సంక్షిప్త వార్తలు(9)

రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై వివిధ శాఖల అధికారులకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీహెచ్‌ఆర్‌డీఐ)లో నిర్వహించిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమం గురువారం ముగిసింది.

Updated : 25 Nov 2022 06:42 IST

ప్రభుత్వ పథకాలపై అధికారులకు శిక్షణ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై వివిధ శాఖల అధికారులకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీహెచ్‌ఆర్‌డీఐ)లో నిర్వహించిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమం గురువారం ముగిసింది. తెలంగాణ నీటి పారుదల రంగం అభివృద్ధి, ఆర్ధిక వనరులు, వ్యవసాయం, సంక్షేమం, వైద్యం, విద్య తదితర అంశాలపై అధికారులకు నిపుణులతో అవగాహన కల్పించినట్లు ఎంసీహెచ్‌ఆర్‌డీఐ డైరెక్టర్‌ జనరల్‌ మహేశ్‌ బెనహర్‌ దత్‌ ఎక్కా తెలిపారు. శిక్షణ పొందిన వారికి ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేశారు.


పెన్షన్‌ పేమెంట్‌ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘానికి అనుబంధంగా ఏర్పాటైన పెన్షన్‌ పేమెంట్‌ అధికారుల సంఘం నూతన కార్యవర్గం గురువారం ఎన్నికైంది. టీజీవో భవన్‌లో జరిగిన సమావేశంలో సంఘం అధ్యక్షురాలిగా అంజుమ్‌, కార్యదర్శిగా ప్రభాకర్‌ శ్రీవాస్తవ, సహాధ్యక్షుడిగా తాజుద్దీన్‌, కోశాధికారిగా ఖలీల్‌, ఇతర ప్రతినిధులుగా పార్వతీదేవి, సయ్యద్‌ ముజమ్మిమల్‌, శ్రీనివాసరావు, ముఖీం ఎన్నికయ్యారు. కొత్త కార్యవర్గాన్ని టీజీవో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మమత, సత్యనారాయణ, నేతలు కృష్ణయాదవ్‌, వెంకటేశ్వర్లు సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.


నల్గొండ సీఈ స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు ప్రభుత్వం ఆమోదం

ఈనాడు, హైదరాబాద్‌: నీటి పారుదల శాఖ నల్గొండ ముఖ్య ఇంజినీరు (సీఈ) ఎం.శ్రీకాంత్‌రావు తన ఉద్యోగం నుంచి స్వచ్ఛందంగా వైదొలగనున్నారు. ఉద్యోగ విరమణ కోసం 2నెలల క్రితం ఆయన ప్రభుత్వానికి చేసుకొన్న దరఖాస్తును ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ గురువారం ఆమోదించారు.


ఎంఆర్‌సీ, సీఆర్‌సీ నిధులు  విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వం మండల రీసోర్స్‌ సెంటర్‌(ఎంఆర్‌సీ), క్లస్టర్‌ రీసోర్స్‌ సెంటర్‌ (సీఆర్‌సీ)లకు రూ.5.9 కోట్లు విడుదల చేసింది. వీటిని ఎంఈఓ, స్కూల్‌ కాంప్లెక్స్‌ కార్యాలయాల నిర్వహణకు వినియోగిస్తారు.


తాటిని తన్నేలా ఈత!

సాధారణంగా ఈత చెట్టు పది నుంచి పదిహేను అడుగుల ఎత్తు పెరుగుతుంది. కానీ కామారెడ్డి జిల్లా మద్నూర్‌ గ్రామ సమీపంలో మేనూర్‌ శివారులో ఉన్న ఈత చెట్టు మాత్రం ఏకంగా 70 అడుగుల ఎత్తు పెరిగి తాటి చెట్టులాగా కనిపిస్తోంది. 

న్యూస్‌టుడే, మద్నూర్‌


పీజీ వైద్య, దంత విద్య సీట్లకు మరో విడత ప్రవేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: కన్వీనర్‌ కోటాలో పీజీ వైద్య, దంత విద్య సీట్ల భర్తీకి శుక్రవారం (ఈ నెల 25) వరకు మరో విడత ప్రవేశ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే మొదటి, రెండో విడతల్లో ప్రవేశాలు పొందిన అభ్యర్థులు ఈ విడత కౌన్సెలింగుకు అనర్హులు. సీట్ల ఖాళీలను విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. అర్హులైన అభ్యర్థులు ప్రాధాన్య క్రమంలో కళాశాలల వారీగా వెబ్‌ఆప్షన్లను నమోదు చేసుకోవాలని ఆరోగ్య వర్సిటీ సూచించింది.

పీఈసెట్‌ తుది విడతలో 640 మందికి సీట్లు

పీఈసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌లో కన్వీనర్‌ కోటాలో 1,307 సీట్లు అందుబాటులో ఉండగా 640 మందికి బీపీఎడ్‌, డీపీఎడ్‌ సీట్లు దక్కాయి. అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోపు ఆయా కళాశాలల్లో చేరాలని ప్రవేశాల కన్వీనర్‌ ఆచార్య రమేశ్‌బాబు సూచించారు. తొలి విడతలో 914 మందికి సీట్లు దక్కగా.. వారిలో 552 మంది కళాశాలల్లో రిపోర్ట్‌ చేశారు.

28, 29 తేదీల్లో స్పోర్ట్స్‌ కోటా సర్టిఫికెట్ల పరిశీలన

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ నర్సింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్‌ ఉద్యాన విశ్వవిద్యాలయానికి సంబంధించిన బైపీసీ స్ట్రీమ్‌ కోర్సులకు స్పోర్ట్స్‌ కోటాలో ప్రవేశాలకు సర్టిఫికెట్ల పరిశీలనను ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. వెటర్నరీ, వ్యవసాయ, ఉద్యాన కోర్సులకు స్పోర్ట్స్‌ కోటాలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ చూడాలన్నారు.


రైల్వే సిగ్నలింగ్‌లో వేగవంతమైన పురోగతి

ఈనాడు, హైదరాబాద్‌: భారతీయ రైల్వే సాంకేతికతను అందిపుచ్చుకుంటూ కమ్యూనికేషన్స్‌, సిగ్నలింగ్‌ రంగంలో వేగవంతమైన పురోగతి సాధించిందని రైల్వే బోర్డు సభ్యుడు(మౌలిక సదుపాయాలు) ఆర్‌.కె.మంగ్లా పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఇండియన్‌ రైల్వేస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సిగ్నల్‌ ఇంజినీరింగ్‌, టెలికమ్యూనికేషన్స్‌(ఇరిసెట్‌) 65వ వార్షికోత్సవం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆర్‌.కె.మంగ్లా ప్రసంగించారు. కమ్యూనికేషన్స్‌, సిగ్నలింగ్‌ రంగంలో సాంకేతిక పురోగతి సాధించడంలో ఇరిసెట్‌ పోషిస్తున్న పాత్ర కీలకమైందని ఆయన అన్నారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ మాట్లాడుతూ- సిగ్నలింగ్‌, కమ్యూనికేషన్‌ రంగంలో ఇరిసెట్‌ లక్ష మందికి శిక్షణ అందించిందని తెలిపారు.


ఆర్టీసీలో మరో ఆరు నెలలపాటు సమ్మెల నిషేధం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్టీసీలో మరో ఆరు నెలలపాటు సమ్మెలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబరు ఒకటో తేదీ నుంచి ఈ నిషేధం అమలులోకి వస్తుంది. గతంలో విధించిన నిషేధం ఈ నెలాఖరుతో ముగియనుండటంతో మరో దఫా పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అత్యవసర సేవల పరిధిలో ఆర్టీసీ ఉండటంతో ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.


రెగ్యులర్‌ పదోన్నతులు కల్పించండి
 నీటిపారుదల శాఖ హైదరాబాద్‌ ఇంజినీర్ల సంఘం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వం నీటిపారుదల శాఖలో రెగ్యులర్‌ పదోన్నతులపై దృష్టిసారించి అందరికీ న్యాయం చేయాలని ఆ శాఖ హైదరాబాద్‌ ఇంజినీర్ల సంఘం కోరింది. ఈ మేరకు సంఘం గౌరవ అధ్యక్షుడు సి.మహేందర్‌, అధ్యక్షుడు ఏఎస్‌ఎన్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చక్రధర్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌ జల వనరుల శాఖలో సీనియారిటీ జాబితాలు 2018లో ఖరారు కావడంతో ఆ రాష్ట్రంలో అందరికీ రెగ్యులర్‌ పదోన్నతులు లభించాయని, తెలంగాణలో ఇప్పటికి తాత్కాలిక పదోన్నతులే అమలవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చట్టం ప్రకారం సీనియారిటీని నిర్ధారించి 2018లో ఏపీ పంపిన జాబితాలను అమలుచేసి ఉంటే ఇప్పటివరకు పూర్తిస్థాయి పదోన్నతులు వచ్చేవని తెలిపారు. అవి రాష్ట్రంలో అమలుకాకుండా కొందరు అడ్డుకున్నారని ఆరోపించారు. ఉద్యోగుల పదోన్నతులు, ఇతర అంశాల్లోని వ్యత్యాసాలను కొంతైనా తొలగించేందుకు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గత మే 28న జారీ చేసిన మెమోను పక్కనపెట్టి ఇటీవల తాత్కాలిక పదోన్నతులు కల్పించడం తగదని వారు పేర్కొన్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని