CI Nageswar Rao: సీఐ నాగేశ్వర్‌రావుపై వేటు

పోలీసు ప్రతిష్ఠకు మచ్చతెచ్చారనే కారణంతో హైదరాబాద్‌ మారేడుపల్లిలో ఇన్‌స్పెక్టర్‌గా చేసిన కొరట్ల నాగేశ్వర్‌రావును సర్వీసు నుంచి తొలగిస్తూ నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఉత్తర్వులు జారీచేశారు. మరి కొందరిపైనా వేటు వేసినట్టు పేర్కొంటూ సోమవారం సీపీ ఓ ప్రకటన విడుదల చేశారు.

Updated : 11 Oct 2022 09:17 IST

మహిళపై అత్యాచారం ఘటన నేపథ్యంలో డిస్మిస్‌

లైంగిక వేధింపుల కేసుల్లో మరో సీఐ, ఎస్‌ఐ తొలగింపు

రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌, అయిదుగురు కానిస్టేబుళ్లు, ఇద్దరు సిబ్బందిపైనా చర్యలు

సీపీ సీవీ ఆనంద్‌ ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: పోలీసు ప్రతిష్ఠకు మచ్చతెచ్చారనే కారణంతో హైదరాబాద్‌ మారేడుపల్లిలో ఇన్‌స్పెక్టర్‌గా చేసిన కొరట్ల నాగేశ్వర్‌రావును సర్వీసు నుంచి తొలగిస్తూ నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఉత్తర్వులు జారీచేశారు. మరి కొందరిపైనా వేటు వేసినట్టు పేర్కొంటూ సోమవారం సీపీ ఓ ప్రకటన విడుదల చేశారు.  ఈ ఏడాది జులైలో వనస్థలిపురం ప్రాంతానికి చెందిన ఓ మహిళను ఆయన తుపాకీతో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎదురుతిరిగిన బాధితురాలిని, ఆమె భర్తను కిడ్నాప్‌ చేసి కారులో శివార్లలోని తన ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్తుండగా కారు ప్రమాదానికి గురైంది. తప్పించుకున్న బాధితురాలు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా నాగేశ్వర్‌రావు అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు ఫోరెన్సిక్‌ ఆధారాలు సేకరించారు. ఆయన్ను సస్పెండ్‌ చేయడంతోపాటు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇటీవల షరతులతో కూడిన బెయిల్‌పై మాజీ సీఐ విడుదలయ్యారు.

శాఖాపరమైన విచారణ కోసమేనా?

ఘటనను తెలంగాణ/నగర పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఇన్‌స్పెక్టర్‌ హోదాలో అధికారాన్ని దుర్వినియోగం చేయడం, శాఖకు మచ్చతెచ్చేలా వ్యవహరించడం వంటి తీవ్ర నేరారోపణలు ఉన్నందున నాగేశ్వర్‌రావుపై శాఖాపరమైన విచారణ జరిపించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన బాధితులను బెదిరించడం, సాక్షులను ప్రభావితం చేయడం, విచారణ సజావుగా సాగకుండా ప్రతికూల పరిస్థితులు సృష్టించడం వంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉందని పేర్కొంటూ.. ఆర్టికల్‌ 311(2)(బీ),3 ప్రకారం సర్వీస్‌ రిమూవల్‌ కోరుతూ నగర సీపీ సీవీ ఆనంద్‌ రిక్రూట్‌మెంట్‌ అథారిటీకి లేఖ రాశారు. సీపీ లేఖను పరిగణనలోకి  తీసుకున్న అథారిటీ మాజీ సీఐని సర్వీసు నుంచి  తొలగించింది.

మహిళా కానిస్టేబుల్‌పై లైంగిక వేధింపులతో..

లాలాగూడ ఠాణాలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన కె.శ్రీనివాస్‌రెడ్డి.. మహిళా కానిస్టేబుల్‌ను లైంగికంగా వేధించినట్లు రుజువు కావడంతో సర్వీసు నుంచి తొలగించారు. ‘2020లో లాలాగూడ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న సమయంలో అదే ఠాణాలో పనిచేస్తున్న తన పట్ల ఆయన అనుచితంగా ప్రవర్తించినట్టు, అర్ధరాత్రి సమయాల్లో వ్యక్తిగత వాట్సప్‌ నంబరుకు అసభ్యకర సందేశాలు పంపడం, వీడియో కాల్స్‌ చేయడం ద్వారా లైంగిక వేధింపులకు గురిచేసినట్టు బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు ఆయనపై కేసు నమోదైంది. అప్పటి సీపీ అంజనీకుమార్‌ ఆయన్ను సస్పెండ్‌ చేశారు. కె.శ్రీనివాస్‌రెడ్డిని డిస్మిస్‌ చేస్తూ తాజాగా సీపీ ఆదేశాలు జారీచేశారు.

* ఓయూ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ప్రొబేషన్‌ ఎస్సై బి.నరసింహ తన బ్యాచ్‌మేట్‌(మహిళా ఎస్సై) పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు గతంలో కేసు నమోదైంది. పోలీసుశాఖ అంతర్గత విచారణలో బాధితురాలిని ఆయన వేధించినట్టు రుజువైంది. ప్రస్తుతం రెయిన్‌బజార్‌ ఠాణా ఎస్సైగా విధుల్లో ఉన్న ఆయన ప్రొబేెషన్‌ను టెర్మినేట్‌ చేస్తున్నట్లు సీపీ ఉత్తర్వులో పేర్కొన్నారు.

* ఇద్దరు మహిళలతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ కట్టుకున్న భార్యను అదనపు కట్నం కోసం వేధించిన రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇ.శ్రీనివాస్‌ను కూడా సర్వీసు నుంచి తొలగించారు.

* మద్యం మత్తులో బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ సిబ్బందిపై దాడికి పాల్పడిన, హైదరాబాద్‌ నగర పరిధిలో పనిచేస్తున్న ఎస్సై కె.శ్యామ్‌, హత్య కేసుల్లో ప్రమేయం ఉన్న అయిదుగురు కానిస్టేబుళ్లనూ డిస్మిస్‌ చేశారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన ఇద్దరు మినిస్టీరియల్‌ ఉద్యోగులపైనా అదే చర్యలు తీసుకున్నారు. మొత్తంగా పది నెలల వ్యవధిలో వివిధ హోదాల్లో ఉన్న 55 మంది పోలీసు అధికారులపై వేటుపడినట్టు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని