విధుల బహిష్కరణ.. పోడు సర్వే నిలుపుదల

ఎఫ్‌ఆర్వో శ్రీనివాసరావు హత్యతో ఆందోళనలో ఉన్న అటవీ ఉద్యోగులు గురువారం క్షేత్రస్థాయి విధుల్ని బహిష్కరించారు.

Updated : 25 Nov 2022 05:14 IST

మా ప్రాణాలకు భద్రత కల్పిస్తేనే పనిచేస్తాం
స్పెషల్‌ సీఎస్‌, పీసీసీఎఫ్‌ల ఎదుట అటవీ అధికారుల ఆందోళన

ఈనాడు, హైదరాబాద్‌: ఎఫ్‌ఆర్వో శ్రీనివాసరావు హత్యతో ఆందోళనలో ఉన్న అటవీ ఉద్యోగులు గురువారం క్షేత్రస్థాయి విధుల్ని బహిష్కరించారు. పోడు భూముల సర్వేను రాష్ట్రవ్యాప్తంగా నిలిపివేశారు. గ్రామసభలకూ హాజరుకాలేదు. తమ ప్రాణాలకు భద్రత కల్పిస్తేగానీ అటవీ ప్రాంతాల్లో విధులు నిర్వహించేది లేదని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో వారి రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తామని అటవీశాఖ హామీ ఇచ్చింది. జూనియర్‌ అటవీ అధికారుల అసోసియేషన్‌, రేంజర్లు, రాష్ట్ర అటవీ అధికారుల సంఘం ప్రతినిధులు అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పీసీసీఎఫ్‌ ఆర్‌ఎం డోబ్రియాల్‌లతో విడివిడిగా సమావేశమయ్యారు. అనంతరం డోబ్రియాల్‌.. డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి పోలీసుశాఖ సహకారం కోరారు. అంతకుముందు అధికారుల సంఘం నేతలు స్పెషల్‌ సీఎస్‌, పీసీసీఎఫ్‌లకు పలు డిమాండ్లతో వినతిపత్రం అందించారు. సిబ్బంది రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తామని డోబ్రియాల్‌ హామీ ఇచ్చారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి త్వరగా పరిష్కారమయ్యేలా చూస్తామని చెప్పారు.

వినతిపత్రంలోని ప్రధానాంశాలు.. 

* గొత్తికోయలు పోడు సాగుదారుల కిందకు రారు. వారిని అటవీ ఆక్రమణదారులుగా గుర్తించి.. తక్షణం బయటకు పంపించే కార్యాచరణను ప్రభుత్వం  చేపట్టాలి.

* క్షేత్రస్థాయి ఉద్యోగులు, సిబ్బంది రక్షణకు ఆయుధాలను ఇచ్చే ప్రతిపాదనను వెంటనే పరిష్కరించాలి. ప్రత్యేక ఫారెస్ట్‌ స్టేషన్లు ఏర్పాటుచేయాలి.

* ప్రతి రేంజ్‌కు ఆయుధాలతో సీఆర్పీఎఫ్‌ లేదా ప్రత్యేక పోలీసులను తక్షణం కేటాయించాలి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రేంజ్‌కు తగిన భద్రత కల్పించే వరకు క్షేత్రస్థాయి విధులు నిర్వహించేది లేదు.

* ఆక్రమణల నుంచి స్వాధీనం చేసుకుని మొక్కలు నాటిన భూముల్లో పోడు సర్వే చేయం.

* హత్యకు గురైన ఎఫ్‌ఆర్వో కుటుంబానికి రూ.5 కోట్ల పరిహారం ఇవ్వాలి. ఖమ్మం జిల్లా కేంద్రంలో 500 గజాల్లో ఇల్లు కట్టి ఇవ్వాలి. కుటుంబంలో ఒకరికి గెజిటెడ్‌ హోదా కలిగిన ఉద్యోగం ఇవ్వాలి.

* అటవీ ఆక్రమణలకు బెయిల్‌కు వీల్లేని కేసులు పెట్టే విధంగా చట్టాన్ని సవరించాలి.

* తాజా ఆక్రమణలు జరగకుండా, రాజకీయ మద్దతు లేకుండా చూడాలి.


రాజకీయ నాయకుల వైఖరి సరికాదు: విశ్రాంత అధికారుల సంఘం

అటవీ భూముల క్రమబద్ధీకరణపై రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న వైఖరిని విశ్రాంత అటవీ అధికారుల సంఘం (తెలంగాణ, ఏపీ) ఆక్షేపించింది. పార్టీలు, నాయకులు అటవీ భూములపై తప్పుడు హామీలు ఇచ్చినంతకాలం అధికారులపై దాడులు జరుగుతూనే ఉంటాయని సంఘం కార్యదర్శి బి.ఎం.స్వామిదాస్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అధికారులపై దాడులు జరిగే అవకాశం ఉందని నాలుగేళ్ల క్రితమే అప్పటి పీసీసీఎఫ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని