బోయినపల్లి అభిషేక్‌కు 14 రోజుల రిమాండ్‌

దిల్లీ మద్యం కుంభకోణంలో హైదరాబాద్‌కు చెందిన బోయినపల్లి అభిషేక్‌కు దిల్లీ రౌస్‌ అవెన్యూ సీబీఐ న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది.

Updated : 25 Nov 2022 05:11 IST

విజయ్‌ నాయర్‌కు మరో రెండు రోజుల ఈడీ కస్టడీ
దిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ న్యాయస్థానం ఆదేశాలు

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కుంభకోణంలో హైదరాబాద్‌కు చెందిన బోయినపల్లి అభిషేక్‌కు దిల్లీ రౌస్‌ అవెన్యూ సీబీఐ న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) కమ్యూనికేషన్స్‌ విభాగం ఇన్‌ఛార్జి విజయ్‌ నాయర్‌ ఈడీ కస్టడీని మరో రెండు రోజులు పొడిగించింది. ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలతో అభిషేక్‌, విజయ్‌లను గతంలో సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విజయ్‌నాయర్‌ నుంచి ఇంకా సమాచారం రాబట్టాల్సి ఉన్నందున మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. కాగా కస్టడీని మరో 2 రోజులు పొడిగిస్తూ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు.

ఇంటి భోజనం కావాలి..

దిల్లీ మద్యం కుంభకోణంలో తీహార్‌ జైలులో ఉన్న అరబిందో శరత్‌చంద్రారెడ్డి, పెర్నాడో రికార్డ్‌ ప్రతినిధి బినోయ్‌బాబులకు ఇంటి భోజనానికి అనుమతించాలని వారి న్యాయవాదులు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్‌ స్పందిస్తూ.. వైద్యులు సూచిస్తే అనుమతిస్తామని, దానిని జైలు వంటగదిలోనే తయారు చేయించుకోవాలని పేర్కొన్నారు.

* తాము ఎంపిక చేసుకున్న పుస్తకాలు చదువుకునేందుకు అవకాశం కల్పించాలంటూ శరత్‌చంద్రారెడ్డి, అభిషేక్‌ తమ న్యాయవాదుల ద్వారా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి విజ్ఞప్తి చేయించారు. జైలులోనే చాలా పుస్తకాలు ఉంటాయని, వాటిని చదువుకోవచ్చుగా అని జడ్జి ప్రశ్నించారు. ఎంపిక చేసుకున్న పుస్తకాలు అందించేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా.. అందుకు జడ్జి అనుమతించారు. ‘థింక్‌ లైక్‌ ఏ మాంక్‌’, ‘ఇకిగాయ్‌’  ‘వన్‌ స్మాల్‌ స్టెప్‌ కెన్‌ ఛేంజ్‌ యువర్‌ లైఫ్‌’ పుస్తకాలను వారు తెప్పించుకున్నారు.


అభిషేక్‌, విజయ్‌లకు దిల్లీ హైకోర్టు నోటీసులు

అభిషేక్‌, విజయ్‌లకు దిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రత్యేక న్యాయస్థానం వారికి బెయిల్‌ ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్‌ యోగేష్‌ ఖన్నా ఏకసభ్య ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. సీబీఐ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ‘‘అత్యంత తీవ్రమైన ఆర్థిక నేరాల్లో అరెస్టయిన నిందితుల విచారణ కీలక దశలో ఉన్నప్పుడు ట్రయల్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదు. వారు విడుదలైతే దర్యాప్తుపై ప్రతికూల ప్రభావం పడుతుంది’’ అని ధర్మాసనానికి న్యాయవాదులు తెలిపారు. ఈ దశలో జోక్యం చేసుకున్న జస్టిస్‌ యోగేష్‌ ఖన్నా.. ప్రస్తుతం వారు ఈడీ కస్టడీలో ఉన్నందున స్పెషల్‌ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయలేమన్నారు. సీబీఐ ఆరోపణలపై స్పందన తెలియజేయాలని నిందితులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను డిసెంబరు 5కి వాయిదా వేశారు.


ఈడీ అధికారులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు: హైకోర్టులో పిటిషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: దిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో నిందితుడైన శరత్‌చంద్రారెడ్డికి చెందిన ట్రైడెంట్‌ కెమ్‌ఫర్‌ రీటైల్‌ ఆపరేషన్స్‌ విభాగాధిపతి ఇ.చందన్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 16న తన ఇంట్లో సోదాలు నిర్వహించిన సమయంలో ఈడీ అధికారులు దురుసుగా ప్రవర్తిస్తూ తీవ్రంగా కొట్టారని, థర్డ్‌ డిగ్రీ పద్ధతులు ప్రయోగించారని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్‌ దాఖలు చేశారు. తన చెవిపై కొట్టడంతో వినికిడి సమస్యలు తలెత్తాయని, నాలుగు రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందానని వివరించారు. మనీ లాండరింగ్‌ నియంత్రణ చట్టంలోని నిబంధన-6 రాజ్యాంగ చెల్లుబాటును పిటిషనర్‌ సవాల్‌ చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ భాస్కర్‌రెడ్డితో కూడిన ధర్మాసనం విచారించింది. డిసెంబరు 12లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని అధికారులకు సూచించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు పిటిషనర్‌కు నోటీసులు జారీ చేయకుండా సంయమనం పాటించాలంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని