మూలిగే నక్కపై తాటికాయలా అధిక జనాభా

ఘర్షణలు, భూతాపం, తీవ్రస్థాయి వాతావరణ పోకడలు, ఆర్థిక మందగమనాలు, తిరోగమనాలతో ప్రపంచం ఇప్పటికే సతమతమవుతోంది.

Published : 14 Nov 2022 04:58 IST

ఘర్షణలు, భూతాపం, తీవ్రస్థాయి వాతావరణ పోకడలు, ఆర్థిక మందగమనాలు, తిరోగమనాలతో ప్రపంచం ఇప్పటికే సతమతమవుతోంది. అలాంటి పరిస్థితుల్లో పెరుగుతున్న జనాభా వల్ల అనేక ప్రాంతాల్లో ఇబ్బందులు తీవ్ర రూపం దాలుస్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్‌ మహమ్మారితో పరిస్థితి సంక్లిష్టమైన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

పరిస్థితులు ఎంతలా మెరుగుపడినా 2030 నాటికి 66 కోట్ల మంది క్షుద్బాధతో అల్లాడతారని అంచనా.

2020లో ప్రపంచ జనాభాలో దాదాపు 30 శాతం మందికిపైగా ఎంతో కొంత ఆహార కొరతను ఎదుర్కొన్నారు.

దాదాపు 300 కోట్ల మందికి పోషకాహారం పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండటంలేదు. భవిష్యత్‌లో ఈ సమస్యలు తీవ్రం కానున్నాయి.

సేద్యం, ఆహార భద్రతకు

భూమిపై 40 శాతం భూభాగం పంట, పశువులకు గడ్డి నేలలుగా ఉపయోగపడుతోంది. అటవీ భూభాగం (30 శాతం) కన్నా ఇది అధికం. అభివృద్ధికి నోచుకోని దేశాల్లో 70 శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటోంది. వీరికి వ్యవసాయమే జీవనాధారం. వాతావరణ మార్పుల ప్రభావం సేద్యంపై ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పంట దిగుబడులు తగ్గొచ్చు. జనాభా ఎక్కువగా పెరుగుతున్న ప్రాంతాల్లో ఈ ఇబ్బంది తీవ్రంగా ఉండొచ్చు. ఇది సామూహిక వలసలకు దారితీయవచ్చు.

కరవు భూతం: క్రీస్తు శకం 850లో మధ్య అమెరికాలో మాయన్‌ నాగరికత అంతం కావడానికి కరవే కారణం.

19వ శతాబ్దం చివర్లో ఇదే సమస్యతో చైనాలో 6 కోట్ల మంది మృత్యువాత పడ్డారు.

అభివృద్ధి చెందిన దేశాలనూ కరవు మహమ్మారి కాటేసింది. 1845-1852 మధ్య ‘ఐరిష్‌ పొటాటో కరవు’ తలెత్తింది. బంగాళా దుంపల్లో వచ్చిన పొటాటో బ్లైట్‌ వ్యాధే ఇందుకు కారణం. దీనివల్ల 10 లక్షల మంది చనిపోయారు.

20వ శతాబ్దంలో కరవుల వల్ల 7 కోట్ల మంది చనిపోయి ఉండొచ్చని అంచనా. ఇందులో 3 కోట్ల మంది 1958-1961 మధ్య చైనాలో బలయ్యారు. 1943లో భారత్‌లో 70 లక్షల నుంచి కోటి మంది చనిపోయారు.

ఎంత మందికి ఆహారం..?

ఎంత జనాభాకు పుడమిపై సుస్థిరంగా జీవించడానికి ఆస్కారం ఉందన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపై భిన్న రకాల అంచనాలు వచ్చాయి. 2020లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. పుడమికి సంబంధించిన ఎలాంటి పరిమితులను ఉల్లంఘించకుండా.. ఉన్న ఆహార వనరులతో 300 కోట్ల మందికి మాత్రమే తిండి పెట్టొచ్చు. సాగు విధానాలు, పంట రకాలు, ప్రదేశాలు వంటి అంశాల్లో మార్పు ద్వారా దాన్ని 800 కోట్లకు పెంచొచ్చు. వృథాను తగ్గిస్తే మరింత మందికి ఆహారం అందించొచ్చు.


పులి మీద పుట్రలా భూతాపానికి, అధిక జనాభా తోడుకావడం మానవ ఆరోగ్యంపై పెను ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వేడిమి పెరగడం వల్ల ఆరోగ్యపరంగా ఉత్పన్నమయ్యే ప్రధాన సమస్యలివీ..

అంటువ్యాధులు: మానవుల్లో వచ్చే సాంక్రమిక వ్యాధుల్లో దాదాపు సగం.. వాతావరణ మార్పుల వల్ల మరింత పెరుగుతాయి. కొన్ని ప్రాంతాల్లో వరదలు పెరిగి, నీటి నాణ్యతపై ప్రభావం పడుతుంది. బ్యాక్టీరియా, వ్యాధులను వ్యాప్తి చేసే దోమలు వంటి వాహకాలు పెరుగుతాయి.

డెంగీతో ఇప్పటికే 10 కోట్ల మంది బాధపడుతున్నారు. జనాభా పెరిగేకొద్దీ ఇది సర్వసాధారణమవుతుంది. ఈ వ్యాధి వ్యాప్తిని ఆర్‌వో (రిప్రొడక్షన్‌ నంబర్‌)తో కొలుస్తారు. 1950లతో పోలిస్తే 2012-21 నాటికి ఇది ఏకంగా 12 శాతం మేర పెరిగింది.

లాటిన్‌ అమెరికాలో 31 శాతం మేర, ఆఫ్రికాలోని పలు చోట్ల 14 శాతం మేర మలేరియా సీజను పెరిగింది.  

హెపటైటిస్‌, డయేరియా వంటి వ్యాధులు కలిగించే సూక్ష్మజీవుల వ్యాప్తి పెరుగుతుంది.

కరవుల వల్ల నీటి నాణ్యత తగ్గిపోతుంది. ఆహారం కోసం ఎలుకలు ఇళ్లల్లోకి చొరబడటం ఎక్కువవుతుంది. హంటావైరస్‌ వంటి వ్యాధుల వ్యాప్తికి ఇది దారితీయవచ్చు.

పెరుగుతున్న వేడి వల్ల మానవుల్లో గుండె, శ్వాస, మెదడు, మూత్రపిండాల వ్యాధులు పెరగొచ్చు.

నేడు ప్రపంచ జనాభాలో 30 శాతం మంది అధిక ఉష్ణ ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ శతాబ్దం చివరినాటికి అది 76 శాతానికి పెరగొచ్చని ఐపీసీసీ నివేదిక స్పష్టంచేస్తోంది.

తీవ్రస్థాయి వేడి వల్ల గత ఏడాది 470 బిలియన్‌ పనిగంటలు, 669 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని ప్రపంచం నష్టపోయింది.

జనాభా, వేడి పెరుగుదల వల్ల ఏసీలపై ఆధారపడేవాళ్ల సంఖ్య పెరుగుతుంది. ఇందుకు అవసరమైన విద్యుదుత్పత్తి కోసం శిలాజ ఇంధనాలను మండించాలి. ఫలితంగా వాతావరణ మార్పులు మరింత పెరుగుతాయి.

ఆహారం, నీటి భద్రత: పెరుగుతున్న జనాభాకు వేడిమి వల్ల ఆహార భద్రతకు ప్రమాదం ఏర్పడుతుంది. 1981- 2020తో పోలిస్తే 2021లో అధిక ఉష్ణోగ్రతల వల్ల సరాసరిన మొక్కజొన్న సాగుకు అనుకూల కాలం 9.3 రోజుల మేర పడిపోయింది. గోధుమ విషయంలో ఆ నష్టం ఆరు రోజుల మేర ఉంది.

1981-2010తో పోలిస్తే.. 2020లో వేడి గాలుల వల్ల 9.8 కోట్ల మందికి కొత్తగా ఆహార భద్రత సమస్య ఎదురైంది. నీరు ఆవిరి కావడం, హిమానీనదాలు క్షీణించి తాగునీటికి ఇబ్బంది ఏర్పడుతుంది.

నీటి కొరత, కరవు కారణంగా 2030 నాటికి 70 కోట్ల మంది వలసబాట పట్టాల్సి వస్తుంది.

పేలవమైన వాయు నాణ్యత: వాయు కాలుష్యం వల్ల వాతావరణ మార్పుల తీవ్రత పెరుగుతుంది. ఫలితంగా అలర్జీలు, ఉబ్బసం, ఇతర శ్వాస కోశ వ్యాధులు, గుండె జబ్బులు రావొచ్చు.

వృద్ధి రేటు తగ్గుముఖం

పలు దేశాల్లో జనాభా వృద్ధి రేటు తగ్గుతోంది. సంతాన సాఫల్య రేటు పడిపోవడమే ఇందుకు కారణం. దీనికితోడు సగటు ఆయుర్దాయం పెరగడం వల్ల అక్కడ వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. ఐరోపా దేశాలు, జపాన్‌, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి చోట్ల ఈ పరిస్థితి ఉంది. జనాభాలో వయోధికుల వాటా పెరగడం ఆయా దేశాలకు ఆర్థికంగా ఇబ్బందికరం.  

2022 నుంచి 2050 మధ్య 61 దేశాలు, ప్రాంతాల్లో జనాభా 1 శాతం మేర తగ్గొచ్చు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు