మద్యం అమ్మకాలు రెట్టింపు

దసరా పండగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. సాధారణ రోజులతో పోల్చితే దాదాపు రెట్టింపు విక్రయాలు జరిగాయి.

Published : 07 Oct 2022 03:28 IST

8 రోజుల్లో డిపోల నుంచి రూ.1,320 కోట్ల సరకు తరలింపు

సెప్టెంబరు 30న ఒక్కరోజే రూ.313 కోట్ల విక్రయాలు

ఈనాడు, హైదరాబాద్‌: దసరా పండగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. సాధారణ రోజులతో పోల్చితే దాదాపు రెట్టింపు విక్రయాలు జరిగాయి. గత నెల 25 నుంచి ఈ నెల 4 వరకు మద్యం డిపోల నుంచి దుకాణాలకు ఏకంగా రూ.1,320.91 కోట్ల మద్యం సరఫరా అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆదివారాలైన సెప్టెంబరు 25, ఈ నెల 2ను మినహాయించి.. మిగిలిన ఎనిమిది రోజుల్లో రోజుకు సగటున రూ.165 కోట్ల చొప్పున మద్యం సరఫరా అయింది. సాధారణ రోజుల్లో సగటున రూ.70-90 కోట్ల చొప్పున సరఫరా అవుతుంది. ఈ నెల 3న రూ.138.30 కోట్లు, పండగ ముందు రోజు (ఈ నెల 4న) రూ.192.48 కోట్ల మేర మద్యం సరఫరా అయింది. సెప్టెంబరు 30న ఒక్కరోజే ఏకంగా రూ.313.64 కోట్ల మద్యం దుకాణాలకు తరలిపోవడం గమనార్హం. ఒక్కరోజు అమ్మకాల్లో ఇది రికార్డని అధికారులు చెబుతున్నారు. గతేడాది ఇదే రోజు రూ.171.17 కోట్ల మద్యం మాత్రమే సరఫరా అయింది. అప్పటికంటే ఈసారి దాదాపు రెట్టింపు మొత్తంలో అమ్ముడుపోవడం గమనార్హం. ఈసారి మద్యం వ్యాపారులపై ఎక్సైజ్‌ అధికారులు విపరీతమైన ఒత్తిడి పెంచడం వల్లే భారీస్థాయిలో దుకాణాలకు తరలినట్లు తెలుస్తోంది. మరోవైపు దసరా సందర్భంగా ప్రముఖులకు ఇవ్వాలంటూ పలువురు అధికారులు ఎక్సైజ్‌ స్టేషన్ల వారీగా దుకాణాల నుంచి పెద్దఎత్తున మద్యం పట్టుకెళ్లారనే ఆరోపణలు గుప్పుమన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని