Hyderabad: కాలేయం మారినా.. క్రీడా హృదయం అలాగే!

వయసు 62. మధుమేహం వేధిస్తోంది. మూత్రపిండాల పనితీరు మెరుగుకు డయాలసిస్‌ చేయాల్సి వచ్చింది.

Updated : 23 Nov 2022 09:59 IST

ఆరుపదుల వయసులో అంతర్జాతీయ పోటీలకు ఎంపిక
 రైల్వే విశ్రాంత ఉద్యోగి రమణయ్య స్ఫూర్తిదాయక గాథ

ఈనాడు, హైదరాబాద్‌: వయసు 62. మధుమేహం వేధిస్తోంది. మూత్రపిండాల పనితీరు మెరుగుకు డయాలసిస్‌ చేయాల్సి వచ్చింది. కాలేయ మార్పిడి కూడా జరిగింది. ఈ స్థితిలో ఎవరి మానసిక పరిస్థితి అయినా ఎలా ఉంటుంది? గండం గడిచింది. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కాలం వెళ్లదీస్తే చాలు అనిపిస్తుంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ స్థాయి టెన్నిస్‌ పోటీల్లో పాల్గొనాలని నిర్ణయించుకుని స్ఫూర్తిగా నిలిచారు...ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన పి.వి.రమణయ్య. అందుకు సాధన చేసి, శిక్షణ తీసుకుని శారీరక దృఢత్వాన్ని పొందారు. అంతర్జాతీయ ట్రాన్స్‌ప్లాంట్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (డబ్ల్యుటీజీఎఫ్‌)-2023లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో జరగనున్న వరల్డ్‌ ట్రాన్స్‌పాంట్‌ గేమ్స్‌లో టెన్నిస్‌ ఆడేందుకు ఎంపికైన తొలి భారతీయ క్రీడాకారుడిగా ఘనత సాధించారు. 

 రమణయ్యకు చిన్నప్పటి నుంచి క్రీడలంటే ఆసక్తి. క్రీడాకోటాలో సికింద్రాబాద్‌ రైల్వేజోన్‌లో ఉద్యోగిగా చేరిన ఆయన ఆ శాఖ తరఫున పలు ఫుట్‌బాల్‌ పోటీల్లో పాల్గొన్నారు. నేపాల్‌లో జరిగిన జూనియర్‌ ఆసియా యూత్‌ ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించారు. తరచూ టెన్నిస్‌ టోర్నమెంట్లలోనూ పాల్గొనేవారు. పదవీ విరమణ అనంతరం రమణయ్యను అనారోగ్యం వెంటాడింది. హైదరాబాద్‌లోని గ్లోబల్‌ ఆసుపత్రిలో 2017లో ఆయనకు వైద్యులు కాలేయ మార్పిడి చేసి పునర్జన్మ ప్రసాదించారు. కిడ్నీల పనితీరు మెరుగుపర్చడానికి డయాలసిస్‌ కూడా చేశారు. కోలుకున్నాక వైద్యుల సూచనలు, సలహాలను పాటిస్తూ కొద్ది నెలల్లోనే రమణయ్య తిరిగి చురుగ్గా మారారు. క్రీడలసాధన ప్రారంభించారు.  వరల్డ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అనేది లాభాపేక్షలేని ఓ సంస్థ. అవయవ మార్పిడిపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో క్రీడలు నిర్వహిస్తుంటుంది. వీటిలో అవయవ దాతలు, గ్రహీతలు పాల్గొంటారు. మన దేశం నుంచి ఆడాలనుకునే క్రీడాకారులను ఆర్గాన్‌ రిసీవింగ్‌, గివింగ్‌ అవేర్‌నెస్‌ నెట్‌వర్క్‌ (ఓఆర్‌జీఏఎన్‌) ఎంపిక చేస్తుంది. ఈ సంస్థ నిర్వహించిన 5 రోజుల శిబిరంలో పాల్గొని రమణయ్య సత్తా చాటారు.ఆయన శారీరకంగా దృఢంగా ఉన్నట్లు ఈ కమిటీ ధ్రువీకరించి  2023 ఏప్రిల్‌ 15 నుంచి 21 వరకు జరిగే పోటీలకు ఎంపిక చేసింది.

ఈ సందర్భంగా రమణయ్య మాట్లాడుతూ...  కాలేయ మార్పిడితో వైద్యులు పునర్జన్మ ఇచ్చాక...ఏదో సాధించాలనే తపన మరింత పెరిగిందన్నారు. గ్లెనిగల్స్‌ గ్లోబల్‌ ఆసుపత్రి క్లస్టర్‌ సీఈవో డాక్టర్‌ రియాజ్‌ఖాన్‌ మాట్లాడుతూ.. కాలేయ మార్పిడి తర్వాత రమణయ్య అంతర్జాతీయ స్పోర్ట్స్‌మీట్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించడం చాలా గర్వంగా ఉందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని