సమస్యల పరిష్కారానికి ఇద్దరు సీఎంలు కలిసి పనిచేయాలి

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పార్టీలకు అతీతంగా కలిసి కృషి చేస్తే ఎంతటి సమస్యలైనా పరిష్కారమవుతాయని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు.

Published : 07 Oct 2022 04:54 IST

హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ

ఘనంగా ‘అలయ్‌-బలయ్‌’

అబిడ్స్‌, న్యూస్‌టుడే: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పార్టీలకు అతీతంగా కలిసి కృషి చేస్తే ఎంతటి సమస్యలైనా పరిష్కారమవుతాయని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. భిన్న సంస్కృతులకు నిలయమైన దేశంలో అందరినీ ఏకం చేయడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న అలయ్‌-బలయ్‌ కార్యక్రమానికి వారిద్దరినీ ఆహ్వానించామని, అనివార్య కారణాలతో రాలేకపోయారని పేర్కొన్నారు. విజయ దశమిని పురస్కరించుకొని నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో గురువారం అలయ్‌-బలయ్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌, దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో  కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడారు. కార్యక్రమానికి హాజరైన సినీనటుడు చిరంజీవి అభిమానుల కేరింతల నడుమ డప్పు వాయిస్తూ, నృత్యం చేశారు. అలయ్‌-బలయ్‌ను దేశవ్యాప్తంగా నిర్వహించాలని ఆయన కోరారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలప్పుడే రాజకీయాలని.. ఆ తర్వాత అందరూ కలిసిమెలిసి పనిచేసే సంప్రదాయం రావాలని కోరారు. కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. ‘అలయ్‌-బలయ్‌’ పేరిట ఇప్పటికే సినిమా తీయాల్సిందని చిరంజీవిని ఉద్దేశించి అన్నారు. వచ్చే ఏడాది ప్రతి జిల్లాలోనూ అలయ్‌-బలయ్‌ నిర్వహించాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌.విద్యాసాగర్‌రావు కోరారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి భగవంత్‌ ఖుబా, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కేకే, రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్య, ఎంపీలు కె.లక్ష్మణ్‌, అర్వింద్‌, ఆర్‌.కృష్ణయ్య, కాంగ్రెస్‌ నాయకుడు వీహెచ్‌, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, ఎమ్మెల్యేలు ఈటల, రఘునందన్‌రావు, ఎమ్మెల్సీలు ఎగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్‌లతో పాటు వివిధ పార్టీల నేతలు కోదండరాం, నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి, కూనంనేని, రామకృష్ణ, వివేక్‌, రాంచందర్‌రావు, విశ్వేశ్వర్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, మురళీధర్‌రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, దిలీప్‌కుమార్‌, రావుల చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. దత్తాత్రేయను కురుమ సంఘం నేతలు సత్కరించారు. ‘అలయ్‌ బలయ్‌’ నిర్వహించడం సంతోషాన్ని కలిగిస్తోందంటూ దత్తాత్రేయకు ప్రధాని మోదీ లేఖ రాశారు.

సెల్ఫీలు ఆపకపోతే ప్రసంగం నిలిపేస్తా: గరికపాటి
తాను ప్రసంగిస్తున్న సమయంలో చిరంజీవి అభిమానులు సెల్ఫీల కోసం హడావిడి చేయడంతో ‘‘సెల్ఫీలు ఆపకపోతే ప్రసంగం ఆపేయాల్సి వస్తుంది’’ అని ఆధ్యాత్మికవేత్త గరికపాటి నరసింహారావు సుతిమెత్తగా హెచ్చరించారు. వేదికపై సెల్ఫీల కోసం పోటీపడుతున్న అభిమానులకు చిరంజీవి నచ్చజెప్పి కిందకు పంపించారు. అనంతరం గరికపాటి తన ప్రసంగం కొనసాగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని