మాతో బలవంతంగా సంతకాలు

‘ఆదాయపన్ను శాఖ సోదాలు నాకు కొత్త కాదు. 1994, 2008లలోనూ తనిఖీలు జరిగాయి. ఈసారి తనిఖీలు తీవ్ర మనస్తాపానికి గురిచేశాయి’ అని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.

Updated : 25 Nov 2022 08:25 IST

తెరాసను ఇబ్బంది పెట్టేందుకే ఇదంతా..
ఐటీ అధికారులపై మల్లారెడ్డి ఆరోపణ
భాజపా పాలిత రాష్ట్రాల్లో ఎందుకు చేయడం లేదని ప్రశ్న

కార్ఖానా, న్యూస్‌టుడే: ‘ఆదాయపన్ను శాఖ సోదాలు నాకు కొత్త కాదు. 1994, 2008లలోనూ తనిఖీలు జరిగాయి. ఈసారి తనిఖీలు తీవ్ర మనస్తాపానికి గురిచేశాయి’ అని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన తన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డిని బోయిన్‌పల్లిలోని ఆయన ఇంట్లో కలిశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.భాజపా సర్కారు వందల మంది అధికారులను ఇతర రాష్ట్రాల నుంచి రప్పించి ఐటీ సోదాలు చేయించడంతోపాటు సీఆర్పీఎఫ్‌ బలగాలతో భయభ్రాంతులకు గురిచేసిందన్నారు. తామేదో స్మగ్లింగ్‌, హవాలా చేస్తున్నట్లుగా.. తన కుటుంబసభ్యులను భయపెట్టారని, ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. మూడు రోజులపాటు జరిపిన సోదాల్లో కేవలం రూ.28 లక్షలు మాత్రమే తన వద్ద లభించాయని, రూ.కోట్లు లభిస్తాయని ఐటీ అధికారులు ఆశించారన్నారు. భాజపా ప్రభుత్వం ఇలా కుట్రపూరితంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తమ కళాశాలల్లో రూ.100 కోట్లు డొనేషన్లు తీసుకున్నట్లు తన పెద్ద కుమారుడితో బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని మంత్రి ఆరోపించారు. నిజంగా అలా తీసుకుని ఉంటే డబ్బు ఉండాలి కదా? అని ప్రశ్నించారు. ఇదే విషయంపై తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. సోదాలు జరిపిన సందర్భంలో అధికారులు సీజ్‌ చేసి, మరిచిపోయిన ల్యాప్‌ట్యాప్‌ను బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించామని మంత్రి తెలిపారు. తెరాస ప్రభుత్వాన్ని, మంత్రులను ఇబ్బందులకు గురిచేసేందుకే దర్యాప్తు సంస్థలను కేంద్రం ఉసిగొల్పుతోందని ఆరోపించారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో ఐటీ, ఈడీ దాడులు ఎందుకు జరగడం లేదని ఆయన ప్రశ్నించారు.

నా కుమార్తె కన్నీళ్లు పెట్టుకున్నా పట్టించుకోలేదు: రాజశేఖర్‌రెడ్డి

ఐటీ అధికారులు సోదాలు చేసిన సమయంలో తాను భార్యతో కలిసి విదేశాల్లో పర్యటిస్తున్నానని మర్రి రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. 75 ఏళ్లు పైబడిన తన తల్లితండ్రులనూ అధికారులు ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. తన కుమార్తె శ్రేయారెడ్డిని బ్యాంకుల చుట్టూ తిప్పి.. భయభ్రాంతులకు గురిచేశారని, కనీసం మహిళా కానిస్టేబుల్‌ను వెంట తీసుకెళ్లలేదని దుయ్యబట్టారు. ఆమె భయంతో కన్నీళ్లు పెట్టుకున్నా, అధికారులు పట్టించుకోకుండా విచారణ పేరుతో ఇబ్బందులకు గురిచేయడం మరింత బాధించిందని తెలిపారు. తన నివాసంలో లభించిన రూ.2 కోట్లు తమ అయిదు కళాశాలల సిబ్బంది జీతాల కోసం అందుబాటులో ఉంచినవని చెప్పారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని