జనవరి 15లోగా ‘డబుల్‌’ లబ్ధిదారుల ఎంపిక

నిర్మాణం పూర్తయిన డబుల్‌బెడ్రూం ఇళ్లను కేటాయించేందుకు లబ్ధిదారుల ఎంపికను జనవరి 15వ తేదీలోగా పూర్తిచేయాలని గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

Updated : 25 Nov 2022 05:09 IST

అర్హులకే అందాలి.. గ్రామసభలు నిర్వహించాలి
కలెక్టర్లతో గృహనిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌ : నిర్మాణం పూర్తయిన డబుల్‌బెడ్రూం ఇళ్లను కేటాయించేందుకు లబ్ధిదారుల ఎంపికను జనవరి 15వ తేదీలోగా పూర్తిచేయాలని గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. నిర్మాణ పనుల పురోగతి, లబ్ధిదారుల ఎంపిక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌, హౌసింగ్‌ ప్రత్యేక ప్రధానకార్యదర్శి సునీల్‌శర్మలతో కలిసి బీఆర్‌కేభవన్‌ నుంచి హైదరాబాద్‌ మినహా 32 జిల్లాల కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ మినహా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 1.29 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. అర్హులైన లబ్ధిదారులకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు అందేలా చూడాలని కోరారు. బీపీఎల్‌ కుటుంబాలు, ఆహారభద్రత కార్డులు, అద్దె ఇళ్లలో ఉన్నవారి జాబితాను ఎంపిక చేసి గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని సూచించారు. తుది జాబితాను సంబంధిత ప్రజాప్రతినిధుల ఆమోదంతో పంపాలన్నారు. ‘560 చదరపు అడుగుల విస్తీర్ణం, 100% సబ్సిడీతో ఇళ్లను నిర్మిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.కలెక్టర్లు అంకితభావంతో పనిచేయాలి’ అని మంత్రి కోరారు. ఇంకా 70 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. సోమేశ్‌కుమార్‌ మాట్లాడుతూ లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించడంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. తుది దశలో ఉన్న నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని పేర్కొన్నారు.


సచివాలయం, అమరవీరుల స్మారక స్తూపం పరిశీలన

ఈనాడు, హైదరాబాద్‌: సచివాలయం, అమరవీరుల స్మారక చిహ్నం, 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం నిర్మాణాలను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) సోమేశ్‌కుమార్‌ గురువారం బీఆర్‌కే భవన్‌ పదో అంతస్తు నుంచి తిలకించారు. రెండు పడకగదుల నిర్మాణాలపై సమీక్ష అనంతరం వారు కొత్త నిర్మాణాలను వీక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని