మరికొందరి చుట్టూ ఉచ్చు?

ఎమ్మెల్యేలకు ఎర కేసు త్వరలో మరికొందరి మెడకు చుట్టుకునేలా ఉంది. వీరిలో ప్రముఖులు కూడా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.

Published : 25 Nov 2022 03:33 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఎమ్మెల్యేలకు ఎర కేసు త్వరలో మరికొందరి మెడకు చుట్టుకునేలా ఉంది. వీరిలో ప్రముఖులు కూడా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కుట్రతో అనేకమందికి సంబంధం ఉందని, నిందితులు ఇంకా చాలామందిని సంప్రదించారని, ఎమ్మెల్యేల కొనుగోలుపై వాట్సప్‌ సంభాషణలు సాగించారని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇందులో అనేక మంది ప్రముఖులు కూడా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారి చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న నాలుగు ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను ఫోరెన్సిక్‌ విశ్లేషణకు పంపారు. నిందితులు ఎవరెవరితో మాట్లాడారు, ఏం మాట్లాడారనే కీలక ఆధారాలు వీటి ద్వారానే పోలీసులకు లభించాయి. స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల నుంచి ఫలానా సమాచారం కావాలంటూ పోలీసులు తమకు రోజుకో విజ్ఞప్తి పంపుతున్నారని ఫోరెన్సిక్‌ విభాగానికి చెందిన ఓ అధికారి వెల్లడించారు. దీన్నిబట్టి ఈ కేసులో డిజిటల్‌ ఆధారాల ప్రాధాన్యం అర్థం చేసుకోవచ్చు.

సోదాలు తప్పవా?

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పెద్దమొత్తంలో నగదు లావాదేవీల చర్చ జరిగినట్లు చెబుతున్నా.. ఒక్క రూపాయి కూడా పోలీసులకు దొరకలేదు. ఒప్పందం కుదిరితే నలుగురు ఎమ్మెల్యేలకు కలిపి రూ.250 కోట్లు చెల్లించాలనుకున్నారని పోలీసులు నమోదు చేసిన కేసులో పేర్కొన్నారు. ఆ డబ్బును ఎలా సమకూర్చుకోవాలనుకున్నారనే అంశంపైనా సిట్‌ అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొందరు ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఘర్షణ వాతారణంపై ఆందోళన

ఈ కేసుల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర విభాగాల మధ్య పెరుగుతున్న ఘర్షణ వాతావరణంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి ఇంట్లో సోదాల సందర్భంగా సీఆర్పీఎఫ్‌ సిబ్బంది దాదాపు బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. ఆయన కుమారుడి ఫిర్యాదు ఆధారంగా ఆదాయపన్నుశాఖ డిప్యూటీ డైరెక్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. రాబోయే రోజుల్లో ఇలానే ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే అవకాశం ఉందని, ఇది మంచి పరిణామం కాదని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts