ఎంత పనిచేసిందబ్బా గొర్రె!

గొర్రెల పంపిణీ పథకం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం నగదు జమ చేసినప్పటికీ దాన్ని తీసుకునే వీల్లేకుండా చేయడంతో కొందరు లబ్ధిదారులు నిరాశ చెందుతుండగా, దళారుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది.

Updated : 07 Oct 2022 06:44 IST

మునుగోడు పరిధి అర్హుల ఖాతాలలో గొర్రెల పంపిణీ పథకం డబ్బు జమ

లబ్ధిదారులు తీసుకోకుండా ఆదేశాలు

దళారులకు కంటగింపుగా కొత్త మార్గదర్శకాలు

చౌటుప్పల్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: గొర్రెల పంపిణీ పథకం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం నగదు జమ చేసినప్పటికీ దాన్ని తీసుకునే వీల్లేకుండా చేయడంతో కొందరు లబ్ధిదారులు నిరాశ చెందుతుండగా, దళారుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఈ పథకం కింద గతంలో పశువైద్యుల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు జీవాలను కొనుగోలు చేసి ఇచ్చేవారు. ఈ నేపథ్యంలో మోసాలు జరిగినట్టు సర్కారుకు ఫిర్యాదులు వచ్చాయి. పశువైద్యులు తమకు నాణ్యత లేని జీవాలు అంటగట్టినట్టు గొర్రెల సంఘం నేతలు సర్కారు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సర్కారు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తొలిసారిగా మునుగోడు నియోజకవర్గాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమచేసేలా మార్గదర్శకాలు ఇచ్చింది. ఆ ప్రకారం నియోజకవర్గంలో 7,600 మందిని అర్హులుగా గుర్తించి, రెండు విడతల్లో రూ.93.78 కోట్లు విడుదల చేసింది. వాస్తవంగా సదరు సొమ్మును పశుసంవర్ధకశాఖ నల్గొండ జిల్లా కలెక్టర్‌ ఖాతాకు బదిలీ చేయగా, ఆయన ఆయా వ్యక్తుల వ్యక్తిగత ఖాతాలలో జమచేశారు. అయితే ఆ సొమ్మును నేరుగా సదరు లబ్ధిదారులు తీసుకునే వీల్లేకుండా మండల పరిషత్‌ అభివృద్ధి అధికారుల ద్వారా స్థానిక బ్యాంకులకు ఆదేశాలు జారీచేశారు. ‘సొమ్ము ప్రభుత్వం జమ చేసిందనే సమాచారం మాత్రం బ్యాంకు ఖాతా ద్వారా లబ్ధిదారుడికి తెలుస్తుంది. ఆ వ్యక్తి గొర్రెలను కొనుగోలు చేసినప్పుడు, అమ్మిన వ్యక్తి ఖాతాకు ఆ సొమ్మును బదిలీ చేయాల్సి ఉంటుంది’ అని పశుసంవర్ధకశాఖ రాష్ట్ర సంచాలకుడు డాక్టర్‌ రాంచందర్‌ ‘ఈనాడు’కు చెప్పారు. పథకం అమలు విధివిధానాలు ఖరారైన తర్వాత ఈ డబ్బులు ఎలా చెల్లించాలనే దానిపై స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు.

ప్రభుత్వం మొదటి విడతలో గొర్రెలను పంపిణీ చేసినప్పుడు ఎక్కువ మంది దళారులు లబ్ధి పొందారు. రెండో విడతలో గొర్రెల పంపిణీకి శ్రీకారం చుడుతున్నారని తెలుసుకుని  దళారులు రంగంలోకి దిగారు. లబ్ధిదారులు చెల్లించాల్సిన వాటా సొమ్ము (రూ.43,754)ను వారి పేరుతో దళారులే చెల్లించి డీడీలు తీశారు. మొత్తం వ్యవహారాన్ని తామే నడిపించేలా, లబ్ధిదారుకు రూ.10-20 వేలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. ఇప్పుడు ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నగదు జమచేయడం, ఆ సొమ్ము కూడా తీసుకునే వీల్లేకుండా చేయడంతో దళారులు ఆందోళన చెందుతున్నారు. కొంతమంది లబ్ధిదారులతో వారు గొడవలకు దిగుతున్నట్టు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని