సమర్పించారు.


ఆర్టీసీలో అప్రెంటీస్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ (టీఎస్‌ఆర్టీసీ)లోని ఇంజినీరింగ్‌, నాన్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో అప్రెంటీస్‌ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సోమవారం ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. బీటెక్‌, బీఈ పట్టభద్రులు ఇంజినీరింగు విభాగానికి, బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏ పట్టభద్రులు నాన్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి ఈ నెల 16వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. ‘‘దరఖాస్తు సమర్పణకు ముందు www.mhrdnats.
gov.in
  వెబ్‌సైట్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత అదే వెబ్‌సైట్‌లో టీఎస్‌ఆర్టీసీని ఎంపిక చేసుకుని STLHDS000005 యూజర్‌ ఐడీ ద్వారా అప్రెంటీస్‌ పోస్టులకు దరఖాస్తు సమర్పించాలి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఒకటీ రెండు రోజుల్లో www.tsrtc.telangana.gov.in వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ అవుతుంది’’ అని ఆ సంస్థ పేర్కొంది.


సీట్ల కన్నా అభ్యర్థులే తక్కువ

7న పీజీఈసెట్‌ వెబ్‌ఆప్షన్లు ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ కోర్సుల్లో 8,500 వరకు సీట్లు ఉండగా 5,568 మంది మాత్రమే అర్హులున్నారు. పీజీఈసెట్‌లో మొత్తం 11,938 మంది ఉత్తీర్ణులు కాగా 5,912 మంది ధ్రువపత్రాల పరిశీలనకు దరఖాస్తు చేశారు. వారిలో చివరకు 5,568 మంది వెబ్‌ఆప్షన్ల నమోదుకు అర్హత సాధించారు. వారిలో ఎంటెక్‌కు 2,861 మంది, ఎంఫార్మసీకి 2,650, మాస్టర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (ఎంఆర్క్‌)కు 57 మంది ఉన్నారని ప్రవేశాల కన్వీనర్‌ ఆచార్య రమేష్‌బాబు తెలిపారు. ఈ నెల 7న వెబ్‌ ఆప్షన్లు ప్రారంభం కానుండగా ఎంతమంది ఆ ప్రక్రియను పూర్తి చేస్తారు? ఆప్షన్లు పెట్టుకున్న వారిలో ఎందరు కళాశాలల్లో చేరతారన్నది వేచిచూడాలి. కన్వీనర్‌ కోటా కింద గత ఏడాది 9 వేల వరకు సీట్లు ఉండేవి. ఈసారి ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ) ఎంఫార్మసీ సీట్లకు కోత పెట్టింది.  జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలోని ప్రైవేట్‌ కళాశాలల్లో ఎంఫార్మసీ సీట్లు తగ్గనున్నాయి. పీజీ సీట్లకు పోటీపడుతున్న వారిలో సగం మంది సప్లిమెంటరీలో పాసైన వారే ఉన్నట్లు తెలుస్తోంది. గేట్‌, గ్రాడ్యుయేట్‌ ఫార్మసీ ఆప్టిట్యూడ్‌ టెస్టు (జీప్యాట్‌)లో ఉత్తీర్ణులైనవారు దాదాపు 400 మంది ఉన్నారు.


6న అలయ్‌-బలయ్‌: బండారు విజయలక్ష్మి

అమీర్‌పేట, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో ఈ నెల 6న ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అలయ్‌-బలయ్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అలయ్‌-బలయ్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ బండారు విజయలక్ష్మి తెలిపారు. సోమవారం అమీర్‌పేటలో నిర్వహించిన సమావేశంలో విజయలక్ష్మి మాట్లాడారు. హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో జరిగే అలయ్‌-బలయ్‌ వేడుకలకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించామని, హరియాణా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, ఏపీ, కేరళ గవర్నర్లు బిశ్వభూషణ్‌ హరిచందన్‌, మహ్మద్‌ ఆరిఫ్‌ఖాన్‌, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, భగవంత్‌ ఖుబా, నటుడు చిరంజీవి, రాష్ట్ర మంత్రులు, అధికారులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, భాజపా జిల్లా అధ్యక్షులు శ్యామ్‌సుందర్‌, గౌతంరావు, కార్పొరేటర్‌ కేతినేని సరళ తదితరులు పాల్గొన్నారు.


విద్యుత్‌ రాయితీలకు రూ.875 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్‌ రాయితీలకు ప్రస్తుత అక్టోబరు నెల పద్దు కింద విద్యుత్‌ పంపిణీ సంస్థలకు రూ.875 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ఇంధన శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఎస్సీ, ఎస్టీలకు 101 యూనిట్ల వరకు, వ్యవసాయానికి పూర్తి ఉచితంగా, కొన్ని వర్గాలకు తక్కువ ఛార్జీలకు విద్యుత్తును ఇస్తున్నందుకు రాయితీ కింద, ఎత్తిపోతల పథకాలకు ఇస్తున్న కరెంటు బిల్లుల కింద ఈనిధులను విడుదల చేసినట్లు తెలిపింది.


సింగరేణి సీఎండీకి  నోటీసు

కొత్తగూడెం సింగరేణి, న్యూస్‌టుడే: సింగరేణిలో ఎస్టీ రిజర్వేషన్ల అమలుపై మాట్లాడేందుకు ఈ నెల 11న దిల్లీలోని తమ కార్యాలయానికి హాజరవ్వాలంటూ జాతీయ షెడ్యూల్డు తెగల (ఎస్టీ) కమిషన్‌ ఛైర్మన్‌ విజయ సంప్లా ఆ సంస్థ సీఎండీ శ్రీధర్‌ను ఆదేశించారు. సింగరేణిలోని ఎలక్ట్రానికల్‌ అండ్‌ మెకానికల్‌ విభాగంలో దళిత అధికారులకు ఉద్యోగోన్నతుల్లో అన్యాయం జరిగిందంటూ అఖిల భారత ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గోళ్ల రమేష్‌ కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు ఆయా అంశాలపై చర్చించేందుకు హాజరుకావాలని సీఎండీకి ఎస్టీ కమిషన్‌ సోమవారం నోటీసులు పంపింది.


ఏడుగురు అధికారులకు ఐఏఎస్‌ పదోన్నతుల తేదీ సవరణ

ఈనాడు, హైదరాబాద్‌: ఏపీ, తెలంగాణల్లోని ఏడుగురు అధికారులకు ఐఏఎస్‌ పదోన్నతుల గడువును సవరిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీఎస్‌ఆర్‌కేఆర్‌ విజయ్‌కుమార్‌, జి.కిషన్‌, కేఎస్‌ శ్రీనివాస్‌రాజు, కేఆర్‌బీహెచ్‌ఎన్‌ చక్రవర్తి, ఎం.గిరిజాశంకర్‌, జి.రవిబాబు, సీహెచ్‌ విజయ్‌మోహన్‌లకు ఐఏఎస్‌ పదోన్నతి తేదీగా 2002 జులై 22ను పరిగణిస్తున్నట్లు పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లు డీవోపీటీ ఉప కార్యదర్శి కుల్దీప్‌ చౌదరి తెలిపారు.


విభజన సమస్యలు తక్షణం పరిష్కరించాలి

 రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు

విజయవాడ, న్యూస్‌టుడే: రాష్ట్ర విభజన సమస్యలను తక్షణం పరిష్కరించాలని పలువురు వక్తలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం విజయవాడ బాలోత్సవ్‌ భవన్‌లో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విశాఖ రైల్వే జోన్‌, విభజన హామీలను అమలు చేయాలని కోరుతూ రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ  విశాఖ రైల్వే జోన్‌ కుదరదని రైల్వే అధికారులు తెగేసి చెబుతున్నారని, ఇదంతా కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా జరుగుతుందా అని ప్రశ్నించారు.  సీపీఎం ఏపీ కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన హక్కులపై పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. సీపీఐఎంఎల్‌ లిబరేషన్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు డి.హరినాథ్‌ తన ప్రసంగంలో విభజన హామీలు అమలు చేయకపోయినా రాష్ట్రపతి ఎన్నికల్లో భాజపా, వైకాపా, తెదేపాలు కేంద్రానికి మద్దతు పలికాయని విమర్శించారు. సీఐటీయూ ఏపీ కార్యదర్శి కె.సుబ్బరావమ్మ మాట్లాడుతూ హామీలను అమలు చేశామని భాజపా ఎంపీ జి.వి.ఎల్‌.నరసింహారావు ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ రైతు సంఘం అధ్యక్షుడు వి.కృష్ణయ్య, కేవీపీఎస్‌ ఏపీ ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, ఎస్‌ఎఫ్‌ఐ ఏపీ అధ్యక్షుడు కె.ప్రసన్న కుమార్‌ తదితరులు ప్రసంగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని