నెలనెలా... కరెంటు షాక్‌!

పెట్రోలు, డీజిల్‌ ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నట్లే ఇంటి కరెంటు బిల్లు కూడా వచ్చే ఏప్రిల్‌ నుంచి నెలనెలా పెరగనుంది. ఇలా ఛార్జీలు పెంచడానికి ‘విద్యుత్‌ పంపిణీ సంస్థ’ (డిస్కం)లు ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి కూడా తీసుకోవాల్సిన అవసరం లేకుండా స్వేచ్ఛాయుత అధికారమిస్తూ ‘తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి’ (ఈఆర్‌సీ) బుధవారం ముసాయిదా ఉత్తర్వులను జారీచేసింది.

Published : 24 Nov 2022 05:19 IST

యూనిట్‌కు 30 పైసల వరకు డిస్కంలు నేరుగా పెంచుకోవచ్చు
ఇంధన సర్‌ఛార్జి పేరుతో ఎప్పటికప్పుడు వసూలు
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలుకు కేంద్రం అనుమతి  
ఈఆర్‌సీ ముసాయిదా ఉత్తర్వుల జారీ

ఈనాడు, హైదరాబాద్‌: పెట్రోలు, డీజిల్‌ ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నట్లే ఇంటి కరెంటు బిల్లు కూడా వచ్చే ఏప్రిల్‌ నుంచి నెలనెలా పెరగనుంది. ఇలా ఛార్జీలు పెంచడానికి ‘విద్యుత్‌ పంపిణీ సంస్థ’ (డిస్కం)లు ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి కూడా తీసుకోవాల్సిన అవసరం లేకుండా స్వేచ్ఛాయుత అధికారమిస్తూ ‘తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి’ (ఈఆర్‌సీ) బుధవారం ముసాయిదా ఉత్తర్వులను జారీచేసింది. కేంద్ర విద్యుత్‌శాఖ జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం ‘రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ రెండో సవరణ ఉత్తర్వు-2022’ పేరుతో దీనిని జారీచేస్తున్నట్లు తెలిపింది. ఈఆర్‌సీ గతంలో జారీచేసిన కరెంటు ఛార్జీల సవరణ మార్గదర్శకాలకు రెండోసారి తాజాగా సవరణ చేసినట్లు వివరించింది. ముఖ్యాంశాలు...

* ‘ఇంధన ఛార్జీల సర్దుబాటు’ (ఫ్యూయల్‌ కాస్ట్‌ ఎడ్జస్ట్‌మెంట్‌-ఎఫ్‌సీఏ)ను ఇంతకాలం ఏడాదికోసారి ప్రజలపై మోపి బిల్లుల రూపంలో డిస్కంలు వసూలు చేస్తున్నాయి. దీనివల్ల ప్రజలపై ఆర్థిక భారం అధికంగా పడుతోందని...ఇలా కాకుండా నెలనెలా కరెంటు ఛార్జీలను సవరించాలని కేంద్రం ఇటీవల రాష్ట్రాలను ఆదేశించింది. ఇది అమల్లోకి రావాలంటే రాష్ట్ర ఈఆర్‌సీ సవరణ ఉత్తర్వులు జారీచేయాల్సి ఉన్నందున ఇది ఇస్తున్నట్లు కమిషన్‌ ఛైర్మన్‌ శ్రీరంగారావు ‘ఈనాడు’కు చెప్పారు.

ఏమిటీ ఎఫ్‌సీఏ?

ప్రజలకు సరఫరా చేసే కరెంటును పలు విద్యుత్‌ కేంద్రాలు భారత ఇంధన ఎక్స్ఛేంజీ నుంచి రోజూవారీగా కొనుగోలు చేస్తాయి. ఒక విద్యుత్‌ కేంద్రం నుంచి ఎంత కొనాలనే ఒప్పందాన్ని డిస్కంలు ముందే చేసుకుంటాయి. దాని ప్రకారం ప్రతీ యూనిట్‌ కరెంటుకు స్థిరఛార్జి, చలనఛార్జి (వేరియబుల్‌ ఛార్జి) కలిపి చెల్లించాలి. చలనఛార్జి అంటే ఒక థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో కరెంటు ఉత్పత్తికి అవసరమైన బొగ్గు, పెట్రోలు, డీజిల్‌, ఇతర ముడిసరకుల కొనుగోలు, అక్కడి ఉద్యోగుల జీతభత్యాలు ఇలా అన్నింటికీ కలిపి చెల్లించే డబ్బు. ఈ ఖర్చునుబట్టి యూనిట్‌కు సగటున విధించే మొత్తాన్ని విద్యుత్‌ కేంద్రం నిర్ణయిస్తుంది. చలనఛార్జీ పెరిగేకొద్దీ ఎఫ్‌సీఏ రూపంలో కరెంటు బిల్లుల ద్వారా ప్రజల నుంచి నెలనెలా యూనిట్‌కు 30 పైసల వరకూ గరిష్ఠంగా పెంచి వసూలు చేసుకోవచ్చని ఈఆర్‌సీ సూచించింది. ఒకవేళ పెంపు యూనిట్‌కు 30 పైసలకు మించితే మాత్రం ముందుగా కమిషన్‌ నుంచి అనుమతి తీసుకోవాలని తెలిపింది.

* భారత ఇంధన ఎక్స్ఛేంజీ నుంచి సైతం రోజూవారీ కరెంటును డిస్కంలు కొంటున్నాయి. ఈ ఎక్స్ఛేంజీలో యూనిట్‌ కరెంటును సుమారు రూ.3 నుంచి గరిష్ఠంగా రూ.12 వరకూ కొంటున్నారు. ఈ భారాన్ని సైతం బిల్లుల్లో నెలనెలా పెంచి వసూలు చేసుకోవచ్చు.

* ఇంతకాలం ఏడాదికోమారు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకుని డిస్కంలు కరెంటు ఛార్జీల పెంపు ప్రతిపాదనలను నవంబరు 30 లోగా ఈఆర్‌సీకి దాఖలు చేయాలనే నిబంధన ఉంది. కానీ పలు రాష్ట్ర ప్రభుత్వాలు అసలు ఈ ప్రతిపాదనలు ఇవ్వకుండా అడ్డుకుని.. ఓట్ల కోసం ఛార్జీలు పెంచకుండా డిస్కంలను నష్టాల్లో ముంచుతున్నాయని కేంద్రం ఇటీవల విద్యుత్‌ నియమావళికి సవరణ ఉత్తర్వులిచ్చింది. వీటి ప్రకారం ఎఫ్‌సీఏ రూపంలో నెలనెలా బిల్లుల్లో డిస్కంలు వసూలుచేసుకోవచ్చని ఈఆర్‌సీ తాజాగా ఆదేశించింది.

* ప్రతి నెలలో ఎంత ఎఫ్‌సీఏ పడుతుందనేది మరుసటి నెల 15వ తేదీలోగా డిస్కం వెబ్‌సైట్‌లో ప్రజల ముందు పెట్టాలి. ఎంత ఎఫ్‌సీఏ వసూలుచేస్తున్నారో కరెంటు బిల్లులో ప్రత్యేకంగా తెలపాలి. 45 రోజుల్లోగా పత్రికల్లో ప్రకటించాలి. ఉదాహరణకు 2023 ఏప్రిల్‌కు సంబంధించిన ఎఫ్‌సీఏ సొమ్మును మే నెల కరెంటు బిల్లులో అదనంగా వేసి జూన్‌ మొదటివారంలో వసూలు చేయాలి. ఇలా ప్రతీ నెలా ఈ గడువులను తప్పనిసరిగా పాటించాలి. ఆ గడువులోగా వసూలు చేయకపోతే ఆ తరవాత వాటిని డిస్కం లాభనష్టాల్లో చూపడానికి వీల్లేదు.

* ఎఫ్‌సీఏ రూపంలో వసూలు చేస్తున్న సొమ్ము ఎంత అనేది ఈఆర్‌సీకి ఎప్పటికప్పుడు తెలపాలి. ఈ సొమ్మును డిస్కం ప్రత్యేక బ్యాంకు ఖాతాలో జమచేయాలి.

* ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఆ ఏడాదిలో ఎంత సొమ్ము ఎఫ్‌సీఏ రూపంలో వసూలుచేశారనే లెక్కలను ఈఆర్‌సీకివ్వాలి. ఒకవేళ వాస్తవ ఖర్చులకన్నా  ప్రజల నుంచి ఎక్కువ వసూలుచేసినట్లు తేలితే తిరిగి వారికి వెనక్కి చెల్లించాలి.

* వ్యవసాయానికి రాష్ట్రంలో ఉచితంగా కరెంటు సరఫరా చేస్తున్నందున ఆ యూనిట్లకు పడే ఎఫ్‌సీఏ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిస్కంలు వసూలు చేయాలి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోతే ఆ సొమ్మును తిరిగి ప్రజల నుంచి వసూలు చేయరాదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని