నగల వ్యాపారి సుకేశ్‌ గుప్తాకు ఊరట

హైదరాబాద్‌లోని ముసద్దిలాల్‌ జెమ్స్‌ అండ్‌ జ్యుయెల్స్‌ యజమాని సుకేశ్‌ గుప్తాకు హైకోర్టులో ఊరట లభించింది.

Published : 25 Nov 2022 03:33 IST

 తాకట్టు వ్యవహారంలో  క్రిమినల్‌ కేసు కొట్టివేత

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని ముసద్దిలాల్‌ జెమ్స్‌ అండ్‌ జ్యుయెల్స్‌ యజమాని సుకేశ్‌ గుప్తాకు హైకోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు అయనపై నమోదు చేసిన క్రిమినల్‌ కేసును న్యాయస్థానం గురువారం కొట్టివేసింది. ఎస్‌ఆర్‌ఈఐ ఎక్విప్‌మెంట్స్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ నుంచి సుకేశ్‌ గుప్తాతోపాటు మరో ఇద్దరు రూ.110 కోట్ల రుణం పొందారు. ఆప్పట్లో కింగ్‌కోఠిలోని 28,106 చదరపు అడుగుల ఇల్లు, హఫీజ్‌పేటలోని 8 ఎకరాల 8 గుంటల స్థలాన్ని మార్టిగేజ్‌ చేశారు. కొన్నాళ్లు వాయిదాలు చెల్లించిన అనంతరం చెల్లింపులు నిలిపివేయడంతో హఫీజ్‌పేట స్థలాన్ని ఫైనాన్స్‌ సంస్థ వేలంలో విక్రయించింది. దీంతో దాదాపు రూ.102 కోట్లు సమకూరాయి. అప్పటికీ వడ్డీ, ఇతరత్రా కలిపి రూ.58.9 కోట్లు బకాయి ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ క్రమంలో సంస్థ, సుకేశ్‌కు మధ్య పరస్పర ఒప్పందం జరిగింది. ఈమేరకు ఆ సంస్థకు ఆయన చెక్కులు ఇచ్చారు. అయినా ఆయనపై సంస్థ పలు కేసులు వేసింది. వాటిని కొట్టివేయాలంటూ హైకోర్టును సుకేశ్‌ ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ కె.సురేందర్‌ ధర్మాసనం విచారణ జరిపింది. కేసులో క్రిమినల్‌ అంశాలు లేవని.. సివిల్‌ అంశాలు మాత్రమే ఉన్నాయన్న పిటిషనర్‌ వాదనతో ఏకీభవించింది. కాగా, చట్టవిరుద్ధంగా నగల కొనుగోలు ఆరోపణలపై సుకేశ్‌ను ఈడీ గతంలో అరెస్ట్‌ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని