ఆ కళాశాలల్లో ఫీజులు పెరుగుతాయ్‌!

తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) గత నెలలో ఖరారు చేసిన బీటెక్‌ ఫీజులను అంగీకరించని కళాశాలల్లో రుసుములు మారనున్నాయి. విచారణకు హాజరై అభ్యంతరాలను వ్యక్తంచేసి,  అవసరమైన ఆధారాలను చూపిన కళాశాలల ఫీజుల మొత్తం కొంత పెరగనుంది.

Updated : 04 Oct 2022 04:41 IST

టీఏఎఫ్‌ఆర్‌సీ ఖరారు చేసిన రుసుమును అంగీకరించని 20 కళాశాలలతో చర్చలు పూర్తి

కొంత మొత్తాన్ని పెంచిన కమిటీ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) గత నెలలో ఖరారు చేసిన బీటెక్‌ ఫీజులను అంగీకరించని కళాశాలల్లో రుసుములు మారనున్నాయి. విచారణకు హాజరై అభ్యంతరాలను వ్యక్తంచేసి,  అవసరమైన ఆధారాలను చూపిన కళాశాలల ఫీజుల మొత్తం కొంత పెరగనుంది. ఫలితంగా కొద్ది నెలలుగా సాగుతున్న ఫీజుల వ్యవహారం కొలిక్కి వచ్చినట్లయింది. గత నెల 24న రెండోసారి విచారణ జరిపిన టీఏఎఫ్‌ఆర్‌సీ  ఫీజులను ఖరారు చేసింది. రాష్ట్రంలోని 173 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 20 ఈ మొత్తాలను అంగీకరించలేదు. అందులో సీబీఐటీ, నారాయణమ్మ, వర్ధమాన్‌, శ్రీనిధి, వీఎన్‌ఆర్‌ విజ్ఞానజ్యోతి, అనురాగ్‌, విద్యాజ్యోతి, కేఎంఐటీతోపాటు మల్లారెడ్డి, సీఎంఆర్‌ గ్రూపుల్లోని మరికొన్ని కళాశాలలున్నాయి. దీంతో కమిటీ మరోసారి వారి అభ్యంతరాలను వినాలని నిర్ణయించింది. ఆ కళాశాలల ప్రతినిధులతో కమిటీ సోమవారం సుదీర్ఘంగా చర్చించింది. కళాశాలల విజ్ఞప్తులను, పత్రాలను పరిశీలించింది. అనంతరం ఆయా కళాశాలలు కొంత మొత్తాన్ని పెంచుకునేందుకు కమిటీ అంగీకరించినట్లు తెలిసింది. సీబీఐటీకి పాత ఫీజు రూ.1.34 లక్షలు ఉండగా.... గత జులైలో రూ.1.73 లక్షలుగా కమిటీ ఖరారు చేసింది. తిరిగి గత నెలలో విచారణ జరిపి దాన్ని రూ.1.12 లక్షలకు కుదించింది. తాజాగా దాన్ని రూ.1.30 లక్షలకుపైగా పెంచినట్లు తెలిసింది. ఇతర కళాశాలలకు కూడా రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు పెంచినట్లు సమాచారం. ఈ చర్చలకు వర్ధమాన్‌, మల్లారెడ్డి, సీఎంఆర్‌ గ్రూపు కళాశాలలు రాలేదని సమాచారం. ఈ సమీక్షలో టీఏఎఫ్‌ఆర్‌సీ ఛైర్మన్‌ జస్టిస్‌ స్వరూప్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి, కమిటీ సభ్య కార్యదర్శి వాకాటి కరుణ, రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి తదితరులు పాల్గొన్నారు. ఈసారి అత్యధిక ఫీజు ఎంజీఐటీకి రూ.1.60 లక్షలు. కనీస రుసుం రూ.45 వేలుగా నిర్ణయించారు. ఫీజుల వ్యవహారం కొలిక్కి రావడంతో మరికొద్ది రోజుల్లో ప్రభుత్వం జీవో జారీ చేయనుంది.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts