వచ్చే నోటిఫికేషన్లలో ఎస్టీలకు 10% రిజర్వేషన్‌

రాష్ట్రంలో ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఇకనుంచి వెలువడే నోటిఫికేషన్లలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్‌ అమలు చేయడంపై విద్యాశాఖ దృష్టి సారించింది.

Updated : 07 Oct 2022 05:05 IST

అమలుపై ఉన్నత విద్యామండలి కసరత్తు

ఎడ్‌సెట్‌, లాసెట్‌, పీఈసెట్‌లతో పాటు ఫార్మసీ కౌన్సెలింగ్‌కు వర్తింపు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఇకనుంచి వెలువడే నోటిఫికేషన్లలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్‌ అమలు చేయడంపై విద్యాశాఖ దృష్టి సారించింది. ఉద్యోగాలు, ప్రవేశాల్లో గిరిజనులకు ఇప్పటివరకు ఉన్న 6 శాతం రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసింది. ఈ నేపథ్యంలో కొత్త రిజర్వేషన్‌ అమలుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి సన్నద్ధమైంది. ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఏటా ఏడు రకాల ప్రవేశ పరీక్షలు ఎంసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌, పీజీఈసెట్‌, ఎడ్‌సెట్‌, లాసెట్‌, పీఈసెట్‌(వ్యాయామ విద్య) జరుగుతాయి. వాటిలో ఈసారి గిరిజన విద్యార్థులకు 6 శాతానికి బదులు 10 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 50% సీట్లు రిజర్వేషన్‌ ప్రకారం కేటాయించేవారు. మిగిలిన 50% ఓపెన్‌ కోటా ఉండేది. తాజాగా గిరిజన రిజర్వేషన్లు పెరగడంతో ఇక నుంచి 46% మాత్రమే ఓపెన్‌ కోటా ఉంటుందని ప్రవేశాల కన్వీనర్లు చెబుతున్నారు.

వీటికి వర్తించదు! 

ఇప్పటికే ఈసెట్‌ కౌన్సెలింగ్‌ పూర్తయింది. ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ఒక విడత సీట్ల కేటాయింపు ముగిసింది. పీజీఈసెట్‌ ధ్రువపత్రాల పరిశీలన ముగియగా.. శుక్రవారం నుంచి వెబ్‌ ఆప్షన్లు మొదలుకావాల్సి ఉంది. ఐసెట్‌కు కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ కూడా వెలువడింది. రిజర్వేషన్‌ పెంచుతూ జీవో వెలువడక ముందే వీటి కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్లు వెలువడటంతో పాత రిజర్వేషన్‌ మాత్రమే అమలవుతుందని ఉన్నత విద్యామండలి వర్గాలు స్పష్టంచేశాయి.

ఇక రావాల్సినవి నాలుగు నోటిఫికేషన్లు 

బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎడ్‌సెట్‌, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే లాసెట్‌, బ్యాచులర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌(బీపీఎడ్‌), డిప్లొమా ఇన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌(డీపీఎడ్‌) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పీఈసెట్‌కు సంబంధించిన ప్రవేశాల నోటిఫికేషన్లు ఇంకా వెలువడలేదు. వీటితోపాటు ఎంసెట్‌లో బైపీసీ విద్యార్థులకు ఫార్మసీ కౌన్సెలింగ్‌కు సంబంధించిన ప్రకటన కూడా ఇంకా రాలేదు. అందులోనూ 10 శాతం గిరిజన రిజర్వేషన్‌ అమలు చేయనున్నారు.


సీట్‌ మ్యాట్రిక్స్‌ మారుస్తాం

- ఆచార్య ఆర్‌.లింబాద్రి, ఛైర్మన్‌, రాష్ట్ర ఉన్నత విద్యామండలి 

ప్రభుత్వం సెప్టెంబరు 30న జీవో జారీ చేయడంతో.. ఆ తర్వాత విడుదలయ్యే ప్రవేశాల నోటిఫికేషన్లకు రిజర్వేషన్‌ పెంపు వర్తిస్తుంది. దీని ప్రకారం సాఫ్ట్‌వేర్‌ ద్వారా సీట్ల కేటాయింపునకు సీట్‌ మ్యాట్రిక్స్‌ మారుస్తాం. నోటిఫికేషన్‌ వెలువరించడానికి ముందు ప్రవేశాల కమిటీ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటాం.


ఇప్పటివరకు రిజర్వేషన్‌ ఇలా..

బీసీ: 29; ఎస్సీ: 15; ఎస్టీ: 6 (ఇది 10 శాతం కానుంది), మొత్తం: 50
గమనిక: దివ్యాంగులకు 3, ఎన్‌సీసీ-1, నేషనల్‌ ఆర్మ్‌డ్‌ పర్సన్స్‌-2, క్రీడాకారులకు 0.5 శాతం రిజర్వేషన్‌ ఉన్నా.. ఆయా కేటగిరీల్లోనే దాన్ని అమలు చేస్తారు. ఈడబ్ల్యూఎస్‌ కోటా 10 శాతాన్ని సూపర్‌ న్యూమరరీ కింద అదనంగా కేటాయిస్తారు.


Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని