ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగం భూసేకరణకు నిధులివ్వండి

ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం భూసేకరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి.

Updated : 07 Oct 2022 10:24 IST

రాష్ట్రానికి జాతీయ రహదారుల సంస్థ లేఖ

సుమారు రూ.3 వేల కోట్ల వ్యయాన్ని చెరిసగం భరించనున్న కేంద్రం-రాష్ట్రం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం భూసేకరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించేందుకు అంగీకరించిన నేపథ్యంలో ఉత్తర భాగంలో భూసేకరణకు రాష్ట్ర వాటాను విడుదల చేయాల్సిందిగా కేంద్ర జాతీయ రహదారుల సంస్థ తాజాగా లేఖ రాసింది. మొత్తం 340 కిలోమీటర్ల ప్రాంతీయ రింగు రోడ్డులో 158.60 కిలోమీటర్ల మేర ఉండే ఉత్తర భాగాన్ని సంగారెడ్డి- నర్సాపూర్‌- తూప్రాన్‌- గజ్వేల్‌- జగదేవ్‌పూర్‌- భువనగిరి- చౌటుప్పల్‌ వరకు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సుమారు 4,851 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇందుకు రూ.3 వేల కోట్ల వరకు వ్యయం అవుతుందని అధికారుల అంచనా. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.1,500 కోట్లు చెల్లించాల్సి ఉంది. రాష్ట్ర బడ్జెట్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ భూసేకరణకు ప్రత్యేక పద్దు ఏర్పాటు చేసి రూ.500 కోట్లు కేటాయించారు. మరో రూ.1,000 కోట్లు మంజూరు చేయాల్సి ఉంటుంది. రహదారి నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. ఉత్తర భాగం నిర్మాణానికి రూ.6,500 కోట్ల వరకు అవుతుందని అంచనా.

పరిహారం చెల్లింపునకు 2-3 నెలలు
భూసేకరణకు వీలుగా కొన్ని ప్రాంతాల్లో భూ యజమానులకు నోటీసులు జారీచేశారు. అభ్యంతరాల స్వీకరణ గడువు పూర్తయింది. వాటి పరిశీలన పూర్తి కాగానే ఆయా యజమానులకు తుది నోటీసు జారీచేస్తారు. పరిహారం నిర్ణయించి.. చెల్లించేందుకు రెండు మూడు నెలలకుపైగా సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

85 హెక్టార్ల అటవీ భూమి..
నర్సాపూర్‌, గజ్వేల్‌ రిజర్వు ఫారెస్టుల మీదుగా వెళ్లే ఈ రహదారి నిర్మాణానికి 85 హెక్టార్ల అటవీ భూమిని సేకరించాల్సి ఉంది. ఈ రెండు ప్రాంతాల్లో అరుదైన వన్యప్రాణుల సంచారం పెద్దగా లేదని అధికారులు గుర్తించారు. ఈ భూములను డీ-నోటిఫై చేసేందుకు రాష్ట్ర అటవీశాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తికి 4-5 నెలలు పడుతుందని అటవీ అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగం భూసేకరణ 6-7 నెలల్లో కొలిక్కి వస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు దక్షిణ భాగం రహదారి నిర్మాణానికి నిర్వహిస్తున్న మార్గ సర్వే ఈ నెలాఖరుకు పూర్తికానుందని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని