మహేశ్వరంలో రూ.750 కోట్లతో మలబార్‌ యూనిట్‌

పెట్టుబడులకు తెలంగాణ అనువైన రాష్ట్రమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న సమాచార సాంకేతికత (ఐటీ), బయోటెక్నాలజీ, వైమానిక, రక్షణ, బంగారు ఆభరణాలు, వస్త్ర, రవాణా, ఆహారశుద్ధి వంటి అనేక రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు.

Published : 16 Oct 2022 04:36 IST

ఆభరణాల తయారీ, బంగారు శుద్ధి కర్మాగారానికి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన

మాదాపూర్‌, న్యూస్‌టుడే: పెట్టుబడులకు తెలంగాణ అనువైన రాష్ట్రమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న సమాచార సాంకేతికత (ఐటీ), బయోటెక్నాలజీ, వైమానిక, రక్షణ, బంగారు ఆభరణాలు, వస్త్ర, రవాణా, ఆహారశుద్ధి వంటి అనేక రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ సంస్థ రూ.750 కోట్లతో మహేశ్వరం జనరల్‌ పార్క్‌లో ఏర్పాటు చేస్తున్న ఆభరణాల తయారీ, బంగారు శుద్ధి కర్మాగారానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని శనివారం మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించారు. మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా ‘‘తెలంగాణలో నిపుణులైన స్వర్ణకారులు ఎంతోమంది ఉన్నారు. నారాయణపేట ప్రాంతంలోని స్వర్ణకారుల వద్ద నగలు చేయించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వినియోగదారులు వస్తున్నారంటే ఎలాంటి గుర్తింపు ఉందో అర్థం చేసుకోవచ్చు. మలబార్‌ పరిశ్రమలో అలాంటి స్వర్ణకారులకు ఉద్యోగావకాశం కల్పించాలి. ఈ తరహాలోనే ఇతర సంస్థలు తెలంగాణలో పరిశ్రమలు ఏర్పాటుకు ముందుకు వస్తే రాష్ట్రం జ్యువెలరీ హబ్‌గా మారుతుంది’’ అని వివరించారు.

మలబార్‌ సంస్థ ఛైర్మన్‌ ఎం.పి.అహ్మద్‌ మాట్లాడుతూ.. వచ్చే నవంబరు నాటికి తమ సంస్థ ఏర్పాటై 30 ఏళ్లు పూర్తవుతుందన్నారు. అప్పటికి ఈ కర్మాగారం సిద్ధమవుతుందని చెప్పారు. తమ సంస్థకు దేశంలో 9, విదేశాల్లో 6 ఆభరణాల తయారీ కేంద్రాలు ఉన్నాయని, ఇక్కడ 2.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న కేంద్రం వాటన్నింటికంటే పెద్దదని వివరించారు. ఏడాదికి పది టన్నుల బంగారు ఆభరణాలు, 1.5 లక్షల క్యారెట్ల వజ్రాభరణాల ఉత్పత్తి సామర్థ్యంతో కర్మాగారం, 180 టన్నుల బంగారం శుద్ధి సామర్థ్యంతో రిఫైనరీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, కమిషనర్‌ కృష్ణభాస్కర్‌, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని