ఎమ్మెల్యేలకు ఎర కేసు.. ‘నిందితుల కస్టడీ’ పిటిషన్‌ కొట్టివేత

‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో మరోసారి నిందితులను కస్టడీకి అనుమతించాలంటూ దాఖలైన పిటిషన్‌ను అవినీతి నిరోధక శాఖ (అనిశా) ప్రత్యేక కోర్టు గురువారం కొట్టివేసింది.

Published : 25 Nov 2022 04:03 IST

ఈనాడు, హైదరాబాద్‌: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో మరోసారి నిందితులను కస్టడీకి అనుమతించాలంటూ దాఖలైన పిటిషన్‌ను అవినీతి నిరోధక శాఖ (అనిశా) ప్రత్యేక కోర్టు గురువారం కొట్టివేసింది. ముగ్గురు నిందితులను ఇదివరకే రెండు రోజుల కస్టడీకి అనుమతించామని.. మరోసారి ఇవ్వడం కుదరదని ‘సిట్‌’ అధికారులకు తేల్చి చెప్పింది. నిందితులను విచారించేందుకు ‘సిట్‌’ తొలిసారి దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను కోర్టు అనుమతించగా.. ఈ నెల 10, 11 తేదీల్లో అదుపులోకి తీసుకుని పలు విషయాలపై ప్రశ్నించింది. అప్పుడే వారి సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను స్వాధీనం చేసుకుని వాటిలోంచి కొంత సమాచారాన్ని ‘సిట్‌’ సేకరించింది. ఆ తర్వాత నిందితుల రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. సేకరించిన సమాచారానికి సంబంధించి నిందితులను మరోసారి ప్రశ్నించాల్సి ఉందని ఈ నెల 19న ‘సిట్‌’ మరో పిటిషన్‌ వేసి ఐదు రోజుల కస్టడీకి అనుమతించాలంటూ కోర్టుకు విన్నవించింది. వీరిని అనవసరంగా 25 రోజులకు పైగా చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌ ఖైదీలుగా ఉంచారని, కస్టడీకి మరోసారి అనుమతించొద్దంటూ నిందితుల తరఫు న్యాయవాదులు న్యాయస్థానాన్ని కోరారు. వాద, ప్రతివాదనల అనంతరం అనిశా ప్రత్యేక కోర్టు కస్టడీ పిటిషన్‌ను కొట్టివేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని