కాళేశ్వరానికి కావాల్సింది 8,082 మెగావాట్లు

కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి.. అదనపు టీఎంసీతో కలిపి అవసరమైన విద్యుత్తు భారీగా పెరగనుంది. ఈ పథకంలో తొలుత చేపట్టిన రెండు టీఎంసీలకు 4,627 మెగావాట్ల విద్యుత్తు అవసరం కాగా, మరో టీఎంసీని ఎత్తిపోసేందుకు 3,455 మెగావాట్లు కావాల్సి ఉంది.

Published : 07 Oct 2022 04:54 IST

అదనపు టీఎంసీ ఎత్తిపోతలతో కలిపి..

విద్యుత్తు ఖర్చు రూ.4,149 కోట్లు

కేంద్ర జలసంఘానికి సమర్పించిన సవరించిన డీపీఆర్‌లో వెల్లడి

ఈనాడు హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి.. అదనపు టీఎంసీతో కలిపి అవసరమైన విద్యుత్తు భారీగా పెరగనుంది. ఈ పథకంలో తొలుత చేపట్టిన రెండు టీఎంసీలకు 4,627 మెగావాట్ల విద్యుత్తు అవసరం కాగా, మరో టీఎంసీని ఎత్తిపోసేందుకు 3,455 మెగావాట్లు కావాల్సి ఉంది. దీంతో ఈ ప్రాజెక్టుకు మొత్తం 8,082 మెగావాట్ల విద్యుత్తు అవసరమని కేంద్ర జలసంఘానికి సమర్పించిన.. సవరించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లో నీటిపారుదల శాఖ పేర్కొంది. పంపులు, మోటార్ల సామర్థ్యంలో 80 శాతం మాత్రమే విద్యుత్తు వినియోగం ఉంటుందని, దీని ప్రకారం 6,465 మెగావాట్ల విద్యుత్తు సరిపోతుందని తెలిపింది. గోదావరిలో వరద వచ్చే రోజులు 90 నుంచి 100 మాత్రమేనని, తక్కువ రోజుల్లోనే ప్రాజెక్టు కింద ఆయకట్టు అవసరాలకు తగ్గట్లుగా నీటిని ఎత్తిపోయాల్సి ఉందని, దీనికోసమే అదనపు టీఎంసీ ఎత్తిపోసే పనిని చేపట్టాల్సి వస్తోందని నివేదించింది. గతంలో రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసే పథకం నిర్మాణ వ్యయం రూ.80,499 కోట్లకు జలసంఘం ఆమోదించింది. తాజాగా సమర్పించిన సవరించిన డీపీఆర్‌ ప్రకారం మూడు టీఎంసీలు ఎత్తిపోసేందుకు రూ.1.07 లక్షల కోట్ల  వ్యయమవుతుందని నీటిపారుదల శాఖ పేర్కొంది. ‘‘ఈ ప్రాజెక్టు కింద 18,25,700 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీటి సరఫరా, 18,82,970 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ.. హైదరాబాద్‌, ఇతర ప్రాంతాలకు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు కలిపి 225 టీఎంసీల నీరు అవసరం. ఇందులో 195 టీఎంసీలు మేడిగడ్డ నుంచి, 20 టీఎంసీలు ఎల్లంపల్లి నుంచి మళ్లిస్తాం. 25 టీఎంసీల భూగర్భజలాన్ని వినియోగించుకొంటాం’’ అని డీపీఆర్‌లో వివరించారు. నీటిని ఎత్తిపోయడానికి ఏడాదికి అయ్యే విద్యుత్తు ఖర్చు రూ.4,148.79 కోట్లుగా పేర్కొన్నారు. పథకం నిర్వహణకు మరో రూ.112 కోట్లు అవసరం.

ఈ ప్రాజెక్టులో మొత్తం 120 పంపులు ఏర్పాటు చేశారు. ‘‘రిజర్వాయర్ల సామర్థ్యం పెంచినందున తక్కువ సమయంలో ఎత్తిపోసే నీటి నిల్వకు సమస్య లేదు. ఎక్కువ ప్రాజెక్టుల కింద ఆయకట్టు స్థిరీకరణకు ఉపయోగపడే కాళేశ్వరం అన్నిటికి తల్లిలాంటి ప్రాజెక్టు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు అదనపు టీఎంసీని ఎత్తిపోయడానికి అవసరమైన సౌకర్యం ఉంది. కాలువలు కూడా 3 టీఎంసీల సామర్థ్యంతో ఉన్నాయి. అయినా ప్రతిసారీ రోజుకు మూడు టీఎంసీలు ఎత్తిపోయడం వీలుకాదు. జులైలో మొదటి పది రోజులు ఒకటిన్నర టీఎంసీ చొప్పున, సెప్టెంబరు మూడో వారంలో రెండు టీఎంసీల చొప్పున మాత్రమే ఎత్తిపోసేందుకు అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ ఖర్చుకు పది శాతం వడ్డీ చొప్పున ఏడాదికి రూ.10,892.30 కోట్లు అవుతుంది’’ అని 187 పేజీల సవరించిన డీపీఆర్‌లో రాష్ట్రం పేర్కొంది.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts