సంక్షిప్త వార్తలు(5)

గ్రామ రెవెన్యూ సహాయకుల సమ్మె శుక్రవారం 75 వ రోజుకు చేరనుంది. ప్రభుత్వం హామీ ఇచ్చిన పే స్కేలు, ఉద్యోగ క్రమబద్ధీకరణ, వారసులకు ఉద్యోగ అవకాశం తదితర అంశాలను అమలు చేయాలని కోరుతూ జులై 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 22 వేల మంది వీఆర్‌ఏలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.

Updated : 07 Oct 2022 06:53 IST

ప్రభుత్వ పిలుపు కోసం వీఆర్‌ఏల ఎదురుచూపు

ఈనాడు, హైదరాబాద్‌-ఇల్లంతకుంట, న్యూస్‌టుడే:: గ్రామ రెవెన్యూ సహాయకుల సమ్మె శుక్రవారం 75 వ రోజుకు చేరనుంది. ప్రభుత్వం హామీ ఇచ్చిన పే స్కేలు, ఉద్యోగ క్రమబద్ధీకరణ, వారసులకు ఉద్యోగ అవకాశం తదితర అంశాలను అమలు చేయాలని కోరుతూ జులై 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 22 వేల మంది వీఆర్‌ఏలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. గత నెలలో రెండుసార్లు వీఆర్‌ఏల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌ చర్చలు నిర్వహించారు. అయినా  ఆశించిన ఫలితం రాలేదన్న కారణంతో సమ్మె కొనసాగించేందుకు ఐకాస మొగ్గుచూపింది. సీఎం కేసీఆర్‌ సమస్యలు పరిష్కరిస్తారన్న నమ్మకం ఉందని, చర్చల కోసం ఎదురుచూస్తున్నామని ఐకాస పేర్కొంది.

మరో వీఆర్‌ఏ ఆత్మహత్యాయత్నం: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో ఓ వీఆర్‌ఏ గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సమ్మె శిబిరం వద్ద తాళ్లపెల్లి వీఆర్‌ఏ మల్లేశం ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా.. సహచర వీఆర్‌ఏలు అతనిని నిలువరించడంతో ప్రమాదం తప్పింది.  


సాగర్‌ క్రస్ట్‌ గేట్ల మూసివేత

నాగార్జున సాగర్‌, న్యూస్‌టుడే: నాగార్జున సాగర్‌ డ్యాం క్రస్ట్‌ గేట్ల ద్వారా బుధవారం అర్ధరాత్రి నీటి విడుదల నిలిపివేశారు.  శ్రీశైలం నుంచి వస్తున్న వరద 36,972 క్యూసెక్కులకు తగ్గడంతో క్రస్ట్‌ గేట్లను మూసివేశారు. గురువారం సాయంత్రం 5 గంటలకు శ్రీశైలం నుంచి 49,817 క్యూసెక్కుల వరద వస్తుండగా.. కాల్వలు,  విద్యుత్‌ కేంద్రం, ద్వారా అంతే మొత్తం  విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌ నీటిమట్టం 589.80 (గరిష్ఠం 590.00) అడుగులు, నీటి నిల్వ 311.4474 (గరిష్ఠం 312.0450) టీఎంసీలుగా ఉంది.


ఎండీఎస్‌ కోర్సులకు నేటి నుంచి కౌన్సెలింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పీజీ దంతవైద్య కళాశాలల్లో ఎండీఎస్‌ కన్వీనర్‌ సీట్ల భర్తీ కోసం ఈనెల 7 నుంచి 9 వరకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు కాళోజీ వర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యరులు ఈనెల 7న ఉదయం 10 నుంచి 9వ తేదీ ఉదయం 10 గంటల వరకు కళాశాలల వారీగా ఆప్షన్లు ఇవ్వాలని కోరింది. ఖాళీసీట్లు, ఇతర వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.


కొత్తగా 57 కొవిడ్‌ కేసులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 57 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 8,38,300కు పెరిగింది. తాజాగా మరో 96 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ 8,33,681 మంది ఆరోగ్యవంతులయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 508 మంది కొవిడ్‌తో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 6,050 నమూనాలను పరీక్షించగా.. మొత్తం పరీక్షల సంఖ్య 3,77,19,977కు పెరిగింది. తాజా ఫలితాల్లో హైదరాబాద్‌లో 39 పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో మరో 57,594 కొవిడ్‌ టీకా డోసులు పంపిణీ చేశారు.


వికారాబాద్‌ - పర్లి వైద్యనాథ్‌ ప్రాజెక్టులో 98.7 కి.మీ. విద్యుదీకరణ: ద.మ.రైల్వే

ఈనాడు, హైదరాబాద్‌: వికారాబాద్‌ నుంచి మహారాష్ట్రలోని పర్లి వైద్యనాథ్‌ ప్రాజెక్టులో భాగంగా తాజాగా మరో 98.7 కిమీ. రైలు మార్గాన్ని విద్యుదీకరించినట్లు దక్షిణ మధ్య రైల్వే గురువారం ప్రకటించింది. ఖానాపూర్‌-లాతూర్‌ రోడ్‌ స్టేషన్ల మధ్య ఈ పనులు పూర్తయ్యాయని తెలిపింది. వికారాబాద్‌-పర్లి వైద్యనాథ్‌ మధ్య మొత్తం 269 కిమీ మార్గం కాగా దశలవారీగా కలిపి వికారాబాద్‌ నుంచి లాతూర్‌ వరకు మొత్తం 204 కిమీ మేర విద్యుదీకరణ పూర్తయ్యిందని వివరించింది.


చిత్రవార్త

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts