ఒంట్లో ఆర్నెల్లకు పైగా కరోనా తిష్ఠ

కొవిడ్‌ వచ్చి తగ్గాక కూడా నిరంతరాయంగా జ్వరం రావడం, దగ్గు, ఆయాసం, రక్త పరీక్షల్లో సీఆర్‌పీ పెరగడం, సీటీ స్కాన్‌ చేసినప్పుడు ఊపిరితిత్తుల్లో నిమోనియా లక్షణాలు కనిపించడం వంటివి గుర్తిస్తే ఒంట్లో ఇంకా కరోనా వైరస్‌ ఉందేమోనని అనుమానించాలి.

Updated : 06 Oct 2022 07:22 IST

శ్వాసకోశాల్లో అంతర్లీనంగా వైరస్‌
సాధారణ పరీక్షల ద్వారా నిర్ధారణ కష్టం  
రోగనిరోధక శక్తి తక్కువున్నవారిలో ముప్పు అధికం.. పరిశోధనల్లో వెల్లడి

ఈనాడు- హైదరాబాద్‌: కొవిడ్‌ వచ్చి తగ్గాక కూడా నిరంతరాయంగా జ్వరం రావడం, దగ్గు, ఆయాసం, రక్త పరీక్షల్లో సీఆర్‌పీ పెరగడం, సీటీ స్కాన్‌ చేసినప్పుడు ఊపిరితిత్తుల్లో నిమోనియా లక్షణాలు కనిపించడం వంటివి గుర్తిస్తే ఒంట్లో ఇంకా కరోనా వైరస్‌ ఉందేమోనని అనుమానించాలి. టీబీ, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌, మలేరియా తదితర వ్యాధులేమీ లేవని ముందుగా తేల్చుకోవాలి... ఇదే విషయాన్ని ఇటీవల అమెరికాలోని ఎమోరీ, ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. తాజాగా తమ అధ్యయన పత్రాల్లో వెల్లడించారు.

హైదరాబాద్‌కు చెందిన ఒక మానసిక వైద్యుడు(50) క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్నారు. చికిత్సలో భాగంగా ‘రిటుక్సిమాబ్‌’ ఇంజక్షన్‌ ఇచ్చారు. ఈ క్రమంలోనే కొవిడ్‌ మూడోదశలో గత జనవరిలో వైరస్‌ బారినపడ్డారు. స్వల్ప లక్షణాలే కనిపించాయి. రెండువారాల్లో  తగ్గిపోయాయి. నెల తర్వాత జ్వరం మొదలైంది. ఎంతకీ తగ్గటం లేదు.. 25 కిలోల వరకూ బరువు తగ్గారు. పరీక్ష చేయిస్తే రక్తంలో సీఆర్‌పీ గణనీయంగా పెరిగింది. సీటీ స్కాన్‌ ద్వారా.. ఊపిరితిత్తుల్లో నిమోనియాను గుర్తించారు. వైద్యులు బయాప్సీ సహా పరీక్షలన్నీ చేశారు. ఎన్నిసార్లు పరీక్షించినా కొవిడ్‌ లేదనే ఫలితాలు వస్తున్నాయి. కొవిడ్‌ చికిత్సానంతరం ‘ఆటోఇమ్యూన్‌ డిజార్డర్‌’ సోకి ఉంటుందనే అంచనాతో స్టెరాయిడ్‌ చికిత్స చేయాలనుకున్నా..దానిపై అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి మరో వైద్యుడి వద్దకు వెళ్లారు. అక్కడ మరింత లోతుకు వెళ్లి ఖరీదైన ఎలక్ట్రాల్‌ మైక్రోస్కోపీ పరీక్ష చేసి, శ్వాసకోశ కణజాలాన్ని పరీక్షించగా.. వైరస్‌ ఊపిరితిత్తుల్లోనే తిష్ఠ వేసిందని నిరూపితమైంది. సాధారణ విధానంలో ఇది సాధ్యం కాలేదు. అప్పుడు రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ ఇవ్వడంతో రెండు వారాల్లోనే రోగి కోలుకున్నారు. కొందరిలో దీర్ఘకాలం ఇలా కరోనా వైరస్‌ వేధిస్తోందని చెబుతున్నారు శ్వాసకోశ వైద్య నిపుణులు డా.విశ్వనాథ్‌ గెల్లా.  

ఎవరిలో ఎక్కువ హాని..?

కొవిడ్‌ సోకినా అత్యధికుల్లో 1-2 వారాల్లో వైరస్‌ శరీరం నుంచి మాయమవుతుంది. గరిష్ఠంగా 3 వారాలు ఉంటుంది. కొందరిలోనేమో అది ఆర్నెల్ల పైబడి తిష్ఠవేస్తోంది. ముఖ్యంగా 65 ఏళ్లు పైబడినవారిలో, కీమోథెరపీ తీసుకున్నవారిలో, క్యాన్సర్‌ చికిత్సల్లో భాగంగా ఇచ్చే రిటుక్సిమాబ్‌ ఇంజక్షన్‌ చేయించుకున్నవారిలో, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో నెలల తరబడి కూడా వైరస్‌ ఉంటున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. సాధారణంగా రిటుక్సిమాబ్‌ ఇంజక్షన్‌ను ఆటోఇమ్యూన్‌ డిజార్డర్స్‌లో, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ చికిత్సలో కూడా ఇస్తుంటారు. అది ఇచ్చినప్పుడు శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి, వైరస్‌ త్వరగా ఒంట్లోంచి వెళ్లిపోవడం లేదని తేలింది.  

కొత్త వేరియంట్‌ల పుట్టుక ముప్పూ..

కరోనా వైరస్‌ దీర్ఘకాలం శ్వాసకోశాల్లో ఉన్నప్పుడు.. అక్కడ క్రమేపీ వాటి సంఖ్య పెరిగిపోతుంది. ఈ వైరస్‌లో సహజసిద్ధ మార్పుల ఫలితంగా అత్యధిక సందర్భాల్లో హానికారక వేరియంట్‌లు పుట్టకపోవచ్చు. కానీ, ఒక వ్యక్తిలో వైరస్‌ దాగి ఉన్నపుడు అంతర్గతంగా విపరీత మార్పులు చోటుచేసుకొని, వారిలోనూ డెల్టా, ఒమిక్రాన్‌ వంటి ప్రమాదకర వేరియంట్‌లు ఉద్భవించవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. వారి ద్వారా ఇతరులకు వ్యాపించి, ప్రజారోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. అత్యధికులు రెండు డోసుల టీకా స్వీకరించినా.. కొవిడ్‌ బారిన అంతకుముందే పడినా.. మళ్లీ వారు వైరస్‌ బాధితులవుతున్నారు. దీనికి మూలకారణం.. వైరస్‌ నిరంతరాయంగా మార్పులకు లోనవడమేనని తాజా అధ్యయనంలో తేల్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం దీన్ని ధ్రువీకరించింది.


లక్షణాలుంటే తప్పదు మాస్కు
- డా.విశ్వనాథ్‌ గెల్లా, సీనియర్‌ శ్వాసకోశ వైద్యనిపుణులు, ఏఐజీ

రోనా వైరస్‌ దీర్ఘకాలం ఊపిరితిత్తుల్లో తిష్ఠవేసి ఉన్న కేసులను ఇటీవల చూస్తున్నాం. కారణం కనుగొనేలోపే దాని బారినపడి 50ఏళ్ల వయస్కులు ఇద్దరు చనిపోయారు కూడా. తర్వాత కొన్ని అంతర్జాతీయ అధ్యయనాల్లో ఈ అంశంపై కొత్త విషయాలు వెలుగుచూశాయి. కొందరిలో 4-6 నెలలకు పైగా కూడా వైరస్‌ శరీరంలోనే ఉంటుందని వెల్లడైంది. శరీరంలో అంతర్లీనంగా వైరస్‌ ఉత్పరివర్తనం జరుగుతున్నా.. నెలల తరబడి తెలియకుండా ఉంటుంది. ప్రత్యేకంగా కీమోథెరపీ ఇచ్చిన వారిలో ఇలా జరిగే అవకాశం అధికం. వీరిలో కొత్త వేరియంట్‌లూ ఉత్పత్తి కావచ్చు. అవి వీరి ద్వారా ఇతరులకు వ్యాపించకుండా ఉండాలంటే.. లక్షణాలున్నప్పుడు కచ్చితంగా మాస్కు ధరించాలి. కొవిడ్‌ వచ్చి తగ్గాక కూడా నిరంతరాయంగా జ్వరం రావడం, దగ్గు, నిమోనియా వంటి లక్షణాలుంటే.. కరోనా వైరస్‌ ఒంట్లోనే ఉందేమోనని అనుమానించాలి. తప్పక వైద్యుడిని కలవాలి. ఇతర వ్యాధులేమీ లేవని నిర్ధారించుకున్నాక రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ తీసుకోవాలి.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని