నల్సార్‌లో అవకతవకలపై విచారించండి

జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన తెలంగాణలోని నల్సార్‌ వర్సిటీ అవకతవకలకు వేదికగా మారిందనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

Published : 08 Oct 2022 02:40 IST

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కేంద్రం విజ్ఞప్తి

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన తెలంగాణలోని నల్సార్‌ వర్సిటీ అవకతవకలకు వేదికగా మారిందనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గత వైస్‌ ఛాన్సలర్‌ హయాంలో నియామకాలతోపాటు, నిధుల వినియోగం, కార్యక్రమాల ఏర్పాటు తదితరాలన్నీ యూజీసీ, నల్సార్‌ చట్టానికి వ్యతిరేకంగా జరిగాయంటూ న్యాయవాది బి.మల్లేష్‌ యాదవ్‌ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును కేంద్ర న్యాయశాఖ మంత్రి..నల్సార్‌ వర్సిటీ ఛాన్సలర్‌ అయిన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపారు.

ఫిర్యాదులో ఏముందంటే

‘‘గత వైస్‌ ఛాన్సలర్‌ అధికార దుర్వినియోగంతోపాటు, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ చట్టవిరుద్ధంగా నియామకాలు చేపట్టారు. యూజీసీ విధివిధానాలను తుంగలో తొక్కుతూ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్ల నియామకాలు జరిపారు. ఇంగ్లిష్‌ ఫ్యాకల్టీగా అర్హత లేని వ్యక్తిని నియమించారు. మరో ఇద్దరు ప్రొఫెసర్ల అండతో అక్రమాలకు పాల్పడ్డారు. వారిద్దరిలో ఒక ప్రొఫెసర్‌ పదవీ విరమణ చేసిన తర్వాత కూడా కమిటీ సమావేశాలకు హాజరవుతున్నారు. అంతేగాకుండా గౌరవ ప్రొఫెసర్‌ హోదాలో ఆయనకు నెలకు రూ.3.5 లక్షల వేతనాన్ని నిర్ణయించడం ద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. యూనివర్సిటీని రాజకీయ వేదికగా మార్చడానికి ప్రయత్నించారు. వామపక్ష భావజాలం ఉన్న ప్రొఫెసర్లతో వివాదాస్పద అంశాలపై చర్చా కార్యక్రమాలు నిర్వహించారు. వాటిని వ్యతిరేకిస్తున్న వారిపై వేధింపులకు పాల్పడ్డారు. వేధింపులు భరించలేక తప్పనిసరి పరిస్థితుల్లో పలువురు ప్రొఫెసర్లు బయటికి వెళ్లిపోయారు. నిధుల దుర్వినియోగమూ జరుగుతోంది. గ్రంథాలయంలో పుస్తకాల కొనుగోలులో అక్రమాలు జరిగాయి. తనకు నచ్చిన వ్యక్తికే కాంట్రాక్టు ఇచ్చారు’’ అని న్యాయవాది ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు ఫిర్యాదును ఉంటంకిస్తూ కేంద్ర న్యాయశాఖ మంత్రి.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌కు లేఖ పంపారు. ‘చట్ట ప్రకారం వీసీ నియామకంతోపాటు అవకతవకలపై విచారణ జరిపే అధికారం ఛాన్సలర్‌గా మీకుంది. ఈ ఆరోపణలపై విచారించి బాధ్యులపై తగిన చర్య తీసుకోవాలని’’ ఆ లేఖలో కోరారు. నెల క్రితం ఆ లేఖ పంపిన న్యాయశాఖ మంత్రి..ఇటీవల మరోసారి ఈ విషయాన్ని గుర్తుచేస్తూ మరో లేఖ పంపినట్టు సమాచారం.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts