ఫీజుల జీవో...11 నాటికి వస్తుందా?

రాష్ట్రంలో వచ్చే మూడేళ్లకు కొత్త ఫీజుల జీవోకు సంబంధించిన దస్త్రం ప్రభుత్వానికి చేరింది. తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) ఈనెల 3వ తేదీన 20 కళాశాలలను విచారించి గత కొద్ది నెలలుగా సాగుతున్న రుసుముల వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చింది.

Updated : 08 Oct 2022 06:09 IST

సర్కారుకు చేరిన ఇంజినీరింగ్‌ ఫీజుల దస్త్రం
జీవో వస్తేనే రెండో విడత కౌన్సెలింగ్‌లో అమల్లోకి కొత్త రుసుములు
లేకుంటే వేల మంది విద్యార్థుల్లో గందరగోళమే

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వచ్చే మూడేళ్లకు కొత్త ఫీజుల జీవోకు సంబంధించిన దస్త్రం ప్రభుత్వానికి చేరింది. తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) ఈనెల 3వ తేదీన 20 కళాశాలలను విచారించి గత కొద్ది నెలలుగా సాగుతున్న రుసుముల వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చింది. మొత్తం 173 ఇంజినీరింగ్‌ కళాశాలల రుసుములను ఖరారు చేసింది. వాటికి ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం జీవో జారీ చేయాల్సి ఉంది. ఈ నెల 11 నుంచి ఎంసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ మొదలవుతుంది. ఆ మరుసటి రోజు నుంచి వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ఆరంభమవుతుంది. అంటే 11వ తేదీ నాటికి జీవో వెలువడితేనే కొత్త ఫీజులు అమల్లోకి వస్తాయి. లేకుంటే ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులను చెల్లించాల్సి ఉంటుందని... ప్రస్తుతానికి పాత ఫీజులు కొనసాగుతాయని సూచిస్తూ నోట్‌ను ఉంచాలి. ఈ నేపథ్యంలో ఫీజులపై ప్రకటన విడుదల చేయాలని లేకుంటే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గందరగోళానికి గురవుతారని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే కన్వీనర్‌ కోటా కింద వసూలు చేస్తున్న ఫీజులు ఒక రకంగా...హైకోర్టుకు వెళ్లిన కళాశాలలు వసూలు చేయాల్సిన ఫీజులు మరో రకంగా ఉన్నాయి. ఇప్పటికే పలు కళాశాలల ఫీజులు రెండు, మూడుసార్లు మారాయి. చివరికి ఎంత ఖరారు చేస్తారో తెలియకుంటే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. అర్హులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ జీవో కూడా ఇవ్వాల్సి ఉంటుంది. లేని పక్షంలో బోధనా రుసుం మినహాయించి ఇంకెంత చెల్లించాలన్నది ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రస్తుతం 10 వేలలోపు ర్యాంకు ఉన్న అర్హులైన అన్ని కేటగిరీల వారికి 100 శాతం బోధనా రుసుంగా చెల్లిస్తున్నారు. ఎస్‌సీ, ఎస్‌టీలకు మాత్రం ర్యాంకుతో నిమిత్తం లేకుండా పూర్తి ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ ఇస్తున్నారు.

చివరి విడతలో బీఫార్మసీ కౌన్సెలింగ్‌..

బీఫార్మసీ కోర్సులకు ఆయా వర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇవ్వనందున మొదటి విడతలో ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులకు బీఫార్మసీ కౌన్సెలింగ్‌ జరపలేదు. రెండో విడత సమయానికి కూడా ఆ ప్రక్రియ పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు. అంటే ఇక చివరి విడతలోనే బీఫార్మసీ సీట్లను భర్తీ చేయనున్నారు. ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులు (ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ విభాగం ర్యాంకుతో) కన్వీనర్‌ కోటా కింద కేవలం 250కి మించి ప్రవేశాలు పొందరని, అందువల్ల చివరి విడతలో ఆ కోర్సును చేర్చినా సమస్య రాదని అధికారులు చెబుతున్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని