సంక్షిప్త వార్తలు (14)

భారతీయ మత్తు వైద్యుల సంఘం ఆవిర్భవించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ డాక్టర్లు ఘనంగా వేడుకలను నిర్వహిస్తున్నారు.

Updated : 05 Oct 2022 06:33 IST

డిగ్రీలో 1.73 లక్షల మంది చేరిక

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో దోస్త్‌ మూడో విడత ముగిసే నాటికి డిగ్రీలో 1.73 లక్షల మంది ప్రవేశాలు పొందారు. ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ ఉన్నందున  ఆ సంఖ్య మరికొంత పెరగనుంది. అయినా గత ఏడాది కంటే ప్రవేశాల సంఖ్య కొంత తగ్గే అవకాశం కనిపిస్తోంది. గత రెండేళ్లు ఇంటర్‌లో 100 శాతం మంది పాస్‌ కావడంతో డిగ్రీలో చేరే వారి సంఖ్య 2.30 లక్షలకు చేరిందని ఉన్నత విద్యామండలి వర్గాలు చెబుతున్నాయి.


దేవాలయాల్లో జమ్మి మొక్కలు నాటాం: అల్లోల

ఈనాడు, హైదరాబాద్‌: హరిత సవాలులో భాగంగా రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో జమ్మి మొక్కలు నాటినట్లు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మంగళవారం తెలిపారు. రాష్ట్రంలోని 2,583 దేవాలయాల్లో.. 3,797 జమ్మి మొక్కలు నాటినట్లు వెల్లడించారు. దసరా పండగ రోజు జమ్మి చెట్టుకు రాష్ట్రంలో ప్రత్యేక ప్రాధాన్యత నేపథ్యంలో.. ఈ మొక్కలను నాటినట్లు పేర్కొన్నారు.


పౌరసరఫరాల అధికారి సస్పెన్షన్‌

ఆసిఫాబాద్‌, న్యూస్‌టుడే: కుమురం భీం జిల్లా కేంద్రంలోని ఎంఎల్‌ఎస్‌ గోదాంలో జరిగిన అవకతవకల నేపథ్యంలో జిల్లా పౌరసరఫరాల అధికారి స్వామికుమార్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముగ్గురు సభ్యులతో కమిటీ వేసి గోదాములోని బియ్యం నిల్వల్లో వచ్చిన తేడాలపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. కమిటీ ప్రాథమిక నివేదిక మేరకు సదరు అధికారిపై సస్పెన్షన్‌ విధించినట్లు వివరించారు. 15 రోజుల్లోగా పూర్తి నివేదిక అందించాలని కమిటీ అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.


దేవాలయాల్లో జమ్మి మొక్కలు నాటాం: మంత్రి అల్లోల

ఈనాడు, హైదరాబాద్‌: హరిత సవాలులో భాగంగా రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో జమ్మి మొక్కలు నాటినట్లు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మంగళవారం తెలిపారు. రాష్ట్రంలోని 2,583 దేవాలయాల్లో.. 3,797 జమ్మి మొక్కలు నాటినట్లు వెల్లడించారు. దసరా పండగ రోజు జమ్మి చెట్టుకు రాష్ట్రంలో ప్రత్యేక ప్రాధాన్యత నేపథ్యంలో.. ఈ మొక్కలను నాటినట్లు పేర్కొన్నారు.


74 మందికి కరోనా

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మంగళవారం 74 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మొత్తం 7,786 కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం 585 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా 98 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.


అనిస్థిషియాపై అవగాహన

ఈనాడు, హైదరాబాద్‌: భారతీయ మత్తు వైద్యుల సంఘం ఆవిర్భవించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ డాక్టర్లు ఘనంగా వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజల్లో మత్తు మందు వైద్యంపై అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా అనిస్థిషియా జ్యోతిని ప్రదర్శిస్తున్నారు. తొలుత నిజామాబాద్‌లో మంగళవారం జ్యోతి ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ వీరేశం, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రామకృష్ణారెడ్డి, జాతీయ సంఘం సభ్యులు డాక్టర్‌ కిషన్‌, రాష్ట్ర మీడియా కన్వీనర్‌ డాక్టర్‌ కిరణ్‌ మాదల, ఇతర వైద్యులు, ఈ విభాగంలో సేవలందిస్తున్న నర్సులు పాల్గొన్నారు. నిజామాబాద్‌ తర్వాత కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల మీదుగా జ్యోతి ప్రదర్శన సాగుతూ ఈ నెల 12న హైదరాబాద్‌లో ముగుస్తుంది. ఇలా అన్ని రాష్ట్రాల నుంచి సుమారు 300కిపైగా స్థానాల్లో ప్రతినిధులు జ్యోతి ప్రదర్శనను నిర్వహించి.. ఈ నెల 16న ‘అంతర్జాతీయ అనిస్థిషియా డే’ సందర్భంగా దిల్లీలో ఇండియా గేట్‌ వద్ద కలుస్తారు.


గోపాలమిత్రుల వేతనం 30 శాతం పెంపు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గోపాలమిత్ర పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో పాడి రైతులకు సహాయ సహకారాలు అందిస్తున్న గోపాలమిత్రులకు వేతనం 30 శాతం పెంచి ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. ప్రస్తుతం నెలకు రూ.8,500 చెల్లిస్తుండగా, ఇకపై మరో రూ.2,550 కలిపి ఇస్తామని మంగళవారం ఇక్కడ తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు నెలకు రూ.3,500 ఇవ్వగా, తమ ప్రభుత్వ హయాంలో ఒకేసారి రూ.8,500కి పెంచామని, ఇప్పుడు మరో 30 శాతం అదనంగా ఇవ్వనున్నామని వివరించారు. గోపాల మిత్రుల కృషి ఫలితంగా రాష్ట్రంలో పాల సేకరణ పెరిగిందన్నారు. తమకు వేతనం పెంచినందుకు సీఎంకు, మంత్రికి ఆ సంఘం నేత శ్రీనివాస్‌ కృతజ్ఞతలు తెలిపారు.


కృష్ణా జలాలు వృథా చేయం: సీఎండీ ప్రభాకరరావు

ఈనాడు, హైదరాబాద్‌: కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ బాధ్యతగా వ్యవహరిస్తోందని, విద్యుదుత్పత్తి పేరుతో తాము వృథా చేయమని రాష్ట్ర జెన్‌కో-ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాగార్జునసాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులలోని నీటిని విద్యుదుత్పత్తికి వినియోగించి తెలంగాణ వృథా చేస్తోందని ఏపీ రాష్ట్ర ఈఎన్‌సీ నారాయణరెడ్డి ఇటీవల కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయడంపై ఆయన మండిపడ్డారు. ఈ ఆరోపణలో నిజం లేదని, పూర్తిగా అవాస్తవమని ఆయన తెలిపారు. అధిక వర్షాలతో ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ఏపీ ప్రభుత్వం కూడా శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేస్తోందని ఆయన గుర్తుచేశారు.  


విద్యుత్‌ చట్టసవరణ బిల్లు కేంద్రానికే అనుకూలం

ఈనాడు, హైదరాబాద్‌: పార్లమెంటులో ప్రవేశపెట్టిన విద్యుత్‌ చట్టసవరణ బిల్లు కేంద్రానికే అనుకూలంగా ఉందని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండళ్ల(ఈఆర్‌సీ) పాలకవర్గాల జాతీయ వేదిక(ఫోరం ఆఫ్‌ రెగ్యులేటర్స్‌) అభిప్రాయపడింది. దీనివల్ల విద్యుత్‌ సరఫరాపై ప్రభావం పడే అవకాశాలున్నాయంది. ఈ వేదిక సమావేశం ఇటీవల ఆన్‌లైన్‌ విధానంలో జాతీయస్థాయిలో జరిగింది. తెలంగాణ ఈఆర్‌సీ ఛైర్మన్‌ శ్రీరంగారావుతో పాటు అన్ని రాష్ట్రాల మండళ్ల ఛైర్మన్లు పాల్గొని పలు అంశాలపై తమ అభిప్రాయాలు తెలిపారు. కరెంటు కొనుగోలు బకాయిలను విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు సకాలంలో చెల్లించకపోతే రాష్ట్రాలకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలిచ్చే అధికారాలను జాతీయ లోడు డిస్పాచ్‌ కేంద్రం(ఎన్‌ఎల్‌డీసీ)లకు విద్యుత్‌ చట్ట సవరణ ద్వారా కల్పించడం సరికాదని వేదిక స్పష్టం చేసింది.


కేసీఆర్‌ పార్టీకి మత్స్యకారుల మద్దతు

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: కేసీఆర్‌ ప్రారంభించబోయే జాతీయ పార్టీకి రాష్ట్రంలోని మత్స్యకారుల మద్దతు ఉంటుందని రాష్ట్ర మత్స్యకార సమన్వయ కమిటీ సభ్యులు డా.గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్‌, జగన్‌ ముదిరాజ్‌, బళ్ల సత్తయ్య  పేర్కొన్నారు.


ఆఫర్‌ లెటర్ల రద్దుపై ఐటీ కంపెనీలు స్పష్టతనివ్వాలి
ఫోరమ్‌ ఆఫ్‌ ఐటీ ప్రొఫెషనల్స్‌ డిమాండ్‌

ఈనాడు, హైదరాబాద్‌: వేలాది మంది అభ్యర్థులకు గతంలో కొలువుకు ఎంపికైనట్లు ఇచ్చిన ఆఫర్‌ లెటర్లను విప్రో, ఇన్ఫోసిస్‌, యాక్సెంచర్‌, టెక్‌ మహీంద్రా తదితర కంపెనీలు ఉపసంహరించుకున్నాయని కొద్ది రోజులుగా వార్తలు వసున్నందున ఆయా కంపెనీలు తక్షణం స్పందించి స్పష్టతనివ్వాలని ఫోరమ్‌ ఆఫ్‌ ఐటీ ప్రొఫెషనల్స్‌ సంస్థ డిమాండ్‌ చేసింది. నెలల తరబడి ఉద్యోగాలు లేకపోవడంతో అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారని, అందుకు సంబంధించి ట్విటర్‌, లింక్డ్‌ఇన్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో పలు కేసులు వస్తున్నందున ఆయా పరిశ్రమలు స్పందించాలని కోరింది. యువ ఇంజినీర్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఒకసారి ఆఫర్‌ లెటర్‌ ఇచ్చిన తర్వాత వాటిని రద్దు చేయకూడదని ఫోరమ్‌ డిమాండ్‌ చేసింది. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న వారు 7673985813 నంబర్‌లో తమను సంప్రదించవచ్చని సూచించింది.


భవానీలకు ఏర్పాట్లేవీ..?

ఈనాడు, అమరావతి: విజయవాడ కనకదుర్గమ్మకు మొక్కు సమర్పించేందుకు పాదయాత్రగా వచ్చే భవానీలు తీరా గుడి వద్దకు వచ్చాక పడిగాపులు పడాల్సి వస్తోంది. కాళ్లు కాలిపోతున్నా.. రాళ్లు గుచ్చుకొని రక్తం కారుతున్నా.. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు క్యూలైన్లలో నిల్చోవాల్సి వస్తోంది. భవానీల కోసం ప్రత్యేక క్యూ లైను ఏర్పాటు చేయలేదు. రోజుల పాటు నడిచి వచ్చిన వారినీ సాధారణ క్యూ లైన్ల నుంచే పంపుతున్నారు. హోమగుండం, దీక్షా విరమణకూ ఏర్పాట్లు చేయలేదు. కనీసం దుస్తులు, పూజా సామగ్రినీ ఘాట్ల నుంచి ఎప్పటికప్పుడు తొలగించడం లేదు.


అంతరిక్ష పరిశోధనల్లో అగ్రరాజ్యాలతో పోటీ
తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి
షార్‌లో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు

శ్రీహరికోట, న్యూస్‌టుడే: అంతరిక్ష పరిశోధనల్లో మన దేశం అగ్రరాజ్యాలతో పోటీపడుతోందని తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లో మంగళవారం ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను ప్రారంభించారు. అంతరిక్ష పరిశోధనల్లో విక్రమ్‌ సారాభాయ్‌ వంటి మహనీయుల సేవలు గుర్తు చేశారు. విద్య, వైద్య రంగాల్లో ఈ ప్రయోగాల ఆవశ్యకత, ఉపయోగాలను సారాభాయ్‌ ప్రభుత్వానికి వివరించి ఒప్పించారన్నారు. సతీశ్‌ ధావన్‌ వంటి మేధావులు పరిశోధనలను ముందుకు నడిపించారని, అందుకే ఈరోజు విదేశీ ఉపగ్రహాలను మన రాకెట్ల ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెడుతున్నామన్నారు. కార్యక్రమంలో షార్‌ సంచాలకులు ఎ.రాజరాజన్‌, అంతరిక్ష వారోత్సవాల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ సెంథిల్‌ కుమార్‌, విజిలెన్సు అధికారి శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.


కాళ్లు లేని మేకపిల్ల

శ్రీపెరంబుదూర్‌, న్యూస్‌టుడే: తమిళనాడులోని కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్‌ తాలూకా శివపురం గ్రామంలో కాళ్లు లేని మేకపిల్ల పుట్టింది. గ్రామానికి చెందిన వసంత మహాలింగం మందలోని ఓ మేక సోమవారం రాత్రి రెండు పిల్లలను ఈనింది. ఒక పిల్ల బాగానే ఉంది. మరో దానికి మాత్రం కాళ్లు లేవు. ఇందుకు జన్యు లోపాలే కారణమని పశువైద్యులు తెలిపారు. మేకపిల్లను చూసేందుకు పరిసర ప్రజలు పెద్దఎత్తున వచ్చారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని