Govt Jobs: త్వరలో గ్రూప్‌ 2, 3!

రాష్ట్రంలో గ్రూప్‌-2, 3 కేటగిరీల్లో పోస్టులు పెరగనున్నాయి. ఇప్పటికే అనుమతించిన వాటికి అదనంగా ఇతర విభాగాల్లో గుర్తించినవీ చేరనున్నాయి.

Published : 25 Nov 2022 05:29 IST

రెండింటిలో మరిన్ని పోస్టుల పెరుగుదల
నోటిఫికేషన్ల జారీకి టీఎస్‌పీఎస్సీ కసరత్తు  
అదనంగా మరికొన్ని కేటగిరీలు
ప్రభుత్వ విభాగాల ప్రతిపాదనల పరిశీలన పూర్తి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గ్రూప్‌-2, 3 కేటగిరీల్లో పోస్టులు పెరగనున్నాయి. ఇప్పటికే అనుమతించిన వాటికి అదనంగా ఇతర విభాగాల్లో గుర్తించినవీ చేరనున్నాయి. రాష్ట్రంలో గ్రూప్స్‌, ఇతర సర్వీసు ఉద్యోగాల వర్గీకరణలో భాగంగా గ్రూప్‌-2, 3 కేటగిరీల్లోకి మరిన్ని పోస్టులను ప్రభుత్వం చేర్చింది. ఈ మేరకు పోస్టుల వర్గీకరణ, పరీక్ష, ఎంపిక విధానం నిబంధనలకు సవరణలు చేస్తూ జీవో నం.136 జారీ చేసింది. దీంతో ఈ ప్రకటనల జారీకి సాంకేతికపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. గ్రూప్‌-2లో ప్రభుత్వం కొత్తగా అనుమతించిన పోస్టులకు సంబంధించి ప్రభుత్వ విభాగాల నుంచి కమిషన్‌కు ఇప్పటికే ప్రతిపాదనలు అందాయి. వాటి పరిశీలన పూర్తయింది. అదనంగా చేర్చినవాటితో కలిపి త్వరలో గ్రూప్‌-2, 3 నోటిఫికేషన్లు జారీ చేసేందుకు టీఎస్‌పీఎస్సీ కసరత్తు పూర్తి చేసింది. తొలుత గ్రూప్‌-2, ఆ తరువాత వారం నుంచి 15 రోజుల వ్యవధిలో గ్రూప్‌-3 నోటిఫికేషన్‌ వచ్చే అవకాశముంది. డిసెంబరు నాటికి ఈ రెండు నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.

అదనంగా మరిన్ని పోస్టులు..

గ్రూప్‌-2 కింద 663 పోస్టులు, గ్రూప్‌-3 కింద 1,373 పోస్టులను గుర్తిస్తూ ఈ ఏడాది ఆగస్టు 30న ప్రభుత్వం జీవో జారీ చేసింది. వీటికి అదనంగా వేర్వేరు విభాగాల్లో గ్రూప్‌-2, గ్రూప్‌-3 స్థాయి కలిగిన మరిన్ని పోస్టుల భర్తీకి అనుమతిచ్చింది. ఇలా అదనంగా చేర్చిన పోస్టులకు వేరుగా పరీక్ష నిర్వహించడం కన్నా.. తత్సమాన హోదా కలిగిన పోస్టులతో కలిపి నోటిఫికేషన్లు జారీ చేయాలని సర్కారు నిర్ణయించింది. సహాయ సంక్షేమాధికారి పోస్టులకు గతంలో వేరుగా ప్రకటనలు వచ్చేవి. ఈ పోస్టులు తహసీల్దారు కన్నా ఎక్కువ హోదా కలిగినవి. వీటికి ప్రత్యేక నియామకాలు చేపట్టే బదులు గ్రూప్‌-2 కేటగిరీలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రూప్‌-2 కేటగిరీలో ఎక్కువ హోదా కలిగిన ఈ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలు ఇప్పటికే రోస్టర్‌వారీగా ప్రతిపాదనలు రూపొందించి టీఎస్‌పీఎస్సీకి అందించాయి. ఇదే తరహాలో ప్రభుత్వ విభాగాల్లో సహాయ సెక్షన్‌ అధికారుల పోస్టులు పెరగనున్నాయి. సంక్షేమశాఖల్లో ఎస్సీ(17), ఎస్టీ(9), బీసీ(17) సహాయ సంక్షేమాధికారి పోస్టులు కలిపి 43 ఉన్నట్లు సమాచారం. శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని జువైనల్‌ సర్వీసు విభాగంలో 11 జిల్లా ప్రొబేషనరీ అధికారి పోస్టులను గ్రూప్‌-2తో పాటే కమిషన్‌ భర్తీ చేయనుంది. సహాయ సెక్షన్‌ అధికారులవి కలిపి గ్రూప్‌-2లో మరో 100-150 వరకు పోస్టులు పెరిగే అవకాశముంది. ఇదేవిధంగా గ్రూప్‌-3లో ప్రస్తుతం అనుమతించిన 1,373 పోస్టులకు అదనంగా మరిన్ని చేరే అవకాశముంది.

గ్రూప్‌-3లో మరో రెండు సర్వీసులు..

గ్రూప్‌-3లో ప్రస్తుతం ఎనిమిది కేటగిరీల ఉద్యోగాలున్నాయి. కొత్తగా మరో రెండు సర్వీసులను చేర్చడంతో వీటి సంఖ్య పదికి చేరింది. కొత్తగా అకౌంటెంట్‌(గిరిజన సంక్షేమ సేవలు), ఇతర విభాగాధిపతుల కార్యాలయాల్లో సీనియర్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ అకౌంటెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అకౌంటెంట్‌తో పాటు వీటి తత్సమాన కేటగిరీ ఉద్యోగాలు గ్రూప్‌-3 పరిధిలో ఉంటాయి.

గ్రూప్‌-4లోనూ అదనంగా నాలుగు రకాలు..

గ్రూప్‌-4లో ప్రస్తుతం ఇందులో జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అకౌంటెంట్‌ ఇతర తత్సమాన పోస్టులున్నాయి. వీటికి అదనంగా జువైనల్‌ విభాగం పరిధిలోని సూపర్‌వైజర్‌(పురుషులు), మాట్రన్‌-స్టోర్‌ కీపర్‌, సాంకేతిక విద్య కమిషనరేట్‌లో మాట్రన్‌ పోస్టులతో కలిపి నాలుగు రకాల కేటగిరీ ఉద్యోగాలు వచ్చాయి.


గ్రూప్‌-2లో మరో 6 కేటగిరీలు..

గ్రూప్‌-2 పరిధిలో ప్రస్తుతం 16 రకాల సర్వీసు ఉద్యోగాలు ఉన్నాయి. ఈ కేటగిరీలోకి మరో ఆరు కేటగిరీల పోస్టులను చేర్చింది. సహాయ సెక్షన్‌ అధికారి(రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సేవలు), సహాయ సెక్షన్‌ అధికారి(ఇతర విభాగాలు), జిల్లా ప్రొబేషనరీ అధికారులు(జువైనల్‌ విభాగం), సహాయ బీసీ సంక్షేమ అధికారులు, సహాయ గిరిజన సంక్షేమాధికారులు, సహాయ సాంఘిక సంక్షేమ అధికారుల పోస్టుల్ని కొత్తగా చేర్చింది. దీంతో గ్రూప్‌-2 పరిధిలోకి మొత్తం 22 రకాల పోస్టులు వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని